Share News

21st century: ఈ శతాబ్ద ఆధిపత్యం ఎవరిది

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:37 AM

కాల విభజనలేని పరిస్థితిని ఊహించలేం. శకం, యుగం, శతాబ్దం, దశాబ్దం అంటూ ఎన్నో విభజనలు పెట్టుకుని ప్రగతినీ క్షీణతనీ మదింపు వేసుకుని ఆశనిరాశల్లో కొట్లాడటం అన్ని కాలాల్లోనూ ఉంది. 20వ శతాబ్దం దీనికి అతీతం కాదు. దాన్ని విప్లవాత్మకమైందిగా...

21st century: ఈ శతాబ్ద ఆధిపత్యం ఎవరిది

కాల విభజనలేని పరిస్థితిని ఊహించలేం. శకం, యుగం, శతాబ్దం, దశాబ్దం అంటూ ఎన్నో విభజనలు పెట్టుకుని ప్రగతినీ క్షీణతనీ మదింపు వేసుకుని ఆశనిరాశల్లో కొట్లాడటం అన్ని కాలాల్లోనూ ఉంది. 20వ శతాబ్దం దీనికి అతీతం కాదు. దాన్ని విప్లవాత్మకమైందిగా, యుద్ధ బీభత్సమైందిగా, పర్యావరణ వినాశనకరమైందిగా పేర్కొంటూ ఎన్నో వ్యాఖ్యానాలూ వచ్చాయి. వాటితోపాటు శతాబ్ది, దశాబ్ది ఆధిక్యతలనూ కొన్ని దేశాలకు ఆపాదించటమూ జరిగింది. కిందటి శతాబ్దం అమెరికాదేనంటూ పేర్కొనటం అలాంటిదే. ఆ సూత్రీకరణలో నిజం లేకపోలేదు! శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సైనిక, రాజకీయ శక్తిగా అమెరికాకు సాటిరాగల దేశం 20వ శతాబ్దంలో ఏదీ లేదు. ఆ ఘనతను అమెరికాకు ఆపాదించటంలో పెద్దగా భిన్నాభిప్రాయాలు వ్యక్తంకాలేదు. ఒక శతాబ్దం పాటు ఒక దేశం తిరుగులేని శక్తిగా ఉండటం సాధారణ విషయం కాదు. ప్రజాస్వామ్యం, స్వయంపాలన, సమానత్వం కోసం ఎన్నో రూపాల్లో, ఎన్నో దేశాల్లో ప్రజలు నినదించి ఉద్యమించిన శతాబ్దంలో దాన్ని సాధించటమే ఒక విశేషం! కీలక రంగాల్లో ఆ ఆధిక్యత అగ్రరాజ్య హోదానీ అమెరికాకు కట్టబెట్టింది. సోవియట్‌ యూనియన్‌ కొంతకాలం సైనికశక్తిపరంగా అమెరికాకు బలమైన సవాల్‌ విసిరినా ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దీటైన పోటీని ఇవ్వలేకపోయింది. అందుకే 20వ శతాబ్దం అమెరికాదేనన్న భావనపై పెద్దగా వివాదం నెలకొనలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వేగంగా మారిపోతోంది.

21వ శతాబ్దంలో అమెరికాకు అగ్రతాంబూలం ఇచ్చే పరిస్థితి రోజురోజుకీ తరిగిపోతోంది. ఒకనాటి బ్రిటన్‌ పరిస్థితే అమెరికాకు 2050 నాటికి ఎదురవుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆసియాదే 21వ శతాబ్దం అన్న భావన బలం పుంజుకుంటోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ సారథ్యంలో అమెరికా ప్రతిచర్యనూ సందిగ్ధ దృష్టితో చూడటం దేశదేశాలకు అలవాటైపోతోంది. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యవహారశైలిపై దేశాధినేతలు లోలోపల రగిలిపోవటం అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎప్పుడూ చూడని పరిణామం. అమెరికా ఆధిపత్యానికి గండిపడుతున్న దృశ్యం మూడు విషయాలను పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్థికాభివృద్ధి ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవటం లేదు. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత ఒకటి రెండేళ్లు మినహా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. స్థూలదేశీయ ఉత్పత్తి (జీడీపీ) 1990 నుంచి సగటున 2.40శాతం దాటలేదు. అదే కాలంలో చైనా సగటు జీడీపీ 8.74శాతం ఉంది. ఖర్చులకు అనుగుణంగా పన్ను ఆదాయాన్ని పెంచుకోలేని దుస్థితిలో అమెరికా పడిపోయింది.


