Share News

ఏఐ వద్దని ఎవరన్నారు?

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:13 AM

కృత్రిమ మేధపై రంగనాయకమ్మ రాసిన వ్యాసానికి (‘కృత్రిమ మేధ: భ్రమలూ, వాస్తవాలు!’ – ఫిబ్రవరి 20, -2025) స్పందిస్తూ మామిడి నారాయణ ‘సిద్ధాంతం వేరు, సైన్స్ వేరు’ (మార్చి ౧, 2025) అంటూ వ్యాసం రాశారు...

ఏఐ వద్దని ఎవరన్నారు?

కృత్రిమ మేధపై రంగనాయకమ్మ రాసిన వ్యాసానికి (‘కృత్రిమ మేధ: భ్రమలూ, వాస్తవాలు!’ – ఫిబ్రవరి 20, -2025) స్పందిస్తూ మామిడి నారాయణ ‘సిద్ధాంతం వేరు, సైన్స్ వేరు’ (మార్చి ౧, 2025) అంటూ వ్యాసం రాశారు. ‘‘మిగులు విలువ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం లేదు. రాదు కూడా’’ అన్న మామిడి నారాయణ ఆ అదనపు విలువ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం ఎందుకు లేదో సరిగ్గా తెలిస్తే, ‘‘సిద్ధాంతానికి ప్రత్యామ్నాయం రావచ్చు రాకపోవచ్చు, సైన్స్‌కు మాత్రం ప్రత్యామ్నాయం ఉండదు, కేవలం అప్‌గ్రెడేషన్ మాత్రమే ఉంటుంది’’ అనేవారు కాదు.

మార్క్స్ ఆవిష్కరించిన అదనపు విలువ సిద్ధాంతం కూడా సామాజిక శాస్త్రాలలోని వివిధ సిద్ధాంతాల, వాదాల అప్‌గ్రెడేషనే. చారిత్రక గతితర్కంలో భాగంగా వచ్చినదే మార్క్సిజం. అది ఉన్నపళంగా ఆకాశంలోంచి ఊడిపడలేదు. అప్‌గ్రేడేషన్ అనేది కేవలం ప్రకృతి శాస్త్రాలకే కాక సామాజిక శాస్త్రాలకూ వర్తిస్తుంది. కాకపోతే మార్క్సిజం రాకతో సామాజిక శాస్త్రాల్లో అప్‌గ్రెడేషన్ ఆగిపోయింది. అంటే ఆ శాస్త్రం ఆర్థిక రంగంలో పరిపూర్ణమయింది. ఆ సమగ్రతకు, మార్క్స్ కనిపెట్టిన C+V+S = C’లో ప్రకృతి నియమాలు ఇమిడి ఉండడమే కారణం! ఈ ‘C’ ఆక్సిలరీ పదార్థాలు, ముడి పదార్థాలు, శ్రమ/ ఉత్పత్తి సాధనాలు అనే మూడు విభాగాలుగా ఉంటుంది. ఇందులోని ఉత్పత్తి సాధనాలే టెక్నాలజీ అంటే. ఇందులో– నాటి చేతి పనిముట్టు నుంచి నేటి ఏఐ వరకు ఇమిడి ఉంటాయి. ఇలా ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా ఉన్నందువల్లే మార్క్సిజం సైన్స్ అయ్యింది.


నారాయణ పేర్కొన్న ఆర్థికవేత్తలు జే.బీ. సీ, ఆర్ధర్ సిసిల్ పిగూ. వీరి సిద్ధాంతాలలో శాస్త్రీయత ఎలాగూ ఉండదు కాబట్టి వాటిని వదిలేద్దాం. ‘‘(కార్మిక వర్గం) ఎక్కడా మార్క్స్ చెప్పినట్టు తిరుగుబాటు చేయలేదు’’ అంటూ నారాయణ పై ఇద్దరి విఫల సిద్ధాంతాలలోకి మార్క్స్ సిద్ధాంతాన్ని కూడా చేర్చారు! కార్మికులు ఇప్పటికీ తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నారు వివిధ రూపాలలో. అయితే వ్యవస్థను మార్చుకునే విధంగా తిరుగుబాట్లు రావడం లేదు. రాజకీయంగా విజయాలు ఎలా సాధించాలో కూడా మార్క్స్ చెప్పాడు. ఎంగెల్స్, లెనిన్, మావోలు కూడా చెప్పారు. ప్రధానంగా చారిత్రక పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలను మార్చుకోవాలన్నారు. ఇవన్నీ కమ్యూనిస్టు పార్టీలు చేయాల్సిన కర్తవ్యాలు. పార్టీల వైఫల్యాలే మార్క్స్ సిద్ధాంత వైఫల్యంగా చూడకూడదు.

