Share News

Vaddadi Papayya Vapa: వర్ణ మాంత్రికుడు వడ్డాది పాపయ్య

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:17 AM

రంగుల రారాజు, వపా అనే పేర్లతో ప్రశస్తిగాంచిన చిత్రకారుడి పూర్తి పేరు వడ్డాది పాపయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో సెప్టెంబర్ 10, 1921న మహాలక్ష్మి, రామమూర్తి దంపతులకు జన్మించారు...

Vaddadi Papayya Vapa: వర్ణ మాంత్రికుడు వడ్డాది పాపయ్య

రంగుల రారాజు, వపా అనే పేర్లతో ప్రశస్తిగాంచిన చిత్రకారుడి పూర్తి పేరు వడ్డాది పాపయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో సెప్టెంబర్ 10, 1921న మహాలక్ష్మి, రామమూర్తి దంపతులకు జన్మించారు. వడ్డాది పాపయ్య తన ఐదవ ఏటనే చిత్రకళ ఆరంగ్రేటం చేసారు. ఆయన తండ్రి చిత్రకళా ఉపాధ్యాయుడు కావడంతో చిత్రకళలో ఓనమాలు తండ్రి వద్దనే నేర్చి, ఆయన బొమ్మలు గీచే పద్ధతిని పరిశీలించి అతి చిన్న వయసులోనే ఇంటిలో ఉన్న రవివర్మ గీచిన ‘కోదండరామ’ చిత్రంను ప్రేరణగా తీసుకుని హనుమంతుని చిత్రాన్ని గీసారు పాపయ్య.

పాపయ్య చిత్రాలను తొలినాళ్ళలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు తన పత్రికలలో ప్రచురించి, ప్రోత్సహించారు. ఆ తరువాత రేరాణి, మంజూష, అభిసారిక, ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్రజ్యోతి, యువ, చందమామ, బాలి, జ్యోతి, స్వాతి వార, మాస పత్రికల్లో వపా వర్ణ, రేఖా చిత్రాలు, కార్టూన్లు గీయటం ప్రారంభించారు. వపా తన కుంచెతో చందమామ పిల్లల మాసపత్రికను దాదాపు అర్ధశతాబ్దం పాటు తీర్చిదిద్దారు. అప్పటిలో చందమామ వివిధ భాషలలో ప్రచురితమయ్యేది. ఆ విధంగా పాపయ్య చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.

దీపావళి ప్రత్యేక సంచికలు వడ్డాది పాపయ్య వర్ణ చిత్రాలతో పాఠకుల మనసులను దోచుకునేవి. ముఖచిత్రాలు చూసి వార, మాసపత్రికలు కొనేలా చేసిన చిత్రకారుడు ఆయన. చందమామలో ఆయన మూడు దశాబ్దాల పాటు క్రమం తప్పకుండా ఐదువందలకు పైగా ముఖచిత్రాలు గీచారు. ఆయన జీవించి ఉన్నంతకాలం మరొకరు ఆ పత్రిక ముఖచిత్రం గీయలేదు. నవ్వులు పువ్వులు, వాణి, ఆనందవాణి, యువ, ఆంధ్రజ్యోతి తదితర పత్రికల్లో వపా వందల కార్టూన్లు తనదైన శైలిలో వేశారు. ప్రాచీన సాహిత్యాన్ని ఆకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాలు అద్ది చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు ఆయన. వపా కార్టూన్లు, రేఖాచిత్రాలు గీయడమే కాదు, కొన్ని కథలూ రాసారు. చందమామలో కొడవటిగంటి కుటుంబరావు మొదలుపెట్టిన ‘దేవీ భాగవతం’ కథలను పూర్తి చేసింది ఆయనే. పౌరాణిక సీరియల్ ‘విష్ణుకథ’ కూడా ఆయనే రాసారు. ఆయన రంగుల చిత్రాలు ఒక అద్భుత ప్రపంచాన్ని పాఠకుల మదిలో ఆవిష్కరించేవి. పౌరాణిక, జానపద ఘట్టాలకు రూపాలనిచ్చి, వాటికి జీవం పోసిన చిత్రబ్రహ్మ తన చిత్రాల ద్వారా ఎందరో అభిమానులను ‌సంపాదించుకున్నారు.


1940వ దశకంలో పిల్లల్ని ఆకట్టుకోవడానికి ఆయన ‘బాల’ పత్రికలో తమాషా అయిన బొమ్మలు ఎన్నో వేశారు. బొమ్మను మామూలుగా చూస్తే ఒక రూపం, తిరగవేసి చూస్తే మరొకరూపం కనిపించేవి. సాధారణంగా చిత్రకారులు మోడల్స్ లేదా వారి నమూనాలనో చూస్తూ చిత్రాలు గీస్తుంటారు. కాని పాపయ్య మాత్రం తన ఆలోచనల రూపాలనే చిత్రాలుగా చిత్రించేవారు. ఆయన ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన చిత్రాలే గీచారు. అసభ్యతకు తావులేకుండా అమలిన శృంగారం తన చిత్రాల్లో చూపించారు.

