Share News

Bihar Elections: గెలిచే లీడరు ఓడే ఓటరు

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:38 AM

భారత జాతీయ రాజకీయాల్లోనే పెను భూకంపం సృష్టించగలవని భావిస్తున్న బిహార్‌ ఎన్నికలు... తొలిదశ పోలింగ్‌ ద్వారా ఆ మేరకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. 243 సీట్ల అసెంబ్లీలో 121 సీట్లకు జరిగిన....

Bihar Elections: గెలిచే లీడరు ఓడే ఓటరు

భారత జాతీయ రాజకీయాల్లోనే పెను భూకంపం సృష్టించగలవని భావిస్తున్న బిహార్‌ ఎన్నికలు... తొలిదశ పోలింగ్‌ ద్వారా ఆ మేరకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. 243 సీట్ల అసెంబ్లీలో 121 సీట్లకు జరిగిన పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు పోటెత్తిన తీరు అధికార, విపక్ష కూటములు రెండింటి గుండెల్లోనూ గుబులు రేపుతోంది. పైకి ఎవరెంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా... 11న రెండో దశ పోలింగ్ పూర్తయి, 14న ఫలితాలు వెలువడే దాకా నరాలు తెగే ఉత్కంఠే! ఒక రాష్ట్రంలో జరిగే ఏ ఎన్నిక ప్రభావమైనా సాధారణంగా ఆ రాష్ట్రానికే పరిమితం. కానీ, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సంగతి అలా కాదు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ లేక– తెలుగుదేశంతో పాటు జేడీ(యు) పైన అధికంగా ఆధారపడుతున్న బీజేపీ ఒకవైపు; ఎడాపెడా ఉచిత హామీలు, కుల–మత సమీకరణాలు, ఓటు చోరీ ఆరోపణలే తమను గట్టెక్కిస్తాయన్న ఆశాభావంతో కాంగ్రెస్‌–ఆర్జేడీ కూటమి మరో వైపు. నితీశ్‌కుమార్‌, తేజస్వీ యాదవ్‌ మధ్య ప్రత్యక్ష పోరాటమే అనిపిస్తున్నప్పటికీ, వాస్తవంలో మోదీ, రాహుల్‌ మధ్య ప్రచ్ఛన్న యుద్ధమిది. బిహార్‌ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చే పేర్లు... లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌కుమార్‌. మంచో–చెడో ఆ రాష్ట్ర రాజకీయాలపై వారు వేసిన ముద్ర అంత బలమైనది. ప్రస్తుతం 77 ఏళ్ల వయసులో వయోభారం, అనారోగ్యం, స్కాముల తాలూకు కోర్టు కేసుల చికాకుల వల్ల బిహార్‌ ఎన్నికల రంగస్థలంపై లాలూ క్రియాశీలక పాత్ర పోషించడం లేదు. కానీ, 1990లలో రాష్ట్ర రాజకీయాల సమీకరణాలనే సాంతం మార్చేసి, కొత్త మలుపు తిప్పిన ఘనత కచ్చితంగా ఆయనదే. మందిర్‌, మండల్‌ ఉద్యమాలు రెండింటినీ తనకు అనుకూలంగా మలుచుకొని– బలమైన ఎం.వై (ముస్లిం–యాదవ్‌) ఫార్ములా ద్వారా దిగ్విజయయాత్ర సాగించిన రాజకీయ చతురుడు లాలూ.