ఇక నారాయణకు బాగా నచ్చిన ఆర్థికవేత్త జె.ఎమ్. కీన్స్! ఎందుకంటే, వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ‘లోటు బడ్జెట్ విధానాన్ని’ సూచించినందుకు! ‘‘ఒక సిద్ధాంతం విఫలమైనప్పుడు నష్ట నివారణకు ప్రత్యామ్నాయ సిద్ధాంతం కూడా వస్తుంది అనేది రుజువైంది’’ అంటున్నారు నారాయణ. ఆ రకంగా మార్క్స్ సిద్ధాంతం విఫలమై కీన్స్ సిద్ధాంతం వచ్చిందట! ఏ కమ్యూనిస్టు అయినా ఈ మాటలను అంగీకరిస్తాడా? అంటే ఇక వ్యవస్థను సమూలంగా మార్చే తిరుగుబాట్లు రావన్నమాట. ఇక ఈ సంస్కరణల సిద్ధాంతాలే మనకు దారీతెన్నూ!


‘‘ఆండ్రాయిడ్ మొబైల్ నిరుద్యోగం సృష్టిస్తున్నదని దాని వాడకం నిలిపివేయలేం కదా’’ అంటున్నారు నారాయణ. దాన్ని నిలిపివేయాలని ఎవరు అంటారు? టెక్నాలజీని వద్దు అని ఎవరైనా అంటారా? రంగనాయకమ్మ గారి వ్యాసంలో అలా ఎక్కడా లేదే?

‘‘కృత్రిమ మేధవల్ల పెట్టుబడిదారులకు విపరీత లాభాలు వస్తాయనేది ఒక భ్రమ’’ అంటూనే, ‘‘కేవలం అది ఒక దశ మాత్రమే’’ అని విచిత్రంగా మాట్లాడుతున్నారు నారాయణ. అంటే లాభాలు వచ్చినా కొంతకాలమే వస్తాయి అని. మరి, ఆ తర్వాత? ‘‘మళ్లీ అప్పుడు అప్‌గ్రెడేషన్ ఉండనే ఉంటుంది’’ అట! ఒకవేళ సంక్షోభాలు వస్తే? కీన్స్ ఎలాగూ ఉన్నాడు! ఇలా అంతా పరిష్కారమైపోతున్నప్పుడు అదనపు విలువ సిద్ధాంత ప్రాధాన్యత ఏమిటి? ఏ సిద్ధాంతాన్ని ఆయన ‘ప్రత్యామ్నాయంలేని సిద్ధాంతం’గా చెప్తున్నారో దాన్ని ఆచరణలో సాధ్యం చేయడం గురించి ఆయనకు అసలు ఆలోచనే లేదన్నమాట! ఆయన ప్రకారం అదనపు విలువ సిద్ధాంతం కేవలం ఆర్థిక శాస్త్రానికి మాత్రమే పరిమితం. సమాజ పురోగమనం అనేది సైన్స్‌కు సంబంధించింది! దీనికి దానికి ముడిపెట్టకూడదన్నమాట! సమాజం పట్ల ఇలాంటి అవగాహన ఉండబట్టే ‘‘సైన్స్ ఏ వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందనే వాదన అర్థరహితం’’ అంటున్నారు. ఒక కొత్త సరుకు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు వర్గ దృష్టితో అందులోని నిజానిజాల్ని చెప్పుకోకూడదా? దానిపట్ల ప్రచారం అవుతున్న విషయాలలో భ్రమలెంత, వాస్తవాలెంత అనేది చర్చించుకోకూడదా? ‘‘కృత్రిమ మేధ పనితీరు పట్ల అనుమానాలూ, భయాలూ అర్ధరహితం’’ అనే నారాయణ దానివల్ల ఉద్యోగాలు పోయే కార్మికులకు, భయం కలగడం అర్ధరహితమని భావిస్తున్నట్టా?

యూ.హెచ్. ప్రీతమ్

మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ

Also Read: నా చేతిలో కత్తి పెట్టి..

Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 12 , 2025 | 01:13 AM