When Writers Write for Cinema: సాహిత్యకారులు సినిమాకి రాస్తే
ABN , Publish Date - Sep 01 , 2025 | 01:06 AM
మంచి సాహిత్యం అనేది మానవ అనుభవాల, భావోద్వేగాల, తాత్త్విక ఆలోచనల సమాహారం. అది కేవలం పుస్తకాల్లో మాత్రమే బంధించబడదు. ఒక అద్దంలా గతాన్ని ప్రతిబింబించి, వర్తమానం మీద నిలబెట్టి, భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది. అదే విధంగా సినిమా కూడా...
మంచి సాహిత్యం అనేది మానవ అనుభవాల, భావోద్వేగాల, తాత్త్విక ఆలోచనల సమాహారం. అది కేవలం పుస్తకాల్లో మాత్రమే బంధించబడదు. ఒక అద్దంలా గతాన్ని ప్రతిబింబించి, వర్తమానం మీద నిలబెట్టి, భవిష్యత్తుకు మార్గదర్శనం చేస్తుంది. అదే విధంగా సినిమా కూడా సమాజానికి అద్దం లాంటిది. అది సాహిత్యం కంటే బలమైన ప్రభావాన్ని సమాజం మీద చూపిస్తుంది. దృశ్యరూపంలో, శ్రవ్యరూపంలో, తక్షణ ప్రభావంతో మనసును కదిలిస్తుంది. ఈ రెండు కళా మాధ్యమాలు కలిసినప్పుడు పుట్టేది ఒక బలమైన సృష్టి. అది వినోదానికో విలాసానికో పరిమితం కాకుండా కాలానికి సాక్ష్యంగా నిలిచి కదలి కదిలించే గొప్ప కృతి అవుతుంది.
తెలుగు సినీ చరిత్రలో సాహిత్యకారుల పాత్ర ఆరంభం నుంచే ఉంది. భావుకత నిండిన గీతాలతో ఆత్రేయ, పద మాంత్రికతతో రాసిన పాటలతో ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ, సినారె మొదలైన వారు సినిమాలకు వచ్చి తమదైన ముద్ర వేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. చలం, పాలగుమ్మి పద్మరాజు, కారా, అంపశయ్య నవీన్ వంటి వారి రచనలు సినిమాలుగా మారాయి. ఉన్నవ, తాపీ ధర్మారావు, గురజాడ, దేవులపల్లి, మల్లాది, త్రిపురనేని, విశ్వనాథ వంటి వారి సాహిత్యం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినిమాల్లో ప్రతిబింబించింది. సాహిత్యపు పద ప్రయోగ నైపుణ్యమైన జంధ్యాల హాస్యం, వ్యంగ్యం వెండితెరపై మెరిసింది.
మొదట భక్తిరస ప్రధానంగా ప్రారంభమైన తెలుగు సినిమా, క్రమంగా రైతుజీవితం, మధ్యతరగతి సమస్యలు, మానవ సంబంధాలను చూపింది. 1980లలో సంగీత భరితమైన భక్తి రస చిత్రాలు మళ్లీ పుంజుకున్నాయి. అప్పటివరకు సాహిత్యకారులు సినిమా వెంటే నడిచారు. కానీ తర్వాతి కాలంలో కమర్షియల్ ధోరణులు బల పడ్డాయి. ఫైట్లు, పాటలు, గ్లామర్, హీరోయిజం ప్రధాన మయ్యాయి. సీరియస్ సాహిత్యం వెనుకబడ్డది. మంచి సాహిత్యం రాసే రచయితలకు సినిమాలకు మధ్య దూరం పెరిగింది. హీరో అభిమానం, వందల కోట్ల బడ్జెట్, వ్యక్తి పూజ ఇవన్నీ కొత్త ధోరణులుగా వెలిశాయి. ఈ మార్పులతో తెలుగు సినిమా రూపమే మారిపో యింది. జీవితాలను చూపకుండా వినోదం పేరుతో రొటీన్ ప్రేమ ఫార్ములాతో, హింస, మసాలాలు దట్టించిన సినిమాలే విజయాలను సాధించాయి. అలాంటి తెలుగు సినిమా నేల దిగడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
ఐతే ఇన్ని వ్యాపార వాణిజ్య ఒత్తిళ్ల మధ్యలో కూడా టి. కృష్ణ, ముత్యాల సుబ్బయ్య బి. నర్సింగరావు లాంటి ఎందరో దర్శకులు సాహిత్య విలువలు నిలబెట్టారు. టి. కృష్ణ సినిమాలు సామాజిక న్యాయం, వర్గపోరాటం, సమానత్వం అంశాలను కేంద్రీకరించగా, ముత్యాల సుబ్బయ్య తన సినిమాల్లో మానవ సంబంధాల సున్నిత కోణాలను చూపించారు. బి. నర్సింగరావు తెలంగాణ వాస్తవిక జీవితాలను, భాషను తెరకెక్కించాడు. అప్పుడప్పుడు చుక్క తెగిపడ్డట్టు కొన్ని సినిమాలు సామాజిక స్పృహను కలిగి సంభాషణల్లో కవిత్వ మాధుర్యాన్ని భావుకతను అందించాయి.
