పర్యాటకానికి మచ్చ
ABN , Publish Date - Jun 19 , 2025 | 04:27 AM
ఉత్తరాఖండ్‌లో ఆదివారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే నిలిపివేసిన సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి తిరిగి అనుమతించింది. సర్కారు సరేనని అన్నప్పటికీ, వాతావరణం అనుకూలంగా లేక ఒక్క హెలికాప్టర్ కూడా ఆ రోజు గాలిలోకి...
ఉత్తరాఖండ్‌లో ఆదివారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిన వెంటనే నిలిపివేసిన సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి తిరిగి అనుమతించింది. సర్కారు సరేనని అన్నప్పటికీ, వాతావరణం అనుకూలంగా లేక ఒక్క హెలికాప్టర్ కూడా ఆ రోజు గాలిలోకి లేవలేదని వార్తలు వచ్చాయి. ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీకీ, రాష్ట్ర ప్రభుత్వానికీ ఈ మార్గంలో నడిచే హెలికాప్టర్ల సమర్థతమీద ఇంతలోనే అంతనమ్మకం ఎలా కుదిరిందో తెలియదు కానీ, ఏడుగురి ప్రాణాలు తీసిన ఆ ఘోరదుర్ఘటన ఒక తీవ్రహెచ్చరిక. లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం నింగిలోకి లేచిన కొద్దిక్షణాల్లోనే భగ్గుమన్న ఆ భయానక ఘటన మనలను ఇంకా వెంటాడుతూండగానే, కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులను తీసుకువెడుతున్న ఈ హెలికాప్టర్ గౌరీకుండ్ అడవుల్లో కూలిపోయింది. మంటలురాజుకొని హెలికాప్టర్‌లో ఉన్నవారంతా మృతిచెందారు. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని అనుకుంటున్నప్పటికీ, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు జరిపి, కనీసం ప్రాథమికంగా ఓ అవగాహనకు వచ్చేవరకూ ఏదీ నిర్థారించలేం.
హెలికాప్టర్ సేవలను సత్వరమే తిరిగి ఆరంభించిన ఈ నిర్ణయం వెనుక ప్రైవేటు సర్వీసుల ఒత్తిడికూడా పనిచేసివుండవచ్చు. పదిహేనేళ్ళ అనుభవం గల పైలట్ చేతిలో ఉంటూకూడా ఈ హెలికాప్టర్ చిగురుటాకులాగా వొణికి, కట్టుతప్పి కూలింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి, హెలికాప్టర్‌ను పైలట్ సరిగా నియంత్రించలేకపోయారట. చార్‌ధామ్ యాత్ర ఆరంభమైన నెలన్నరలో ఈ తరహా ప్రమాదాలు ఐదు జరిగాయని మీడియా విశ్లేషిస్తోంది. మే 8న కూడా ఇటువంటి తీవ్రప్రమాదమే జరిగి ఆరుగురు ప్రయాణికులు మరణించారు. మూడు హెలికాప్టర్ ప్రమాదాల్లో అదృష్టవశాత్తూ ప్రాణనష్టం లేకున్నా మార్గమధ్యంలో ఇంజన్ విఫలమైనమాట నిజం. ఈ నేపథ్యంలో, ప్రతీప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించి కారణాలను అన్వేషించడం, తగిన పరిష్కారాలతో ముందుకు వెళ్లడం ముఖ్యం. దట్టమైన పొగమంచువల్ల ముందున్న కొండను ఢీకొని ఈ హెలికాప్టర్ కూలివుండవచ్చు. అయితే, కేదార్‌నాథ్‌లో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉదయం ఆరు దాటితే కానీ హెలికాప్టర్లు బయలుదేరకూడదన్న నియమం ఉన్నప్పటికీ, ఈ హెలికాప్టర్ 5.17 నిముషాలకే కుప్పకూలడాన్ని బట్టి చూస్తే ఆర్యన్ ఏవియేషన్ లిమిటెడ్ సంస్థ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని అర్థం. ఎత్తయిన కొండలు, లోయలతో కూడిన ఈ ప్రాంతంలో, వాతావరణం కూడా నిలకడగా ఉండని పరిస్థితుల్లో, కనీసం తెల్లారేవరకూ కూడా ప్రైవేటు సంస్థలు ఆగలేకపోతున్నాయి.
డబ్బుతప్ప వీటికి ప్రజల ప్రాణాలు పట్టడం లేదని, వీటిని నియంత్రించే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతున్నదని విమర్శకులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి హెలికాప్టర్ సంస్థలకోసం కఠినమైన నిబంధనావళిని తయారుచేయమన్నారు. సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేస్తామన్నారు. ఈ ప్రమాదఘటనను సూమోటోగా స్వీకరించిన ఉత్తరాఖండ్ హైకోర్టు సోమవారం ప్రభుత్వాన్ని ఉద్దేశించి చక్కని ప్రశ్నలు వేసింది, సరైన సూచనలు చేసింది. హిమాలయసానువుల్లో హెలికాప్టర్లు నడిపే పైలట్లకు ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తూండటం నుంచి, హెలికాప్టర్ల నిర్వహణ వరకూ అనేకం ఇందులో ఉన్నాయి. సర్వీసుల సంఖ్యను నిర్ణయించడం, నియంత్రించడం నుంచి ఉల్లంఘనకు పాల్పడిన సంస్థలను తీవ్రంగా శిక్షించడం వరకూ కోర్టు చాలా సూచనలు చేసింది. ఈ ఘోర ప్రమాదం తరువాతైనా ప్రభుత్వం తన మొహమాటాలు పక్కనబెట్టి గట్టిగా వ్యవహరించడం ముఖ్యం. కాలినడకన వెళ్ళలేనివారు, ఖర్చు భరించగలిగేవారు ఈ హెలికాప్టర్ సర్వీసుకు మొగ్గుచూపడం సహజం. సుదూరప్రాంతాలనుంచి సైతం సునాయాసంగా ఈ హెలికాప్టర్‌ను బుక్‌చేసుకోగలిగే మార్గాలూ పెరిగాయి. చార్‌ధామ్ యాత్రరద్దీకి అనుగుణంగా సర్వీసులు పెంచి, ఎక్కువ సొమ్ముచేసుకోవాలన్న తాపత్రయం ఈ ప్రైవేటు సంస్థలది. ఈ యాత్ర గురించి అధికవ్యయంతో విస్తృతప్రచారం చేస్తూ, మతపర్యాటకం నుంచి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ హెలికాప్టర్ సంస్థల వీరంగానికి అడ్డుకట్టవేయాలి. ఎంతో భక్తితో, అధికశ్రమకోర్చి నాలుగు ధామాలను దర్శించవస్తున్నవారి అభీష్ఠాన్ని నెరవేర్చి, క్షేమంగా వెనక్కుపంపే బాధ్యత ప్రభుత్వంమీద ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హీరో ఫిన్‌కార్ప్ రూ 260 కోట్ల సమీకరణ
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
For National News And Telugu News