మహిళల ఉచిత బస్సు వృథా కాకూడదు
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:15 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టబోతుందన్న వార్త ఆనందాన్ని కలిగించింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డనరీ బస్సులకు పరిమితమైన ఈ పథకం మహిళల ఆర్థిక, సామాజిక పరిస్థితులు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టబోతుందన్న వార్త ఆనందాన్ని కలిగించింది. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డనరీ బస్సులకు పరిమితమైన ఈ పథకం మహిళల ఆర్థిక, సామాజిక పరిస్థితులు మరింత మెరుగుపర్చేందుకు ప్రవేశపెట్టబడిందని ప్రభుత్వ ప్రకటన కూడా వెలువడింది. ఈ పథకం వల్ల ప్రభుత్వానికి ఏటా అదనంగా రూ.3,150 కోట్ల భారం పడుతుందని చెపుతున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న దాదాపు ఎనిమిదివేల బస్సుల కొరత ఈ పథకంతో పదివేలకు పెరగబోతుందని, ఇంకా 11,479 మంది సిబ్బందిని కూడా నియమించాల్సి ఉంటుందని గణాంకాలు చెపుతున్నాయి. ప్రభుత్వానికి వాగ్దానాలను నెరవేర్చుకునే ప్రక్రియలో రాజకీయంగా ఇది తప్పనిసరి.
అయితే ఈ పథకం అమలుచేసే ముందు ఆచరణలో సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ఈ పథకం విజయవంతంగా నడుస్తున్నా, క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. టికెట్ కొన్నప్పటికీ నిలబడి ప్రయాణం చేయాల్సిరావటంతో ఎక్కువమంది పురుషులు రైలు, ఆటో, మోటారు సైకిలు వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడంతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయింది. అలాగే మొదటి స్టేజిలోనే బస్సులు మహిళలతో నిండిపోవటంతో మిగిలిన స్టేజీలలో ఆపకుండా వెళ్లిపోవాల్సి వస్తున్నది. ఇది ఆర్టీసీ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నది. కాగా ఉచితం సహజంగానే మనిషికి లేని అవసరాలను జ్ఞప్తికి తెస్తుంది. కొత్త అవసరాలను సృష్టిస్తుంది. ఆ విధంగా చూస్తే అమలవుతున్న చాలాచోట్ల ఈ ఉచిత బస్సు పథకం దాదాపు ఇరవైశాతం వరకూ దుర్వినియోగం అవుతున్నది. దీనర్థం ఈ పథకం మంచిది కాదని కాదు. దీని ప్రాథమిక సూత్రాలను పకడ్బందీగా తయారుచేయాలి. ఇతర రాష్ట్రాలలో ఈ పథకం ప్రయోజనాలను, లోటుపాట్లు సమీక్షించుకుని, కట్టుదిట్టంగా అమలు చేయాలి.
మహిళలలో దివ్యాంగులు, వయోవృద్ధులు, పిల్లలకు ఉచితం వర్తింపచేస్తూ, మిగిలినవారికి ఆ ఉచితాన్ని నిర్దిష్ట ఆదాయం లోపు వారికి పరిమితం చేయటం ఒక పరిష్కారం. అలాగే ఈ పథకం కింద స్త్రీలకు ప్రత్యేక ఉచిత బస్సులు ఏర్పాటు చేసి, వాటిని ప్రధాన మార్గాలలో నిర్దేశిత వేళలలో నడపటం ఒక ఆచరణీయమైన పరిష్కారం. అలాగే సంబంధిత అధికారులు, నిపుణులతో ఒక కమిటీ వేయటం ద్వారా మరిన్ని మెరుగైన సూచనలు, సలహాలు పొందవచ్చు. ఏమైనా ముందుగా ప్రకటించినట్లు మహిళలకు ఆర్థిక, సామాజిక ప్రయోజనం చేకూరేలా... అదే సమయంలో ఇతర ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తకుండా ఈ మహిళల ఉచిత బస్సు పథకం పట్ల ప్రభుత్వం జాగరూకతతో వ్యవహరిస్తుందని ఆశిద్దాం.
ఆర్.వి. రాఘవరావు, అద్దంకి
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News