Share News

Deep Crisis of Political Ethics: నోటు ఓటు వాపసీ

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:26 AM

ఎన్నికలలో ఓటు కొనడానికి రాజకీయ పార్టీలు డబ్బు పంచటం మామూలే. తాము డబ్బు ఇచ్చినా ఆ ఓటరు పోలింగ్‌ బూత్‌కు వచ్చి అసలు ఓటే వేయలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటరును డబ్బు వాపస్ చేయాలని కూడా...

Deep Crisis of Political Ethics: నోటు ఓటు వాపసీ

ఎన్నికలలో ఓటు కొనడానికి రాజకీయ పార్టీలు డబ్బు పంచటం మామూలే. తాము డబ్బు ఇచ్చినా ఆ ఓటరు పోలింగ్‌ బూత్‌కు వచ్చి అసలు ఓటే వేయలేదని నిర్ధారించుకున్న తర్వాత రాజకీయ పార్టీలు ఇప్పుడు ఓటరును డబ్బు వాపస్ చేయాలని కూడా అడుగుతున్నాయట. ఇదొక వింత పరిణామం. సరే బావుంది. అలాంటపుడు అవే రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అవుతున్నాయి కదా, మరి ఓటర్ ఎందుకు తన ఓటును వాపస్ చేయాలని అడగకూడదు? పార్టీలు డబ్బును రీకాల్ చేస్తున్నపుడు ప్రజలు ఓటును కూడా రీకాల్ చేయాలి. ఘర్ వాపసీ, అవార్డు వాపసీ లాగా ఓట్‌ వాపసీ ఎందుకు ఉండదు?

ఈ ప్రజాస్వామ్య వాణిజ్యం ఇప్పటివరకూ చాలా విచిత్రాలను చూసింది. ఒక్కరికే ఓటు వేయగలనన్న సంగతి తెలిసి కూడా ఓటరు అభ్యర్థులందరి దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం తెలిసిందే. మాకు ఫలానా అభ్యర్థి తాలూకు డబ్బురాలేదని టెంట్లు వేసి ధర్నాలు చేసిన మహా గొప్ప సందర్భాలూ తెలుసు. ఏకంగా అభ్యర్థుల ఇంటి మీద దాడులు చేసి డబ్బు డిమాండ్ చేసిన ఉదాహరణలూ ఉన్నాయి. ఈ వాణిజ్య పొలిటికల్ సెన్సెక్స్‌లో గత పాతికేళ్లలో షేర్ విలువ ద్రవ్యోల్బణం కంటే అతివేగంగా రెండు వందల రూపాయల నుంచి మూడు వేలకు పెరిగింది.

ఈ నేపథ్యంలో మనం రెండు వర్తకాల గురించి మాట్లాడుకుందాం. ఒకటి చట్ట విరుద్ధం, మరొకటి నైతిక విరుద్ధం. ప్రజాస్వామ్యం గురించి వాణిజ్య భాషలో మాట్లాడుకోవల్సి రావడం విషాదమే. ఇప్పుడు ఓటరుకూ రాజకీయానికీ మధ్య ఈ–కామర్స్ పాలసీ నడుస్తోంది. డబ్బు తీసుకున్న ఓటర్లు పోలింగ్ బూత్‌కి వెళ్లలేదు, ఓటు వేయలేదు. అంటే, ‘‘ప్లేస్ చేసిన ఆర్డర్ డెలివరీ కాలేదు’’ అన్నట్టే. దాంతో పార్టీలు, ‘‘సార్, మా పార్టీ వాల్యూకి డబ్బు ఇచ్చాం, మీరు సర్వీస్ తీసుకోలేదు, కాబట్టి మా అమౌంట్ పే బ్యాక్ ఇవ్వండి’’ అంటున్నాయి. నవ్వొచ్చే ధర్మం కదూ! ఇదంతా వింటుంటే ప్రజాస్వామ్యం కాదు, ఒక చీకటి వర్తకం జరుగుతున్నట్లు అనిపిస్తోంది కదూ! ఓటుకు ధర, వాగ్దానానికి విలువ ప్రజాస్వామ్యంలో ‘నో రిటర్న్’ పాలసీ అయ్యాయా?


