Staff Neglected in MGNREGS: ఉపాధి సిబ్బందిపై ఉదాసీనత
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:54 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రానికి మెటీరియల్ నిధులు రావడానికి ప్రత్యక్షంగానో...
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రానికి మెటీరియల్ నిధులు రావడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వారూ కారణమే. పథకంలో ఇంత ప్రాధాన్యం కలిగిన సదరు సిబ్బందికి కనీస వేతనాలు కూడా దక్కడం లేదు. ఆ ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులో ఇంటర్నల్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ నేటికీ నివేదిక ఇవ్వకపోవడం విచారకరం. డిప్యూటీ సీఎం చొరవ తీసుకుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌తో చర్చలు జరిపితే తప్ప ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్య పరిష్కారమయ్యేలా కన్పించడం లేదు.
ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం నెలకు కేవలం రూ.13,000 నుంచి రూ.15,865 వరకు మాత్రమే గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది. 2019 తర్వాత వారి జీతాల పెంపును పాలకులు విస్మరించారు. ఇవన్నీ ఒకెత్తయితే కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకంలోని ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ వారికి ‘తల్లికి వందనం, రేషన్ కార్డులు, పింఛన్’ వంటి అనేక సదుపాయాలను అధికారులు నిలిపేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు రెండు వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఎస్.ఆర్.డి.ఎస్ (సొసైటీ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్ సర్వీసెస్) నిబంధనల ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయ్యాక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్‌టీఈ (ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయ్)లుగా మార్చాలి. కానీ తొమ్మిదేళ్లు గడచినా ఆ నిబంధనలేవీ అమలు కావడం లేదు. దీంతో సదరు ఉద్యోగులు ఇంక్రిమెంట్లను కూడా కోల్పోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ‘ఉపాధి’లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.
గోనుగుంట్ల శ్రీకాంత్
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News