Heart Attack Myths: గుండె పోటు.. ఈ అపోహలు ఉంటే వెంటనే తొలగించుకోండి
ABN , Publish Date - Jun 16 , 2025 | 11:26 PM
హృద్రోగాలకు సంబంధించి జనాల్లో కొన్ని ప్రమాదకరమైన అపోహలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటిని వెంటనే తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ క్షణంలోనైనా ఏ వయసులోని వారైనా గుండె పోటు బారిన పడొచ్చు. గుండె పోటుకు ముందు ముందస్తు సంకేతాలు కూడా ఉండకపోవచ్చు. అయితే, గుండె పోటు విషయంలో జనాల్లో అనేక అపోహలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
గుండె పోటు వయసు మళ్లిన వారిలో ఎక్కువనే భావన తప్పు. ఏ వయసు వారైనా గుండె పోటు బారిన పడొచ్చు. ముఖ్యంగా జీవనశైలి పరంగా చేసే తప్పుల వల్ల గుండె పోటు రిస్క్ పెరుగుతుంది.
హార్ట్ ఎటాక్ నుంచి కోలుకున్న వారు కసరత్తులు చేయొద్దనే భావన కూడా జనాల్లో ఉంది. పూర్తిగా కసరత్తులు మానేస్తే గుండె ఆరోగ్యంపై మరింత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొలెస్టరాల్‌ను తగ్గించే ఔషధాలు తీసుకునే వారు ఏ ఫుడ్ అయినా తినొచ్చన్న భావన కూడా ప్రమాదమే. కొలెస్టరాల్ స్థాయిలను అదుపులో పెట్టుకోవాలంటే ఆహారంపై నియంత్రణ తప్పనిసరి.
వయసుతో పాటు బీపీ పెరగడం సాధారణ విషయమేనన్న భావన కూడా పొరపాటే. బీపీ పెరిగితే రక్తనాళాలు దెబ్బతిని హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది.
విటమిన్లు, ఇతర సప్లిమెంట్స్‌తో గుండె పోటును నివారించొచ్చనేందుకు శాస్త్రపరమైన ఆధారాలేవీ లేవు.
ఏళ్లపాటు ధూమపానం అలవాటు ఉన్న వారు ఈ వ్యసనాన్ని మానేసినా ప్రయోజనం ఉండదని భావించకూడదు. ధూమపానం మానేసిన ఏడాదిలోపే గుండె పోటు ముప్పు ఏకంగా 50 శాతం తగ్గిపోతుంది.
గుండెపోటు పురుషుల్లో ఎక్కువన్న భావన కూడా ముప్పును పెంచుతుంది. 65 ఏళ్లు దాటిన మహిళలు అందరూ గుండె పోటు ముప్పు ఎదుర్కోక తప్పదు.
స్వల్ప స్థాయిలో వచ్చే గుండె పోటుతో ప్రమాదం లేదన్న భావన కూడా రిస్కే. ఇలాంటి సమస్యలు రాబోయే భారీ ముప్పునకు ప్రధాన సంకేతాలు.
బైపాస్ సర్జరీ హృద్రోగాలకు శాశ్వత పరిష్కారమని భావించే వారు కూడా భారీ తప్పు చేస్తున్నట్టే. మళ్లీ మళ్లీ గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోక తప్పదు. కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే లైఫంతా ఆరోగ్యంగా ఉండొచ్చని వైద్యులు భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
అపాన వాయువుకు వేగంగా చెక్ పెట్టే పరిష్కారాలు
మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టెరాల్ మధ్య తేడా ఇదే