తన చిత్రాలతో తెలుగు సంస్కృతిని, ఇతిహాసాలు, పురాణాలు, కాలాలు, రాగాలు, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, పౌర్ణమిలు, కావ్యనాయకులు, పురాణ పురుషులు, పండుగలు, ఆచారవ్యవహారాల్ని తన కళాచాతుర్యంతో కమనీయ దృశ్యకావ్యాలుగా మలచి కళాభిమానుల్ని రంగుల లోకంలో విహరింపజేసిన మహోన్నత చిత్రకారుడు వడ్డాది పాపయ్య. ఆయన రంగుల మిశ్రమం ప్రత్యేకంగా ఉంటుంది. ఎప్పుడూ మనం చూసే రంగులే అయినా, ఆకర్షణగా ఉండేవి. ఆయన దేశవాళీ రంగులే వాడి పేరు పొందారు. పౌరాణిక చిత్రాలను నీటి రంగులతో చిత్రించేవారు. ప్రపంచంలో నక్షత్రాలకు సంబంధించిన చిత్రాలను గీసిన ఒకే ఒక చిత్రకారుడు పాపయ్య. 27 నక్షత్రాలకు చక్కని రూపు కల్పించడంతోపాటు వాటి లక్షణాలను అంతర్లీనంగా చాటి చెప్పారు. రామాయణం, భారతం, భాగవతం, హనుమాన్, శివపురాణం తదితర కథలకు తనదైన శైలిలో వర్ణ చిత్రాలు సహజ సుందరంగా చిత్రించారు. చిత్రకళా ప్రపంచంలో వపా చిత్రించని అంశం లేదంటే అతిశయోక్తికాదు.


ఆయన గీసిన చిత్రాల క్రింద ‘వ.పా.’ అనే పొడి అక్షారాల సంతకం పెట్టేవారు. వీరి బొమ్మలకు గల మరొక కుంచె గుర్తు ‘0|0’ అని ఉండడం. దీని గురించి ఆయన చెప్పిన భాష్యం – ‘‘గతం శూన్యం, వర్తమానం శూన్యం, భవిష్యత్తులో నిలుచున్నానని’’. అది ఆయన ‘లోగో’గా తన చిత్రాలలో ఉపయోగించేవారు. ఆయన ప్రపంచంలో ‘లోగో’ గలిగిన ఏకైక చిత్రకారుడు కావటం తెలుగువారికి గర్వకారణం.

వపా మిత్రుల బలవంతంపై ఖరగ్‌పూర్, శ్రీకాకుళంలలో చాలకాలం కింద చిత్రకళా ప్రదర్శనలు నిర్వహించారు. వారిని సత్కరించడానికి ఆంధ్రవిజ్ఞాన సమితి ‘సంక్రాంతి’ పర్వదినం పురస్కరించుకొని వపా చిత్రకళా ప్రదర్శన తొలిసారి నిర్వహించింది. ఈ సందర్భంగా అప్పటికప్పుడు ఇరవై వర్ణ చిత్రాలు సృష్టించి ప్రదర్శించారు.

చిత్రకారునిగా ఎంత గొప్పవారో, వ్యక్తిగా అంత నిరాడంబరంగా, ప్రచారార్భాటాలకు దూరంగా ఉండి ఇంట్లో కూడా ముభావంగా తన పని చేసుకునేవారు. వపా చిత్రాలు తెలిసినంతగా ఆయన జీవిత విశేషాలు ప్రజలకు తెలియవు. ఆ చిత్రకారుడిని గురించి సుంకర చలపతిరావు, సి.పి.బ్రౌన్ అకాడమీ వారి పుణ్యమా అని ఒక గ్రంథమే రాయడం, తెలుగుజాతి రత్నాలు పరంపరలో అది వెలువడటం– ఎంతో సంతోషదాయకమైన విషయం. వడ్డాది పాపయ్య శత వసంతాల ప్రత్యేక సంచిక ‘వపాకు వందనం’ 2021లో విశాఖపట్నం చిత్రకళా పరిషత్ వారు ఆవిష్కరించారు. గత ముప్పై సంవత్సరాలుగా విశాఖ నగరంలో చిత్రకళా పరిషత్ ఆధ్వర్యంలో పాపయ్య జయంతి, వర్ధంతి కార్యక్రమాలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయి.

తెలుగు చిత్రకళకు జాతీయస్థాయి కీర్తి తెచ్చిన అమర చిత్రకారుడు వడ్డాది పాపయ్య (వపా). ఆయన కాలధర్మం చెంది మూడు దశాబ్దాలు దాటినా, నేటికీ ఆయన కళాప్రతిభ మసకబారలేదు. ఎందరో ఔత్సాహికులకు ఆయన చిత్రాలు స్ఫూర్తినిస్తున్నాయి. భౌతికంగా వపా నేడు మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన వేలాది చిత్రకళారూపాలు మన హృదయాలలో ఎప్పటికీ సజీవంగా ఉంటాయి.

జి.కె. విశ్వనాధరాజు

(సౌభాగ్య గజపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశాఖ పబ్లిక్ లైబ్రరీలో

నేడు వపా జయంతి)

ఈ వార్తలు కూడా చదవండి..

యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్

ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం

For More AP News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 01:17 AM