తెలుగుతో పోల్చి చూసినప్పుడు తమిళ చిత్రసీమలో సినిమాకీ సాహిత్యానికీ సంబంధం మరింత బలంగా ఉంది. జయకాంతన్ నవలలు సామాజిక వాస్త వాలను అద్దంలా చూపించాయి. భారతిరాజా గ్రామీణ సాహిత్య సుగంధం అద్దిన కథలతో సినిమాలు తీశారు. మణిరత్నం చిత్రాల్లో జయమోహన్ రాసిన సంభాషణలు తాత్త్విక లోతును, మానవ సంబంధాల సంక్లిష్టతను ఆవిష్కరించాయి. మలయాళ సినీ రంగం సాహిత్యాధారిత చిత్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఎం.టి. వాసుదేవన్ నాయర్ స్క్రిప్టులు మానవ జీవితాల సంఘర్షణను లోతుగా చూపించాయి. వయలార్, బషీర్ రచనలు సినిమాల్లో మానవతా విలువలను నింపాయి. అక్కడి సినిమాలు కేవలం వినోదపు సినిమాలు కావు. వాస్తవికత, మానవత్వం సమానంగా కలిసిన జీవన వాస్తవ చిత్రాలు.
కరోనా తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల ఆవిర్భావం తెలుగు సినిమాకు కొత్త దిశను చూపింది. ప్రపంచ సినిమాలను చూడగల అవకాశం ప్రేక్షకులకు లభించింది. తమిళం, మలయాళం చిత్రాల బలమైన కథనశైలిని నూతనత్వాన్ని, జీవన వాస్తవికతను మన ప్రేక్షకులు ఆస్వా దించారు. వారి అభిరుచి మారింది. దీంతో చిన్న సినిమాలు, చిన్న దర్శకులు కూడా వెండితెర మీద నిలబడే అవకాశం పొందారు. రచయితలు దర్శకులు పూర్తి స్వేచ్ఛతో సాహిత్య విలువలు ఉన్న సినిమాలను తీసే అవకాశం వచ్చింది. ఇది సాహిత్య ఆధారిత చిత్రాలకూ రచయితలకు ఒక కొత్త దారిని చూపింది. కథాబలం ఉన్న ‘కంచరపాలెం’, ‘మల్లేశం’ లాంటి సినిమాలు, మానవతా విలువలకు పట్టంగట్టిన ‘బలగం’లాంటి సినిమాలు ఎలాంటి ప్రచారాల ఆర్బాటం లేకుండా ప్రేక్షకుల మన్ననలను పొందాయి. సాహిత్యకారులు సినిమాలకు రాస్తే ఎలాంటి సినిమాలు వస్తాయో చెప్పడానికి వీటి విజయమే ఒక ఉదాహరణ.
ఓటీటీతో ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు అందుబాటు లోకి వచ్చారు. మార్కెట్ పరిమితులు తగ్గుతున్నాయి. ఈ కాలంలో ఒక గొప్ప సాహిత్యకారుడు సినిమాకి రాస్తే, కథలో మానవీయ లోతు, సంభాషణల్లో కవిత్వం, పాత్రల్లో ఆత్మ, దృశ్యాల్లో సాంస్కృతిక వైభవం తప్పక ప్రతిబింబిస్తాయి. అయితే కొన్ని అడ్డంకులు లేకపోలేదు. వాణిజ్య ఒత్తిళ్లు, నిర్మాతల లాభనష్టపు లెక్కలు, తక్షణ వినోదం కోరే ధోరణి, ఏండ్లకేండ్లుగా రొటీన్ ప్రేమ కథల ఫార్ములాలు ఉన్నాయి. ఇవే తెలుగు సినిమాలో మంచి రచయితలను లేకుండా చేసాయి. కానీ సాహిత్యానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రేక్షకులు పెరిగితే, పుస్తక పఠనం అలవాటు విస్తరించితే, నిర్మాతలు కూడా వెనుక డుగు వేయరు. ప్రభుత్వం, సాంస్కృతిక సంస్థలు సాహిత్య ఆధారిత చిత్రాలకు ప్రోత్సాహం అందిస్తే, భవిష్యత్తులో తెలుగు సినిమాకు మరో సువర్ణయుగం సాధ్యం.
సాహిత్యం లేని సినిమా బలహీనమవుతుంది. సాహిత్యం ఉన్న సినిమా యుగాలను దాటి నిలుస్తుంది. దూరమైన సాహిత్యం – సినిమా కలయిక నేటికీ సాధ్యమే. సాహిత్య కారులు తెరమీద అడుగుపెడితే భాష గౌరవం పెరిగి, లోతు పెరుగుతుంది. ప్రేక్షకులు ఆమోదిస్తే, నిర్మాతలు ప్రోత్సహిస్తే తెలుగు సినీ ప్రపంచం మరోసారి సాహిత్య సువాసనతో పరిమళించే రోజులు ఎంతో దూరంలో లేవు.
పెద్దింటి అశోక్ కుమార్
94416 72428
ఈ వార్తలు కూడా చదవండి..
హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు కేసు విషాదాంతం
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు.. ఎన్నిరోజులంటే..
For More AP News And Telugu News