Share News

Teacher Eligibility Test Debate: టెట్‌ అంటే భయమెందుకు

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:24 AM

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశమైంది. విద్యారంగం భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ పరీక్షను నిర్బంధంగా...

Teacher Eligibility Test Debate: టెట్‌ అంటే భయమెందుకు

ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్‌) ఇప్పుడు దేశవ్యాప్తంగా మళ్లీ చర్చనీయాంశమైంది. విద్యారంగం భవిష్యత్తును ప్రభావితం చేసే ఈ పరీక్షను నిర్బంధంగా కొనసాగించాలని చెపుతూ ‘‘టెట్‌ అనేది విద్యా నాణ్యతకు కనీస హామీ. రాష్ర్టాలు దానిని తప్పించుకోవడానికి ప్రయత్నించకూడదు. ప్రతీ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా టెట్‌ పరీక్షలో అర్హత సాధించాలి. గరిష్ఠంగా రెండేళ్లలో అర్హత సాధించకపోతే ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందాలి’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం సెప్టెంబరు 1న తీర్పు ఇచ్చింది. కోర్టు వ్యాఖ్యలు, నిజానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయ నియామకాలలో ఉన్న లోపాలను బట్టబయలు చేశాయి. నిరంతరం నేర్చుకునే తపన ఉన్న ఉపాధ్యాయుడే నాణ్యమైన విద్యను అందించి విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్దుతాడని సుప్రీంకోర్టు విస్పష్టంగా పేర్కొంది.

దేశ విద్యావ్యవస్థలో కొనసాగుతున్న అతిపెద్ద లోపాన్ని గుర్తించి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టును దేశవ్యాప్తంగా మేధావులు, విద్యావేత్తలు అభినందిస్తుండగా.. ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వ్యతిరేకిస్తుండటం శోచనీయం. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు మాత్రం టెట్‌ అనవసరం.. అనుభవమే ప్రధాన అర్హత. దీంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ వ్యతిరేకిస్తున్నారు. తీర్పు సమీక్షించాలంటూ తెలంగాణలోని ప్రముఖ ఉపాధ్యాయ సంఘం టీఎస్‌యూటీఎఫ్‌ ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. మరో సంఘం పీఆర్టీయు కేంద్ర మంత్రులను కలిసి టెట్‌ అర్హత రద్దుచేయాలని, దీనికోసం విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని కోరుతోంది. టెట్‌ అర్హత రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ప్రకటించాయి. సుప్రీంకోర్టు తీర్పును వారు వ్యతిరేకించడం వెనక ఒక్క సహేతుమైన కారణం కూడా లేదు. ఉపాధ్యాయుడిగా అపారమైన అనుభవం ఉన్నవారికి పరీక్ష రాయడం అంటే భయం ఎందుకు? నాణ్యతా ప్రమాణం పెట్టడంలో తప్పేమిటి? ఉపాధ్యాయులకు జీవితంలో ఒక పరీక్ష నిర్వహిస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి..? ఈ ప్రశ్నలకు సంఘాల వద్ద కూడా సమాధానం లేదు.


ప్రపంచమంతా గురువులను మరింత నైపుణ్యమైన బోధకులుగా తీర్చిదిద్దుతున్నది. విద్యారంగంలో అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఫిన్లాండ్‌లో ఐదేళ్ల మాస్టర్స్‌ డిగ్రీ ఉన్నవారే బోధనకు అర్హులు. గురువుల నైపుణ్యాలు, విద్యా బోధనను అంచనా వేసేందుకు ప్రతి ఏటా ప్రత్యేక పరీక్షలు నిర్వహించి వారి నైపుణ్యాలను అంచనా వేస్తారు. ప్రభుత్వ అంచనాల మేరకు రాణించని గురువులను బోధనకు అనర్హులుగా ప్రకటిస్తారు. సింగపూర్‌లో ఉపాధ్యాయులు ప్రతి ఏటా కనీసం 100 గంటల ఉపాధ్యాయ శిక్షణ పొందడం తప్పనిసరి. జపాన్‌లో ఉపాధ్యాయులకు ఇచ్చిన బోధన లైసెన్స్‌ను ప్రతి పదేళ్లకు సమీక్షిస్తారు. వీరు రిఫ్రెషర్‌ కోర్సులు నేర్చుకోవడం తప్పనిసరి. అమెరికాలో టీచర్‌ లైసెన్స్‌ను ప్రతి మూడేళ్లకు వారి నైపుణ్యాలను గుర్తించిన తర్వాతే పునరుద్ధరిస్తారు. యూకేలోనూ ప్రతి ఏడాది టీచర్ల విద్యాబోధన సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. ఇలా ప్రపంచం అంతా విద్యారంగంలో సంస్కరణల వైపు పరుగులు పెడుతుంటే.. భారతదేశంలో దశాబ్దాల తర్వాత వచ్చిన ఒక చరిత్రాత్మక తీర్పును గురువులే వ్యతిరేకిస్తుండటం.. బహుశా ప్రపంచంలోనే ఎక్కడా కనిపించని విడ్డూరం.

తెలంగాణలో ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రభుత్వం విద్యపై ఖర్చు చేస్తోంది. అయినా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై ప్రతి ఏటా వస్తున్న నివేదికలు నాణ్యతలేమిని ఎత్తిచూపుతున్నాయి. ఉన్నత పాఠశాలల విద్యార్థులు కనీసం చిన్నపాటి కూడికలు, తీసివేతలు చేయలేని దుస్థితి. కనీసం మాతృభాషలో అక్షరదోషం లేకుండా ఒక వాక్యం కూడా రాయలేకుండా ఉన్నారు. ఇలాంటి విద్యకు బాధ్యులెవరు? పాఠశాలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు కల్పిస్తే విద్యలో నాణ్యత వచ్చేస్తుందా? ఎప్పుడో సంవత్సరాల క్రితం పోటీ పరీక్షలో విజయం సాధించి ప్రభుత్వ టీచర్‌గా ఎన్నికైతే.. ఇక తమకు పరీక్షలే పెట్టవద్దనడం ఎంతవరకు సమంజసం? విద్యలో నాణ్యత తగ్గటం వెనక ఉపాధ్యాయులకు బాధ్యత లేదా? విద్యార్థులు ప్రతీ ఏడాది పరీక్షలు రాస్తారు. మార్కులు తక్కువ వస్తే వాళ్లను ‘ఫెయిల్‌ అయినావ్‌’ అని ఉపాధ్యాయులే చీదరించుకుంటారు. అదే ఉపాధ్యాయులు టెట్‌ పరీక్షను రాయడానికి ఎందుకు భయపడుతున్నారు? ఉపాధ్యాయ సంఘాలు నిజంగా ఉపాధ్యాయుల గౌరవం, నాణ్యతపై దృష్టి పెడితే టెట్‌ను ఎదుర్కొని నిలబడగలగాలి. విద్యా వ్యవస్థ కోసం, విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం అయినా విద్యారంగంలో సంస్కరణలను అంగీకరించాలి.

ముహమ్మద్‌ ఆర్‌హెచ్‌ షరీఫ్‌

జర్నలిస్ట్‌

ఈ వార్తలు కూడా చదవండి..

రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 02:24 AM