1990 ఆగస్టులో, అప్పటి వీపీ సింగ్‌ ప్రభుత్వం మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలుపరచడంతో అగ్రకులాలకు చెందిన వారి నిరసనోద్యమం కారణంగా దేశం అట్టుడికిపోయింది. ఆనాడు బిహార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ, ఆ రాష్ట్రంలోని 52 శాతానికి పైగా వెనుకబడిన తరగతుల వారి పక్షాన నిలబడి, తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. ఆ తరువాత ఎన్నోఏళ్ల పాటు వారిపై తన పట్టును, ప్రభావాన్ని కొనసాగించగలిగారు. బిహార్‌ ఎన్నికల ఫలితాలను తేల్చే కీలక అంశంగా కుల రాజకీయాలు మారింది ఆనాటి నుంచే. ఆ రాష్ట్ర అసెంబ్లీలోని 113 సీట్లలో 2010, 2015, 2020 ఎన్నికల్లోనూ అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు, అంతే సంఖ్యలో పదే పదే ఎన్నిక కావడం... కులసమీకరణ రాజకీయ ప్రాధాన్యానికి నిదర్శనం. అయోధ్య రామాలయం కోసం బీజేపీ అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ అప్పట్లో చేపట్టిన రథయాత్ర నుంచి సైతం అత్యధిక ప్రయోజనం నొల్లుకున్నది లాలూనే. 1989 సార్వత్రక ఎన్నికల్లో 85 లోక్‌సభ సీట్లు సాధించిన బీజేపీ–ఆనాడు వీపీ సింగ్‌ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ సర్కారులో కీలక భాగస్వామి. ఆడ్వాణీ రథయాత్ర పెను సవాలుగా మారినప్పటికీ, సర్కారు మనుగడ దృష్ట్యా దాన్ని ఆపే సాహసం సింగ్‌ చేయలేకపోయారు. ఆ పని లాలూకు అప్పగించారు. 1990 అక్టోబరు 23న సమస్తిపూర్‌లో ఆడ్వాణీని అరెస్టు చేసి, బిహార్‌–పశ్చిమబెంగాల్‌ సరిహద్దులోని మసన్‌జోర్‌ ప్రభుత్వ అతిథి గృహానికి తరలించింది– బిహార్‌లోని అప్పటి లాలూ ప్రభుత్వం. ఆ చర్యతో ఒక్కసారిగా ముస్లింలు, వామపక్ష లిబరల్‌వాదులకు ఆత్మబంధువుగా మారిపోయారు లాలూ. తన కులవర్గమైన యాదవులతో పాటు ముస్లింలనూ గట్టి ఓటు బ్యాంకుగా మలచుకోగలిగారు. ఈనాటికీ ఆయన పార్టీ (ఆర్జేడీ)కి ఎంవై సమీకరణే అండా–దండా! ప్రస్తుత ఎన్నికల్లోనూ ఈ వర్గమే తమను విజయతీరాలకు చేర్చగలదని లాలూ– తేజస్వి నమ్ముతున్నారు. మరోవైపు, ముఖ్యంగా లాలు హయాంలో అవినీతి, అక్రమాలు, గూండాగిరీ, అరాచకత్వం, మావోయిస్టు హింసాకాండ, సామాజిక అశాంతి కారణంగా బిహార్‌ ‘జంగిల్‌ రాజ్‌’గా మారిందన్న ప్రచారం జనంలోకి చొచ్చుకెళ్లింది. ఆయన కుమారుడు మహాగఠ్‌ బంధన్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ను సైతం ఆ నీడ నేటికీ వెంటాడుతోంది.