ప్రపంచ దేశాలకు లోటు బడ్జెట్‌ల గురించీ అప్పుల కట్టడి గురించీ నిత్యమూ పాఠాలు వినిపించిన అమెరికా ఈ రెండు విషయాల్లో క్రమేపీ సంక్షోభ స్థితిలోకి వెళుతోందనే ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. 2024 ఫెడరల్‌ బడ్జెట్‌లో 6.75 ట్రిలియన్‌ డాలర్లను ఖర్చుపెట్టాలని ప్రతిపాదిస్తే వచ్చే ఆదాయాన్ని 4.92 ట్రిలియన్‌ డాలర్లుగా చూపించారు. ఈ లోటును భర్తీ చేసుకోటానికి అప్పులు తప్ప మరోమార్గం లేదు. ఇప్పటికే అమెరికా అప్పులు 37 ట్రిలియన్‌ డాలర్లకు చేరాయి. ట్రంప్‌ మానసపుత్రికగా చెప్పుకొనే ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బడ్జెట్‌ బిల్‌’ చట్టంతో అవి 40 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతాయి. జీడీపీతో పోల్చితే అప్పులు 133 శాతానికి చేరుకుంటాయి. అప్పులపై చెల్లింపులే వచ్చే 10 ఏళ్లల్లో 13.8 ట్రిలియన్‌ డాలర్లకు పైగా ఉంటాయి. 2024 బడ్జెట్‌లో వీటి కోసం 14.06 శాతం నిధులను ప్రతిపాదించారు. అప్పుల భారం తీవ్రంగా ఉన్నా పన్ను రాయితీలను మరింతగా పెంచుతున్నారు. ఆదాయ అసమానతలను ఇవి తగ్గిస్తున్నాయా? అంటే అదీలేదు. 1980ల నుంచీ సంపద, ఆదాయాల్లో అసమానతలు విపరీతంగా పెరిగిన దేశాల్లో అమెరికా ఒకటి. పన్ను రాయితీలన్నీ అధికాదాయం కలిగిన 10 శాతం జనాభాకే లబ్ధిని చేకూర్చుతున్నాయి. 2017లో ట్రంప్‌ ప్రవేశపెట్టిన పన్నురాయితీలు ఈ డిసెంబరుతో ముగిసిపోతాయి. వాటిని కొనసాగించటానికే ప్రధానంగా కొత్త చట్టాన్ని ఆమోదించారు.

ఆరోగ్య, ఆహార సబ్సిడీల్లో కోతలు విధించి రక్షణ బడ్జెట్‌కు అదనంగా 150 బిలియన్‌ డాలర్లను ఇస్తున్నారు. శుద్ధ ఇంధనంపై రాయితీలను తగ్గించారు. రిపబ్లికన్‌ పార్టీ దృష్టిలో పర్యావరణ విధ్వంసానికి విలువ ఉండదు. అసలు విధ్వంసం జరుగుతున్న విషయాన్నే అంగీకరించని సందర్భాలు ఎక్కువ. ప్రగతి వ్యతిరేకులు మాత్రమే విధ్వంసం గురించి మాట్లాడతారని రిపబ్లికన్‌ నేతలు ఎద్దేవా చేస్తారు. వలసల నియంత్రణకు బడ్జెట్‌ను విపరీతంగా పెంచారు. వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లను ఇందుకోసం ఖర్చుపెడతారు. ప్రస్తుతం ఏటా 8 బిలియన్లు ఉన్న ఖర్చు 20 బిలియన్లకు పెరుగుతుంది. అంటే విదేశీ విద్యార్థులు, ఉద్యోగార్థులతో పాటు అక్రమంగా అమెరికాలో ప్రవేశించేవారిపై తనిఖీలు, వెనక్కి పంపటాలు ఎక్కువవుతాయి. లోటు బడ్జెట్‌ను తగ్గించటానికి ధనికుల నుంచి అధిక పన్నులను వసూలుచేసే వెసులుబాటు ఉన్నా దాన్ని కాదనుకుని అనుచితంగా వాణిజ్య యుద్ధాలను ప్రకటించి అన్ని దేశాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించటం ఇంతలా ఎప్పుడూ జరగలేదు. 1990ల నుంచి సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులతో మంచి ఉద్యోగాలు ఉన్నత చదువులు ఉన్నవారికే పరిమితం అవుతున్నాయి.


