Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ కొంత ఆనందం కొంత వెలితి
ABN , Publish Date - Sep 25 , 2025 | 06:01 AM
రాష్ట్ర నడిగడ్డ నగరం, తెలుగు వారి గుండె చప్పుడు అయిన విజయవాడలో ‘విజయవాడ ఉత్సవాలు’ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇందుకు కారకులయిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనీయులు. కొన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్...
రాష్ట్ర నడిగడ్డ నగరం, తెలుగు వారి గుండె చప్పుడు అయిన విజయవాడలో ‘విజయవాడ ఉత్సవాలు’ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇందుకు కారకులయిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అభినందనీయులు. కొన్ని ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే భారీ ఉత్సవంగా నిర్వాహకులు చెపుతున్నారు. దాదాపు 280 ఈవెంట్స్ జరుగుతున్నట్లు ప్రకటనల ద్వారా తెలుస్తున్నది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ ఈ వేడుకలను ప్రారంభించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ‘ఉమ్మడి కృష్ణా–విజయవాడ’ ప్రాశస్త్యాన్ని చాలా గొప్పగా చెప్పారు.
విజయవాడ ప్రాశస్త్యం వర్తమానానికి సంబంధించినది కాదు. మహాభారతం వంటి ప్రాచీన ఇతిహాసాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది. సామాన్య శకం (సా.శ.) మహాభారతం జరిగిందో లేదో అని చరిత్రకారులు మల్లగుల్లాలు పడుతున్నా, మహాభారత ఇతిహాసమైతే నిజం కదా! ఆ ఇతిహాసంలోని కథాకాలం సా.శ. పూర్వం 1500 సంవత్సరాలుగా చరిత్రకారులు చెపుతున్నారు. అనగా ఆ కాలంలోనే ఈ నగరం ఉందనేందుకు అందులో పేర్కొన్న ఇంద్రకీలాద్రి ఒక ఆధారం. అది పురాణ కథనుకున్నా, సా.శ. పూర్వ 300 నాటికి ముందు నుంచి గల చారిత్రక ప్రాంతం ఇది. తెల్‌వాహీ నది ఒడ్డున ఉన్న ఆంధ్రనగరి ధాన్యకటకం అని, విజయవాడ అని సంశయాలున్నా, మొత్తంగా అది ఈ ప్రాంతమే కదా! అమరావతి శిల్పాలు, చైత్యాలు, శాసనాలు, భట్టిప్రోలు లిపి, ఇక్కడి గుహలు (ఇంద్రకీలాద్రి, మొగల్రాజపురం, ఉండవల్లి, గుణదల, ముస్తాబాద, అంబాపురం) సా.శ. 3–6 శతాబ్దాల నాటివి. 7వ శతాబ్దిలో విష్ణుకుండిన శాసనాలు, అదే శతాబ్దంలో చైనా యాత్రికుడు యువాన్‌చాంగ్ రాతల్లోని ప్రస్తావనలు.. ఇవన్నీ ఈ నగర చారిత్రక ప్రాధాన్యతను తెలియజేస్తాయి. నదీ–సముద్ర మార్గాల సమీపాన ఉండటం వల్ల విజయవాడ పూర్వం నుంచి వాణిజ్య నగరం.
ఆధునిక కాలంలో.. బందర్ ద్వారా విదేశీయుల రాకతో ముందస్తుగా పాశ్చాత్య నాగరికతలను కూడా అందిపుచ్చుకున్న ప్రాంతం. అచ్చు యంత్రాలతో పుస్తకాలు, పత్రికల ముద్రణ, తద్వారా గ్రంథాలయోద్యమాలు అనేక సంస్కరణోద్యమాలు, హేతువాద ఉద్యమాలు, స్వేచ్ఛా ఉద్యమాలు, ఆపై రాజకీయోద్యమాలతో ఆధునిక కాలంలో రాజకీయ రాజధానిగా పేరుగాంచింది. తెలుగునాట స్వాతంత్య్ర పోరాట వేదిక ఇది. మహాత్మాగాంధీ ఈ నగరాన్ని ఏడుసార్లు సందర్శించాడంటేనే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతం తెలంగాణ సాయుధ పోరాటానికి సమిధలిచ్చింది. స్వరాష్ట్రోద్యమానికి వేదికయింది. బ్రిటిష్ కాలం నుంచి జాతీయ రోడ్డు రైల్వే రవాణా మార్గాలకు ఇది దక్షిణాదిలోనే పెద్ద కూడలి. కూచిపూడి నాట్యం, కొండపల్లి బొమ్మ, నూజివీడు వీణలు వంటి కళా సంస్కృతుల వైభవం ఈ ప్రాంతం సొంతం.
