Share News

Youth Mental Health: గెలుపు సరే ఓటమిని ఒప్పుకోవటం ఎలా

ABN , Publish Date - Dec 17 , 2025 | 04:14 AM

సర్కారు కొలువుల వేటలో ఓటమిని ఒప్పుకోలేక, తమకు రాని ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పుకున్న మూడు సంఘటనలు ఇటీవల తెలంగాణలో జరిగాయి. మెదక్ ప్రాంతానికి చెందిన ఒక అభ్యర్థి...

Youth Mental Health: గెలుపు సరే ఓటమిని ఒప్పుకోవటం ఎలా

సర్కారు కొలువుల వేటలో ఓటమిని ఒప్పుకోలేక, తమకు రాని ఉద్యోగాలు వచ్చినట్టు చెప్పుకున్న మూడు సంఘటనలు ఇటీవల తెలంగాణలో జరిగాయి. మెదక్ ప్రాంతానికి చెందిన ఒక అభ్యర్థి ఇటీవలి గ్రూప్–1 జాబితాలో డీఎస్‌పీ ఉద్యోగం పొందినట్టు ప్రచారం చేసుకున్నాడు. మరొక అభ్యర్థి తాను యూపీఎస్సీ పరీక్షలో ఎంపిక అయ్యానంటూ ఒక కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి హల్‌చల్ చేశాడు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఉదంతం ఒకటి ఇటువంటిదే బైటపడింది.

ఈ ముగ్గురూ బాగా చదువుకుని పోటీ పరీక్షలకు తయారైనవారే. విజయం సాధించలేకపోవడంతో ఇలా అసాధారణంగా ప్రవర్తించారు. పరాజయానికి కుంగిపోయి తనువు చాలించేవారి గురించి మనం విని ఉన్నాం. అయితే ఈ మూడు సంఘటనల్లో ఓటమిని స్వీకరించలేని మానసిక అవస్థ కనపడుతున్నది. ఓటమిని ఒప్పుకుని, దాని నుండి నేర్చుకోవలిసింది నేర్చుకుని ముందుకు సాగే ఒడుపును ఇప్పటి తరాలు కోల్పోతున్నారేమో అనిపిస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పోటీ పరీక్షలకు కూర్చునే యువత, దాన్ని సాధించలేనప్పుడు, ఆ ఉద్యోగ సాధనా ప్రక్రియలోనే నేర్చుకున్న పాఠాలను తమ జీవితాలలో ముందుకు సాగేందుకు ఎట్లా వాడుకోవాలి అనే దిశగా ఆలోచన చేయాలి. వారికి సూచనలు, సలహాలు ఇచ్చేవారు ఈ తరహా ఆలోచనను వారిలో పెంచాలి.

మన దేశంలో సర్కారు ఉద్యోగం కోసం పోటీ తీవ్రంగా పెరిగిపోయింది. అదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా తగ్గిపోవడం మొదలైంది. పోటీ తీవ్రత వల్ల విజయం సాధించే అవకాశాలు 2శాతం కంటే తక్కువ మంది అభ్యర్థులకు మాత్రమే ఉంటాయి. యూనియన్ సివిల్ సర్వీసులలో ఈ విజయ శాతం 0.17 మాత్రమే. పోటీ పరీక్షల అభ్యర్థులు ఈ వాస్తవాన్ని మరిచిపోతేనే వారి ప్రవర్తనలో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.


