Share News

Women Leadership: మహిళా సర్పంచ్‌లూ, మీ రాజ్యం మీరే ఏలండి

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:05 AM

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం పూర్తి అయింది. ఎన్నికైనవారు డిసెంబర్ 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 12,728 సర్పంచులు...

Women Leadership: మహిళా సర్పంచ్‌లూ, మీ రాజ్యం మీరే ఏలండి

తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం పూర్తి అయింది. ఎన్నికైనవారు డిసెంబర్ 22న సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 12,728 సర్పంచులు, 1,12,242 మంది వార్డు సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్‌ 243డి ప్రకారం స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించగా, దానిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాల్లో మహిళా రిజర్వేషన్ 50శాతానికి పెంచి అమలు చేస్తున్నారు. దీనివల్ల సగం మంది మహిళలు గ్రామపంచాయతీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ లెక్కన తెలంగాణలో ఎన్నికైన 6,364 ఉంది మహిళా సర్పంచులు, 56,121 మంది మహిళా వార్డు సభ్యులు పరిపాలనా పగ్గాలు చేపట్టనున్నారు.

జనాభాలో సగభాగం ఉన్న స్త్రీలకు పంచాయతీ రాజ్యాధికారంలో సమాన వాటా ఇవ్వడం విప్లవాత్మకమైన పరిణామమే. అయితే మహిళా ప్రజాప్రతినిధులను స్వతంత్రంగా వ్యవహరించనీయకుండా వారి భర్తలు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భర్తల పాత్రే ఎక్కువగా ఉంటోంది. ఫలానా ఊరు సర్పంచ్, ఎంపీటీసీ ఎవరంటే ఆ మహిళ భర్త పేరే ఇప్పటికీ చెబుతున్నారు. గ్రామపంచాయతీలు, మండల పరిషత్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సర్పంచ్‌గా ఆమె బదులు ఆయనే వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, పనులు అవుతున్నాయి. ఈ తతంగమంతా నామినేషన్, ప్రచారం నుంచే మొదలవుతోంది. స్త్రీ పేరు పక్కన భర్త పేరు– లక్ష్మీ కనకయ్య, రమాదేవీ దామోదర్, శివలక్ష్మి సత్యనారాయణ ఇలా అనధికారికంగా మార్చుకుంటున్నారు. ఫ్లెక్సీలు కొట్టిస్తున్నారు, వాట్సాప్‌లో తమ ఇద్దరి ఫొటోలతో ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ వల్ల భార్యను గెలిపించి, భర్త తానే అధికారంలో ఉంటున్నాడు. ఆ ఇల్లాలికి రాజకీయాలు, పరిపాలన తెలియకపోవచ్చు. కానీ తెలుసుకొని స్వతంత్రంగా వ్యవహరించడం కష్టం కాదు. ఇప్పుడు ఎన్నికవుతున్న స్త్రీలలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. అయినా వాళ్లను భర్తలు వంటింటికి పరిమితం చేసి సంతకాలు మాత్రమే చేయించుకుంటున్న స్థితి గ్రామాలలో నెలకొంది.


నామినేషన్ వేసినప్పటి నుంచే అభ్యర్థి పేరు పక్కన సెల్ నెంబరు భర్తదే ఇస్తున్నారు. గెలిచిన తర్వాత అదే అధికారిక నెంబర్ అవుతోంది. జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో ఆమె పేరు పక్కన ఆయన నెంబర్ ఉంటుంది. గ్రామపంచాయతీ సమావేశాలు జరిగినప్పుడు అందులో ఆయన ఉంటాడు. మండల పరిషత్ సమావేశాలు జరిగినప్పుడు మాత్రం బయట తచ్చాడుతాడు. ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ అధిష్ఠానం, శాసనసభ్యుల వద్దకు సర్పంచ్ భర్త మాత్రమే వెడుతున్నాడు. దీనిని ఈ తరం ఛేదించాల్సిన అవసరం ఉంది. దీని నుంచి స్త్రీలు తమకు తామే బయటపడాలి. లేకపోతే రాజ్యాంగ సవరణకు, స్వతంత్ర ప్రతిపత్తికి అర్థం ఉండదు. నూతనంగా ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు పంచాయతీరాజ్ చట్టం, పరిపాలన పుస్తకం చదువుకొని నిధులు, విధులు అధ్యయనం చేసి సర్వస్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే రాజ్యాంగం ద్వారా అందిన హక్కులను నిర్వర్తించిన వాళ్లవుతారు. సలహాలు తీసుకోవచ్చు, చర్చించవచ్చు, నిర్ణయం మాత్రం తామే ప్రకటించాలి. అవసరమైన సందర్భాల్లో అధికారులకు ఆమే ఫోన్ చే‍సి మాట్లాడాలి. ప్రకటనలు చేయాలి. పురుషుని కన్నా శక్తిమంతంగా ఆమె గ్రామ పంచాయతీని నడపగలదు.

అన్నవరం దేవేందర్ (కవి, రచయిత)

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:05 AM