Jubilee Hills By Election: అజారుద్దీన్‌కు బొట్టు పెట్టగలవా?.. ఓవైసీతో అమ్మవారి పాట పాడించగలవా?
ABN , Publish Date - Nov 06 , 2025 | 09:44 PM
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడు అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని కేంద్ర మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్‌కు లేదన్నారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారాన్ని గుంజుకెళ్తారని విమర్శించారు.
హైదరాబాద్, నవంబర్ 06: ముస్లిం టోపీ పెట్టుకొని ఓట్లు అడిగే పరిస్థితే వస్తే తన తల నరుక్కుంటానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం హైదరాబాద్ బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టోపీలు పెట్టుకుని పాకిస్తాన్‌ను జోకుతున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు అసలు హిందువులేనా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ముందు వీళ్లను చెక్ చేయాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మూర్ఖుడు అయితే.. ఆయన కొడుకు కేటీఆర్ ఇంకా పెద్ద మూర్ఖుడని అభివర్ణించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్‌కు లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ. లక్ష కోట్లు సంపాదించుకున్నారంటూ కేసీఆర్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తులం బంగారం ఇవ్వడం కాదు.. ఉన్న బంగారాన్ని గుంజుకెళ్తారని జూబ్లీహిల్స్ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఒక్క కేసులో కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పటి వరకు జైలులో పెట్టలేదంటూ బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. కవితక్క జాగ్రత్త.. బావ, అన్న, తమ్ముడు మీద కోపంతో తండ్రిని చూసుకోకుండా ఉండేవంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యంగ్యంగా అన్నారు. రోషం ఉంటే ట్విట్టర్ టిల్లు కేటీఆర్‌ను జైలులో పెట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి కేటీఆర్ కారణమని ఆయన తల్లి చెబుతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో చర్చకు తాము సిద్ధమని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. లక్ష ఓట్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అభ్యర్థి టోపీ పెట్టుకున్నారన్నారు. అజారుద్దీన్‌కు టోపీ పెట్టకుండా ముఖ్యమంత్రి పెట్టుకుంటే.. వేణు మాధవ్ గుర్తుకొచ్చాడన్నారు. దమ్ముంటే వినాయక చవితి రోజు అజారుద్దీన్‌కు బొట్టు పెట్టి వక్రతుండ మహాకాయ అనిపించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి సూటిగా సవాల్ విసిరారు. ఏంఐఏం అధినేత ఓవైసీతో భాగ్యలక్ష్మీ అమ్మవారి పాట పాడించే దమ్ముందా? అంటూ సీఎం రేవంత్‌ను ఈ సందర్భంగా బండి సంజయ్ నిలదీశారు.
ఈ ఎన్నికల వేళ.. మీరంతా ఏకమై బీజేపీని గెలిపించాలంటూ హిందువులకు పిలుపు నిచ్చారు. పాకిస్తాన్ నుంచి నలభై బురఖాలు తెప్పించారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. బురఖాలతో దొంగ ఓట్లు వేయించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓటు వేసే ప్రతి మహిళ ముఖాన్ని చూడాలంటూ ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చార్మినార్‌పై కాషాయ జండా ఎగరవేయడమే తన లక్ష్యమన్నారు.
ఉప ఎన్నికలపై వచ్చిన సర్వేలన్నీ తలకిందులు కావాలని ఆకాంక్షించారు. నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ను చంపింది ఎవరూ? రియాజ్.. డీసీపీపై దాడి చేసింది, గోరక్షకుడు ప్రశాంత్‌పై దాడి చేసింది ఎవరూ అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఈ దాడులు చేసింది ముస్లింలే తప్ప హిందువులు కాదన్నారు. నవీన్ ఖాన్, సునీత బేగం గేలిస్తే కమ్యూనిటీ హాల్స్ అన్ని మసీదులవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల పక్కనున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని వివరించారు. శుక్రవారం ఉదయం పెద్దమ్మ గుడికి తాను వస్తున్నానని..ఎవరోస్తారో రవాలంటూ రాజకీయ పార్టీల నేతలకు ఆయన సవాల్ విసిరారు.