కృత్రిమమేధతో అదింకా ఉధృతం అవుతోంది. సంపదను సృష్టించే రంగాల్లో ఉద్యోగ కల్పన తగ్గుముఖం పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి కొత్త విధానాలు చేపట్టే దిశగా అమెరికాలో అడుగులు పడటం లేదు. అందినంత మేర అప్పులు చేయటం, భారీలోటు బడ్జెట్లతో బండినెట్టుకు రావటమే విధానమై పోయింది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకోక పోవటానికి విపరీత ఆదాయ అసమానతలు ప్రధాన కారణంగా పేర్కొంటూ ఎన్నో అధ్యయనాలు వెలువడ్డాయి. కొనుగోలు శక్తి కొద్ది మంది చేతుల్లో భారీగా ఉండటం ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వస్తువుల గిరాకీని బాగా తగ్గిస్తుంది. దీన్ని సరిదిద్దకుండా చౌక ధరలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాలను శత్రువులుగా చూపించటమే ట్రంప్‌ హయాంలో సర్వసాధారణమైంది. ఇతర దేశాల నుంచి దిగుమతులు అవుతున్న ఉత్పత్తులతో అమెరికాలోని పారిశ్రామిక కార్మికులకు డిమాండు తగ్గిపోయింది. పెరిగిన ధరలతో పోల్చితే వేతనాల్లో పెరుగుదల నిలిచిపోయింది. పాఠశాల విద్య వరకూ చదివి కిందిస్థాయి ఉద్యోగాలకు పరిమితమైనవారు.. వేతనాల పెంపుకోసం సంఘటితమయ్యే పరిస్థితిని కోల్పోయారు. అన్నివైపులా అసంతృప్తి నెలకొన్న ఈ నేపథ్యంలోనే అమెరికాను మళ్లీ గొప్పదేశంగా మార్చుతానంటూ ట్రంప్‌ మొదటిసారి అధికారంలోకి వచ్చారు.

బైడెన్‌ హయాంలోనూ పరిస్థితులు పెద్దగా మారకపోవటంతో రెండోసారి ట్రంప్‌ సునాయాసంగానే ఎన్నికల్లో గెలిచారు. అమెరికా వృద్ధి, క్షీణతలను విశ్లేషించిన నిపుణులు నాలుగు కీలక విషయాలను ప్రస్తావిస్తున్నారు. మొదటిది.. అసమానతలు విపరీతంగా పెరగటం వల్ల ఆదాయంలో సింహభాగం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది. రెండోది.. కిందటి శతాబ్దంలో జరిగినంత వేగంగా విద్యావ్యాప్తి జరగటం లేదు. ఉత్పాదకతలో పెరుగుదలను ఇది తగ్గిస్తోంది. మూడోది.. సగటు పనిగంటలు తగ్గుతున్నాయి. నాలుగోది.. వృద్ధుల సంఖ్య పెరగటంతో జనాభాలో పనిచేసే సామర్థ్యం ఉన్న వారి శాతం క్రమంగా తగ్గిపోతోంది. ఈ నాలుగు అంశాలూ ఇలాగే కొనసాగితే మెజారిటీ ప్రజల వాస్తవిక ఆదాయంలో ఎదుగుదల వచ్చే 25 ఏళ్లలో కూడా కన్పించని పరిస్థితినే తీసుకురావచ్చు. దీంతో అమెరికా ఆధిపత్యానికి కచ్చితంగా గండిపడే అవకాశాలే ఎక్కువ. కిందటి శతాబ్దం అమెరికాదిగా భావించటానికి మరో ముఖ్యమైన కారణం అక్కడి విశ్వవిద్యాలయాలు నిర్వహించిన పాత్ర.


శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి ఉరుకులు పరుగులెత్తటంలో అమెరికా విశ్వవిద్యాలయాల చేయూత అసాధారణమైంది. వస్తూత్పత్తి రంగం (మాన్యుఫాక్చరింగ్‌ సెక్టార్‌) అమెరికాలో 1870– 1970 మధ్య కీలకపాత్ర పోషించింది. 1945 నాటికి ప్రపంచ పారిశ్రామిక ఉత్పత్తిలో అమెరికా వాటా 50 శాతం ఉండేది. 1990ల నాటికి అది గణనీయంగా పడిపోయినా సాఫ్ట్‌వేర్‌, డిజిటల్‌ రంగాల్లో సాధించిన మౌలిక ఆవిష్కరణలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రపంచం అనుసంధానం అవ్వటానికి దోహదం చేశాయి. ఆ ఆవిష్కరణల్లో కంపెనీలు, సంస్థలతో పాటు విశ్వవిద్యాలయాల పాత్ర విస్మరించలేనిది. సామాజిక శాస్త్ర పరిశోధనల్లో కూడా విశ్వవిద్యాలయాలు గణనీయపాత్రను పోషించాయి. భారత్‌కు సంబంధించిన అనేక విషయాలపై లోతైన పరిశోధనలు, విశ్లేషణలు అందివ్వటంలో అమెరికా వర్సిటీలు చాలా ముందున్నాయి. నిధుల లభ్యత, మార్కెట్‌ అవసరాలతో పాటు స్వతంత్ర పరిశోధనలు వర్సిటీలకు అస్తిత్వాలుగా మారాయి. భారత్‌కు సంబంధించి ఏ విషయంలోనైనా మౌలిక పరిశోధనలు పదింటిని లెక్కపెడితే అందులో సగమైనా అమెరికా వర్సిటీల నుంచి వెలువడినవే అయివుంటాయి. అమెరికాకు ఎనలేని గుర్తింపు తెచ్చిన వర్సిటీలపై ప్రభుత్వం వైపు నుంచి బహిరంగంగా వేధింపులు.. నిధుల కోతలు, గుర్తింపు రద్దులు లాంటి హెచ్చరికలు గతంలో ఎప్పుడూ లేవు. అసమ్మతిని, ప్రభుత్వ వ్యతిరేకతను సహించటం, ప్రత్యామ్నాయ ఆలోచనల మంచిచెడ్డలపై సమాలోచనలు జరపటం అక్కడ వర్సిటీలకు ఉన్న బలం. ఇప్పుడా బలాన్ని దెబ్బతీయటం మొదలైంది. ఇదింకా పేట్రేగితే అమెరికా ఆధిపత్యానికి కారణమైన మేధో పునాదే బీటలు వారటం మొదలవుతుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఈ శతాబ్దంలో అమెరికాకు ఎదురుదెబ్బలే ఎక్కువ. అమానవీయ చర్యలతో, తప్పుడు నిర్ణయాలతో స్నేహ దేశాల దృష్టిలోనూ పెద్దరికాన్ని కోల్పోతోంది. ఇరాక్‌పై యుద్ధాన్ని (2003) మొదలుపెట్టి ఘోరంగా విఫలమైంది. ఇస్లామిక్‌ తీవ్రవాదంపై పోరుతో సాగించిన యుద్ధం అదింకా పెరిగేలా చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబాన్లకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టేలా వ్యవహరించింది. పాలస్తీనా సమస్యను ఆరని అగ్నిగుండంగా మార్చింది.


హమాస్‌ తీవ్రవాదులపై దాడుల పేరుతో గాజాలో నరమేధాన్ని సాగిస్తోందన్న ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచి ఆ ఘోరకలిని పర్యవేక్షిస్తోందన్న అపకీర్తిని తెచ్చుకుంటోంది. నాటో కూటమిని విస్తరించి రష్యా–ఉక్రెయిన్‌ల మధ్య చిచ్చు రగిల్చింది. వియత్నాం నుంచి మొదలుకుని ఇప్పటివరకూ ప్రత్యక్ష సైనికజోక్యం చేసుకున్న ఏ దేశంలోనూ ప్రజాస్వామ్యాన్ని, పటిష్ఠ ఆర్థిక వ్యవస్థనూ ఏర్పాటు చేయలేకపోయింది. అనేక దేశాల్లో ఏర్పరచుకున్న సైనిక స్థావరాలు ఆర్థికంగా గుదిబండలుగా మారాయి. ఇతర కారణాలు ఎన్ని ఉన్నప్పటికీ ఆర్థిక మందగమనాలు, మేధోరంగంపై దాడులు, విదేశీ వ్యవహారాల్లో తప్పుటడుగులతో అమెరికా ఆధిపత్యం ప్రశ్నార్థకంగా మారుతోంది!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 02:37 AM