Kakatiya Dynasty: వెన్నయతో కాకతీయ వంశోద్భవం
ABN , Publish Date - Sep 21 , 2025 | 12:39 AM
కాకతీయ వంశ ఆదిపురుషుడు ‘గుండన’ అనీ, నందిగామ మండలం మాగల్లు సమీపంలోని కాకర్తి గ్రామం ‘ఆ వంశ ఆద్యుడు’ జన్మస్థలమంటూ ఈనెల 15న ప్రచురితమైన వార్తాకథనానికి స్పందన ఇది. బయ్యారం చెరువు శాసనం, జనగామ జిల్లా పాలకుర్తి...
కాకతీయ వంశ ఆదిపురుషుడు ‘గుండన’ అనీ, నందిగామ మండలం మాగల్లు సమీపంలోని కాకర్తి గ్రామం ‘ఆ వంశ ఆద్యుడు’ జన్మస్థలమంటూ ఈనెల 15న ప్రచురితమైన వార్తాకథనానికి స్పందన ఇది. బయ్యారం చెరువు శాసనం, జనగామ జిల్లా పాలకుర్తి దగ్గరలో గల గూడూరు శాసనం సాక్షిగా... కాకతీయ వంశ మూలపురుషుడు గుండన కాదు ‘వెన్నయ’. ఇది నేను చెబుతున్నది కాదు. కాకతీయుల చరిత్రను పరిశోధించేందుకు జీవితకాలం కృషి చేసిన పి.వి పరబ్రహ్మ శాస్త్రి లోకానికి చాటిన విషయాల్లో ఇదొకటి.
కాకతీయ వంశవృక్షంలో, క్షత్రియులు తరచుగా పేర్కొనే చారిత్రక పురుషుడు దుర్జయుడు కనిపిస్తాడు. ఆ తర్వాత కాకతీయ వంశస్థాపకుడిగా ‘వెన్నయ’ కనిపిస్తాడు. ఆ క్రమాన్ని తన ‘కాకతీయులు’ గ్రంథంలో పరబ్రహ్మ శాస్త్రి ఇలా వివరించారు. 1. కాకతీ వెన్నయ (750–768). 2. మొదటి గుండన (768–824). 3. రెండవ గుండన (824–870). 4. మూడవ గుండన (870–895). 5. ఎర్రయ నాయకుడు (895–940). 6. నాల్గవ గుండన (కాకర్త్య గుండన) (950–995)... ఇలా కాకతీయ వంశకర్త వెన్నయ నాయకుడి నుంచి 14వ తరం వాడైన గణపతిదేవుని వరకు వరుసగా బయ్యారం శాసనం పేర్కొంటున్నది. ఈ సమగ్ర శాసనాన్ని గణపతిదేవ చక్రవర్తి సోదరి అయిన మైలాంబ బయ్యారం చెరువు తవ్వించి, తన స్వహస్తాలతో అక్కడ ప్రతిష్ఠించింది.
కాకతీయ వంశ చరిత్రకు సంబంధించి ఇదొక ఆయువుపట్టు లాంటి శాసనం. కాకతీయులకు సంబంధించిన అనేకానేక శాసనాల్లో ఇంత సమగ్ర శాసనం మరొకటి లేదు! కాకతీయ వంశ మూలపురుషుడైన వెన్నయ నాయకుడు, రాష్ట్రకూట చక్రవర్తి అయిన దంతి దుర్గుని రాజ్య నిర్మాణానికి సహకరించాడు.
వెన్నయనే కాకతీయ వంశ స్థాపకుడని ఆ శాసనం ఇలా పేర్కొన్నది– ‘‘తదన్వయే వెన్న నృపో భభూవ ఖ్యాతస్సదా సన్నతవైరి భూపయా కాకతిస్థ పృథివీం శశాస తేనాస్య వంశ్యా ఆపి కాకతీశా.’’ అదేవిధంగా చాళుక్య గాంగ కుమార సోమేశ్వరుడు 1124 లో వేయించిన గూడూరు శాసనంలో కూడా ‘‘వెన్నడను సంభవుడైయ్యనది ప్రసిద్ధుడై వినుతి విరోధి మాండలిక వెన్నడు వెన్నుడై వోలె’’ అంటూ ఆ శాసనంలో వెన్నయ ప్రస్తుతి కనిపిస్తుంది. ఈ వెన్నయ కక్కిరాలపల్లి, కట్య్రాల, పంతిని గ్రామాల మధ్యలో ఒకప్పుడు ఉండిన కాకతీపురానికి అధిపతి! రాష్ట్రకూటుల సామంతునిగా ఈ కాకతీ పురాధిపతిగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం ఉన్న ఓరుగల్లు కోటకు కూతవేటు దూరంలోనే ఉంది!