అలాంటి ప్రాంతంలో ‘విజయవాడ ఉత్సవ్’ జరగడం ఎంత సంతోషదాయకమో, ఆ ప్రాశస్త్యాలకు సంబంధించిన ప్రదర్శనలు ఇందులో లేకపోవడం భారీ వెలితి. స్వాతంత్ర్యోద్యమ ఘట్టాల ప్రదర్శనలు లేవు. స్వరాష్టోద్య్రమ కేంద్రం ఇది. పొట్టి శ్రీరాములు గుడివాడ గాంధీ ఆశ్రమంలోనే ఉంటూ చెన్నై వెళ్లి నిరాహారదీక్ష చేసి అసువులు బాశారు. గాంధీ హిల్ వంటి స్వాతంత్ర్యోద్యమ ప్రాంతాల సందర్శనలు లేవు. విశ్వనాథ, చలం, జాషువా, వంటివారున్న ఈ ప్రాంత భాషా సాహిత్య ప్రాశస్త్యాల ప్రదర్శనలు లేవు. పుస్తకాల ప్రదర్శనలు లేవు. ఇక్కడి విజయవాడ బుక్ సొసైటీని సంప్రదించినట్లు కూడా సమాచారం లేదు. ఇక్కడికే ప్రత్యేకమయిన పెడన కలంకారీ, మంగళగిరి చేనేత, నూజివీడు–జగ్గయ్యపేట వీణలు, కొండపల్లి బొమ్మలు వంటి వస్తు కళా ప్రదర్శనలు లేవు. కొండపల్లి, కొండవీడు కోటలు, కొల్లేరు సరస్సు, భవానీ ద్వీపం, మంగళగిరి, ఆగిరిపల్లి, యనమలకుదురు గుడులు, అమరావతి, భట్టిప్రోలు, ఘంటసాల, బ్రహ్యలింగం చెరువు వంటి సందర్శనలు లేవు.
తెలుగు పత్రికలు పుట్టిందీ పెరిగిందీ ఇక్కడే. కృష్ణా పత్రిక, ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వంటి ఎన్నో పత్రికల పాదు ఇది. తెలుగు నాటకం విస్తరించింది ఇక్కడ. దుర్గాకళామందిరం వంటి నాటకశాలలు ఆనాడే పదుల సంఖ్యలో వెలిశాయి. తెలుగు సినిమా పుట్టిందీ, పెరిగిందీ ఇక్కడ. వేటూరి వంటి దిగ్గజ రచయితలు, గూడవల్లి, రాఘవేంద్రరావు వంటి దర్శకులు, చల్లపల్లి జమిందారు, అశ్వనీదత్ వంటి నిర్మాతలు, ఎన్టీయార్, ఎయన్నార్, ఎస్వీయార్, సావిత్రి వంటి నటులు, ఘంటసాల వంటి సంగీతజ్ఞులు ఇక్కడివారే. మొత్తం సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇక్కడే ఉండేది. రాష్ట్రంలోనే అత్యధిక సినిమా థియేటర్లు ఉండేవి. వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్లు ఈ ఉత్సవంలో ఎక్కడా చోటుచేసుకోలేదు.
కేవలం నాలుగు వేదికలకు పరిమితం చేసి దీనిని ఒక కార్నివాల్ లాగా మార్చేశారు. గొల్లపూడి నుంచి పున్నమీ ఘాట్ వరకు మూడు కి.మీ పరిధిలోనే మొత్తం ఉత్సవం వేదికలపై జరుగుతున్నది. (మ్యూజిక్ కాలేజీ ఒకటి వేరే ప్రాంతం). కనీసం పవిత్ర సంగమం దగ్గర ఒక వేదిక పెట్టాలనే ఆలోచనే చేయలేదు. విజయవాడ అంటే కనకదుర్గమ్మ మాత్రమే, కృష్ణానది మాత్రమే అన్నట్లు ఉన్నాయి.. ప్రదర్శనలు కూడా! అవకాశమున్న మేరకు ఈ లోపాలను సవరించుకునే ప్రయత్నం చేయాలి. ఏదేమైనా ఈ ఉత్సవం విజయవంతం కావాలని ఆకాంక్షిద్దాం.
టి. కొండబాబు
సీనియర్ జర్నలిస్ట్
వార్తలు కూడా చదవండి..
కృష్ణమ్మకు వరద పోటు.. ప్రభుత్వం అలర్ట్
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
For More AP News And Telugu News