నేటి వ్యాపార సంస్కృతిలో విజయాన్ని కీర్తించడం, విజయం సాధించడాన్ని ఆకాశానికి ఎత్తేయడం బాగా పెరిగిపోతోంది. గెలుపు కథలకే డిమాండ్‌ ఉన్న ఈ సంస్కృతిలో అపజయాన్ని ఎదుర్కొనే కళ మరుగునపడిపోతున్నది. ‘గెలుపు సరే బతకడం ఎలా’ పేరుతో కె.ఎన్‌.వై. పతంజలి రాసిన పుస్తకం ఇప్పుడు ఎవరికీ గుర్తులేదు. జీవితంలో అనేక ఆశాభంగాలు ఉంటాయి. కానీ నేటి న్యూక్లియర్‌ కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఆశాభంగాలకు సరిగా సిద్ధం చేయటం లేదు. అపజయం అన్నది ఇప్పుడు పూర్తిగా దాచిపెట్టాల్సిన, లోగొంతుకలో మాత్రమే మాట్లాడాల్సిన విషయం అయిపోయింది. కానీ పిల్లలు అపజయాలకు సిద్ధం కావాలంటే తల్లిదండ్రులు వారితో తమ జీవితంలోని అపజయాలను పంచుకోవాలి. అప్పుడే ఏ ఓటమీ శాశ్వతం కాదన్న నమ్మకం పిల్లలలో కలుగుతుంది.

1970ల వరకు మన గ్రామీణ, నగర ప్రాంతాల్లో పిల్లలను కుటుంబాలతోపాటు, చుట్టూ వీధులూ, సమాజం కూడా పెంచేవి. 1990ల తరువాత పెరిగిన మార్కెట్ భావజాలం మధ్య కుటుంబం మాత్రమే పిల్లలకు అన్నీ సమకూర్చే యూనిట్‌గా మారిపోయింది. అయితే ఆ కుటుంబానికి ఉండే మానసిక, సామాజిక వైశాల్యం చాలా పరిమితం కావటం వల్ల ‘అపజయం వల్ల తిరస్కారం’, ‘ఏదో ఒక తీరులో విజయం సాధిస్తే చాలు అదే పురస్కారం’ అన్నదే ముఖ్యమైన విలువగా యువత మనో ప్రపంచాన్ని నింపివేస్తున్నాయి. దీనితో ఓటమిని ఒప్పుకోగలిగే మానసిక బలం వారికి లేకుండా పోతున్నది. మనిషి పెట్టుకునే లక్ష్యం ఆ మనిషి కోరిక మాత్రమే. కోరుకున్న ప్రతిసారీ కోరిక తీరవలిసిందే అనే ఆలోచనా ధోరణి ప్రకృతి నియమానికే విరుద్ధం. కోరుకున్న లక్ష్యం సాధించేందుకు చేసే ప్రయత్నంలో ఓడిపోతే, ఆ లక్ష్యం కోసం పయనంలో నేర్చుకున్న మంచి గుణాలను, అలవాట్లను తమ నిత్యజీవితంలో ఉంచుకోవాలి. లక్ష్యం కంటే, వీటికి విలువ ఎక్కువ. ఏ ఓటమీ శాశ్వతం కాదు. అనుకున్న కోరిక నెరవేరకపోవడం అసహజమేమీ కాదు. సాధించలేని లక్ష్యాన్ని వదిలివేసి, మరో లక్ష్యం వైపు ప్రయత్నాన్ని ఎక్కుపెట్టడమే జీవితం. ఏ మనిషి గతమైనా, మొత్తం మానవ సమూహగతమైనా అనేక ఓటములూ, కొన్ని మాత్రమే గెలుపుల సంపుటి. పరాజయాలన్నీ పతనం దిక్కుకే నడిపేవి అయివుంటే మానవ నాగరికత వికసించేదే కాదు. సర్కారు కొలువుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని పోటీ పరీక్షలలో నిలబడే యువత ఈ అవగాహనను పెంచుకోవాలి. లేకపోతే మానసిక వికృతులు పెరిగి సామాజిక, వ్యక్తిగత విధ్వంసాలు జరుగుతాయి.

డా. హారతి వాగీశన్

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ పొలిటికల్ సైన్స్

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్

ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!

తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్

For More AP News And Telugu News

Updated Date - Dec 17 , 2025 | 04:14 AM