బిహార్‌ రాజకీయాల చదరంగంలో గ్రాండ్‌ మాస్టర్‌ అనదగ్గ మరో నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌. పరిస్థితులు, అవసరాలు, అవకాశాల్ని బట్టి ఎన్నికలకు ముందో, తరువాతో ఉన్నట్టుండి కూటమి ఫిరాయించడం, తను మాత్రమే చక్రం తిప్పగలగడం ఆయనకు అలవాటైన విద్య. ‘పల్టూరామ్‌’ అంటూ ప్రత్యర్థులు ఆడిపోసుకుంటారు కానీ, ఎవ్వరి ఊహకూ అందని రీతిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త రాజకీయ ఎత్తుగడలు వేయడంలో ఆయన దిట్ట. 74 ఏళ్ల నితీశ్‌, ఇప్పుడు ఏకంగా పదోసారి బిహార్‌ సీఎం పదవికి పోటీపడుతున్నారంటేనే ఆయన రాజకీయ జిత్తులమారితనాన్ని అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి, సుస్థిరత, శాంతిభద్రతలతో కూడుకొన్న సుపరిపాలనే తన లక్ష్యం, ధ్యేయంగా ప్రజల్లో బలమైన భావన ఏర్పరచగలిగిన నితీశ్‌– పార్టీల జయాపజయాలు, కూటముల కొట్లాటలు, కోలాటాలతో సంబంధం లేకుండా ఏకంగా 20 ఏళ్లుగా అధికారంలో కొనసాగగలగడం చిన్న విషయం కాదు. పరిపాలన సంస్కరణలు, ప్రజా సంక్షేమం వంటివి తన పక్షానికి మరో విజయం కట్టబెడతాయని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. నితీశ్‌ శారీరక, మానసిక ఆరోగ్య పరిస్థితి సవ్యంగా లేదంటూ రాజకీయ వర్గాల్లో కొద్దికాలంగా ప్రచారం జరుగుతోంది. దీర్ఘకాలిక పాలన కారణంగా ప్రభుత్వ వ్యతిరేకత మేట వేసిందన్న అంచనాలూ ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికల్లో నెగ్గుకురావాలంటే– ‘మోదీ అప్పీల్‌’తో పాటు నితీశ్‌ ‘కరిష్మా’పైనా చాలావరకు ఆధారపడక తప్పని పరిస్థితి ఎన్డీయేది. కుర్మీ– కొయిరీ కులవర్గాలు (7 శాతం), బాగా వెనుకబడిన హిందూ వర్గాలు (ఈబీసీ) (26 శాతం), మహా దళితులు, మహిళలతో కూడుకొన్న ఓటుబ్యాంకుపైనే నితీశ్‌ కూటమి ఆశలన్నీ! ఆర్థికంగా దివాళా తీసినందున బిహార్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ (బీఐఎంఏఆర్‌యూ)లను కలిపి 1980ల నుంచి ‘బిమారు’ రాష్ట్రాలుగా పిలుస్తున్నారు. ‘బిమారు’ అంటే– జబ్బుపడిన అని అర్థం. ఈ రాష్ట్రాల్లో యూపీతో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ సైతం చాలా వరకు కోలుకోగలిగినప్పటికీ, బిహార్‌ నేటికీ దారిద్ర్యం ఊబిలో నుంచి బయటపడలేకపోతోంది.


పనీ లేక– ‘మనీ’ రాక ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ పెద్దయెత్తున ఇతర రాష్ట్రాలకు వలసపోక తప్పని పరిస్థితి బిహారీలది. ఏటా 25 లక్షల బిహారీలు పని కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతుంటారు. 35 శాతం దాకా యువత నిరుద్యోగులే. కార్మికుల్లో 80 శాతానికి పైగా అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ‘జంగిల్‌ రాజ్‌’ అన్న ముద్ర చాలా వరకు చెరిగిపోయినప్పటికీ, అవినీతిమయ రాష్ట్రాల్లో నేటికీ తొలి అయిదారు స్థానాల్లో కొనసాగుతోంది. అందుబాటులో ఆస్పత్రులు, వైద్యులు– అన్యదేశీ పదాలిక్కడ. 42 శాతం బాలలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఎన్నో ఎన్నికలు... మరెన్నో హామీలు. అన్నీ అరచేతిలో స్వర్గాలే. దశాబ్దాలు దొర్లిపోతున్నా... బిహార్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే! అప్పటి ఎన్నికలైనా, ఇప్పటి ఎన్నికలైనా– మార్పు రాదేమో! అంతిమంగా... గెలిచేది లీడర్లు.. ఓడేది ఓటర్లే!

పి. దత్తారాం ఖత్రీ సీనియర్‌ జర్నలిస్టు

ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 05:38 AM