ప్రజాస్వామ్యం అంటే అమ్మకం– కొనుగోలు కాదు, పరస్పర నమ్మక అలిఖిత ఒప్పందం. ఓటుకు డబ్బు పంచడం చట్టవిరుద్ధం. హామీలు నెరవేర్చకపోవడం చట్టపరంగా తప్పు కాకపోయినా నైతిక నేరం. రాజకీయ పార్టీలు డబ్బు ఇచ్చి ఓటును కొనాలనుకోవడం ఎంత తప్పో, ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఓటు పొందడం కూడా అంతే తప్పు. ఓటు ఆశ చూపి నగదు చేసుకోవడం అంతకంటే ఎక్కువ తప్పు. ఇక్కడే డ్యూయల్ ట్రేడింగ్ నడుస్తోంది. ఓటరు తన ఓటుకు ముడుపు తీసుకుని అదే ఓటును ముడుపుగా చెల్లించి తనకు కావల్సిన ప్రజాస్వామిక సౌకర్యాలను లబ్ధిగా పొందాలనుకుంటున్నాడు. డబ్బు రిఫండ్ సరే, వాగ్దానాల రిఫండ్ ఎక్కడ?

ఓటును కొనేవాళ్లా? ఓటును అమ్ముకునే వాళ్లా? ఎవరు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోంది అనే ఒక కీలక ప్రశ్న ఇక్కడే ఎదురవుతోంది. ఇప్పటికే పాతాళం ఎక్కడ అంటే పైకి చూపించేంత దిగువన ఉన్నాం. ఇంకా ఏ లోతులకీ దిగజారుడు? రాజకీయ మార్కెట్లో పార్టీలు ఎప్పుడూ ఆఫర్లు ఇస్తూనే ఉంటాయి. పార్టీ మేనిఫెస్టోలు ఓటర్ల హక్కుల పత్రాలు కాదు, సీజనల్ బ్రోచర్లు. అందులో హామీలన్నీ ‘‘కొనండి సార్, తర్వాత చూస్తాం’’ అంటున్నాయి. నిజానికి డబ్బు తీసుకున్న ఓటరే పాక్షిక నీతిమంతుడు. ఆ ఓటరుకు ఒక నైతిక స్పష్టత ఉంది. ‘‘నువ్వు డబ్బు ఇచ్చావా? బాగుంది. నేను తీసుకున్నాను. మరి ఓటు? అది నా ఇష్టం. ఎవరికైనా వేస్తాను, అసలు వేయను’’ అనగలిగితే అది పాక్షిక నైతిక ప్రజాస్వామ్య స్వేచ్ఛ. ఎన్నికల తర్వాత హామీలు నిలబెట్టని పార్టీలు ఓటర్లను ‘పరిగణనలోకి తీసుకోని’ స్థితిలో ఉంటే, ఎందుకు ఓటర్లు తమ ఓటును తిరిగి కోరుకోకూడదు? ఇదే ప్రశ్న దేశవ్యాప్తంగా ఒక పెద్ద రాజకీయ, నైతిక చర్చగా మారాలి. మార్చగలరా?


డబ్బులను తిరిగి అడిగే క్రమంలో పార్టీలు నానా హంగామా చేస్తున్నపుడు హామీలు నిలబెట్టని పార్టీల విషయంలో ప్రజలు ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి? ఎన్నికల సమయంలో ‘‘మనం చేస్తాం, ఇస్తాం’’ అని చిట్టా విప్పిన తర్వాత, అధికారంలోకి వచ్చాక రాజకీయ పార్టీలు ఆ హామీలకు చెవిటి చెవిని అప్పగించడం మనకు కొత్తేమీ కాదు. అత్యంత విచిత్రం ఏమిటంటే తాము ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగే పార్టీలు, తామే ఇచ్చిన హామీలను మాత్రం అలవోకగా మరిచిపోతాయి. సరే రీకాల్ అనే వ్యవస్థ గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరమేమో కానీ అది అసెంబ్లీకి పార్లమెంటుకు వర్తించదు. అలా వర్తించాలి అని డిమాండ్ చేయడం అవసరమే కానీ ఈ లోగానే ప్రజాస్వామ్యం భ్రష్టుపట్టే సూచనలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అధికారాన్ని ఎవరికిచ్చామో మర్చిపోయే ప్రజాస్వామ్యం బలహీన ప్రజాస్వామ్యమవుతుంది. అధికారాన్ని అవసరమైతే వెనక్కి తీసుకునే ప్రజాస్వామ్యం మాత్రమే తన బలాన్ని ప్రదర్శించగలుగుతుంది. మా ఓటును కూడా వెనక్కి తీసుకునే హక్కు మాకు ఉండాలి కదా? ఈ ప్రశ్న సామూహిక అవగాహనగా మారితే, అదే దేశ రాజకీయ పటాన్ని మార్చే శక్తి.