కాకర్త్య గుండనగా పేర్కొంటున్న అతనికి ముందు... వెన్నయ తర్వాత మరో ముగ్గురు గుండనలు ఉన్నారు. ఈ కాకర్త్య గుండనను పిండి గుండన అని కూడా అంటారు అంతేకాదు, ఓరుగల్లు స్థానిక చరిత్రకారులు ఆయనను ‘పెండ్లి గుండన’ అని కూడా అంటారు. అదెలాగంటే ఈ గుండన కాకతీ ఎర్రయ్య రాజుకు అల్లుడిగా రావడం వల్ల పెండ్లి గుండనగా పిలవబడ్డాడు.
ఇక కాకతీపురం విషయానికొస్తే అది ఎక్కడో దూరంగా లేదు. ఓరుగల్లు కోటకు దగ్గరలోనే ఇందాక చెప్పుకున్నట్టు కక్కిరాలపల్లి, కట్రియాల, పంతిని గ్రామాల మధ్య ఉంది. అది ఎలాగంటే కాకతీయులకు సంబంధించిన శాసనాలు 88 దాకా ఈ చుట్టుపక్కలే దొరికాయి. ఈ శాసనాలు దొరికిన ప్రదేశాల్ని కలుపుతూ ఒక వృత్తంలాగా గీసుకుంటూ పోతే వృత్త కేంద్రంలో పురాతన కాకతీపుర శిథిలాలు ఉన్న ప్రదేశం మనకు కనిపిస్తుంది!! ఈ ప్రదేశంలోనే ఎనిమిదవ శతాబ్దంలో కాకతీయ వంశ స్థాపకుడు అయిన వెన్నయ ఈ ప్రాంతంలో కాకతీపురాన్ని నిర్మించి పరిపాలన సాగించాడు.
కాకర్త్య గుండనగా చెప్పబడుతున్న ఈ నాలుగవ గుండన తర్వాత వచ్చిన కాకతీయ పాలకుడైన బేతరాజు శాసనాలు 1051 నాటివి, పూర్వ కరీంనగర్ జిల్లాలో భాగమైన శనిగరంలో లభించాయి. 1053 నాటి కాకతీయ మొదటి ప్రొలరాజు శాసనం, కాకతీయ దుర్గరాజు వేయించిన కాజీపేట శాసనం అనుసరించి హనుమకొండను మొదటి ప్రొలరాజు శాసనబద్ధంగా పొందటాన్ని బట్టి చూస్తే కాకతీయుల పూర్వ నివాస స్థానం కాకతీపురం ఎక్కడో మైళ్ళ దూరంలో ఉన్నదని చెప్పచూడడం హాస్యాస్పదం!
మొదటి తరం, రెండవ తరం కాకతీయులు ఎవరిని తీసుకున్నా ఆనాటి పాలకులు వేయించిన శాసనాలన్నీ మనకు తెలంగాణలోనే ఎక్కువ శాతం కనిపిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో తక్కువ! రుద్రమదేవి గుడిమెట్ల కృష్ణా నది తీరంలో నిద్ర చేయడానికి గల కారణం ఆమె తండ్రి అయిన గణపతిదేవ చక్రవర్తి రాజ్య విస్తరణలో భాగంగా నిడదవోలు పాలకుడైన చాళుక్య వీరభద్రుడికి రుద్రమదేవినిచ్చి పెళ్లి చేశాడు. దురదృష్టవశాత్తు చాళుక్య వీరభద్రుడి అకాల మరణం వల్ల ఆమె, ఆ ప్రాంతంలో నిద్ర చేయాల్సి వచ్చింది. కోస్తాంధ్ర ప్రాంతంతో పాటు తమిళనాడులోని కంచి వరకు కాకతీయ సామ్రాజ్యమే కనుక అన్నిచోట్ల అక్కడక్కడ వాళ్ళ శాసనాలు నేటికీ కనిపిస్తుంటాయి! అంత మాత్రాన ప్రతి చోట కాకతీపుర అవశేషాలు వెలికితీయడం కోసం ప్రయత్నాలు చేయాలనుకోవడం వృధా ప్రయాస!!
డా. అంబటి శ్రీనివాస్ రాజు
(మన కాకతీయులు గ్రంథకర్త)
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News