ప్రజాస్వామ్యం అంటే అయిదేళ్లకోసారి ఓటు వేసో వేయకుండానో బాధ్యత నుంచి పారిపోయి చేతులు దులుపుకోవడం కాదు. అది అప్రమత్తత, ప్రశ్నించే ధైర్యం, హక్కులను మళ్లీ మళ్లీ స్వాధీనం చేసుకునే శక్తి. ఓటు అనేది ఒక్క రోజు వేసి మరిచిపోయే వన్ డే స్టాండ్ కాదు. అది ప్రతినిధికి అయిదేళ్లపాటు మన జీవితాల్లో, మన గ్రామాల్లో, మన రాజకీయ భావజాలంలో జోక్యం చేసుకోవడానికి ఇచ్చే అధికార పత్రం. మన నిత్య జీవిత గమనాన్ని సులభతరం చేయడానికి ఇచ్చే అయిదేళ్ల పర్మిట్. ఈ అధికార పత్రాన్ని దుర్వినియోగం చేస్తే? హామీలను నిలబెట్టకపోతే? ప్రజలతో సంబంధం కోల్పోతే? రీకాల్ చేయాలి. అధికారాన్ని ఇచ్చింది ప్రజలే అయితే, దానిని వెనక్కి తీసుకునే హక్కు కూడా ప్రజలదే కదా. ఇదే ‘రీకాల్’ అనే ప్రజాస్వామ్య హక్కు మూల భావన.


ఎన్నికైన ప్రజాప్రతినిధి తన బాధ్యతలను నిర్వర్తించకపోతే, అతణ్ణి పదవిలో నుంచి మధ్యంతరంగానే ప్రజలు తొలగించే హక్కు. ఇది కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. మన దేశంలోని కొన్ని స్థానిక సంస్థల్లో కూడా రీకాల్‌కు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. అప్పుడే వాగ్దానాలు కేవలం ప్రసంగాల కోసం కాకుండా ఒప్పందాలుగా మారతాయి. ఓటర్లు అయిదేళ్లకు ఓసారి కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షకులుగా మారతారు, రాజకీయం సేవారంగంగా తిరిగి మారడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా ఒక కల. ఒక ఆశ. ఒక ఆకాంక్ష.

ఇదంతా అనేకానేక అనైతికతల మధ్య ఘర్షణ. ఓటు అమ్ముకోవడం ఒక అనైతికత. ఓటు కొనడం మరో అనైతికత. ఓటు అమ్ముకుని అసలు బూత్‌కి వెళ్లకపోవడం మరింకో అనైతికత. ఓటు వేయనేలేదు కనుక డబ్బు తిరిగివ్వమనడం ఇంకింకో అనైతికత. ఇన్ని అనైతికతల నడుమ పరస్పర ఘర్షణలో ఓటమి మాత్రం ప్రజాస్వామ్యానిది. కాదు కాదు ప్రజలదే. ఈ పోరాటంలో ప్రజలు గెలవాలంటే ‘నాకే మీ ఓటు’ అని అడిగేవాళ్లతో ‘నా ఓటు నాకిచ్చెయ్’ అని అడగాలి. అడగగలగాలి.

పార్టీలు ఓటు కొనుక్కోవడానికి ఆర్డర్ పెట్టి, సరుకు డెలివరీ కానపుడు ఆ డబ్బు రిటర్న్ తీసుకోవడానికి పరితపించడం సబబే అనుకున్నా, ప్రజలు ఓటు ఇచ్చి వంచనకు గురయినపుడు తీసుకోవల్సిన రీఫండ్ మాత్రం ఒక్కటే– మరో ఎన్నికలో ఓటు హక్కు. అమ్ముడుపోని ఓటు హక్కు.

ప్రసేన్ (కవి, రచయిత)

ఈ వార్తలు కూడా చదవండి..

రాష్ట్రపతి ముర్ము పర్యటన.. హైదరాబాద్‌‌లో ట్రాఫిక్ ఆంక్షలు

కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్

Read Latest TG News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 01:26 AM