Uttarakhand Destructive Development: ఉత్తరాఖండ్‌లో విధ్వంస వికాసం
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:43 AM
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో నవంబర్ 9న ఏర్పాటయింది. ఆ శుభ వేడుకలు ఇంకా పూర్తిగా ముగియకముందే ముస్సోరిలో ఒక ఉపన్యాసం వెలువరించేందుకు నాకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను. ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో...
ఉత్తరాఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో నవంబర్ 9న ఏర్పాటయింది. ఆ శుభ వేడుకలు ఇంకా పూర్తిగా ముగియకముందే ముస్సోరిలో ఒక ఉపన్యాసం వెలువరించేందుకు నాకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానాన్ని అంగీకరించాను. ఆ రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో ఒకటైన డెహ్రాడూన్‌లోనే నేను పుట్టి పెరగడమే అందుకొక కారణం. ముస్సోరికి వెళ్లిన తరువాత నా బసకు సమీపంలో ఉన్న ఒక పబ్లిక్ కాల్ బూత్ (అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు లేవు)కు వెళ్లి నైనిటాల్‌లో ఉండే చరిత్రకారుడు శేఖర్ పాఠక్‌కు ఫోన్ చేశాను. నా మిత్రుడు ఫోన్ ఎత్తగానే నేను ఇలా సగర్వంగా ప్రకటించాను: ‘మై అప్నే ప్రదేశ్ సె బోల్ రహా హూ’ (నేను నీతో మన రాష్ట్రం నుంచి మాట్లాడుతున్నాను).
ఇప్పుడు బెంగళూరులో స్థిరపడినప్పటికీ నేను యువకుడుగా ఎదిగిన, నా తొలి పరిశోధనను నిర్వహించిన ప్రదేశంతో నా ఆత్మీయ సంబంధాలను కొనసాగిస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌లోని పర్వత ప్రాంత జిల్లాలతో ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకై అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ ప్రజలు నిర్వహించిన ఉద్యమాన్ని మొదటి నుంచి చివరివరకు నేను ఆసక్తితో గమనించాను. తుదకు ఉత్తరాఖండ్ ఏర్పడినప్పుడు ‘దేవ భూమి’గా ప్రసిద్ధిగాంచిన ఆ హిమాలయ ప్రాంతాల ప్రజల జీవితాలలో కొత్త యుగోదయాన్ని ఆకాంక్షించాను.
1971లో హిమాచల్‌ప్రదేశ్ పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రభవించిన తరువాత ఆ రాష్ట్ర ప్రజలు గణనీయమైన సామాజిక, ఆర్థిక పురోగతి సాధించిన విధంగానే ఉత్తరాఖండ్ వాసులు తమ సొంత రాష్ట్రంలో సర్వతోముఖమైన ప్రగతి సాధించగలరని భావించాను. నా నమ్మకానికి కారణమేమిటి? ఆ కొత్త రాష్ట్రాన్ని పాలించే రాజకీయవేత్తలు తమ పాలితులతో ఉమ్మడి సాంస్కృతిక నేపథ్యమున్నవారే కాక, ప్రజల ఆశలు, అభిలాషలలో భాగస్వాములుగా ఉండడమే. మరో కొద్ది వారాలలో ఉత్తరాఖండ్ 25వ ఆవిర్భావ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నది. ఈ పాతికేళ్ల కాలంలో కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండగా భారతీయ జనతా పార్టీ పదిహేనేళ్లు పాలించింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రజతోత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు రెండూ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు చేసింది చాలా తక్కువ అనేది ఒక చేదు సత్యం. విద్యా వైద్య రంగాలను రెండు పార్టీల ప్రభుత్వాలూ ఒకే విధంగా నిర్లక్ష్యం చేశాయి. మహిళలకు రక్షణ కల్పించడంలోను, జీవనోపాధులకు భద్రత సమకూర్చడంలోనూ అన్ని ప్రభుత్వాలూ విఫలమయ్యాయి. 2017 నుంచి అధికారంలో ఉన్న బీజేపీ హిందూత్వ భావజాలాన్ని ప్రోత్సహిస్తోంది. మైనారిటీల పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. భయపూరిత వాతావరణాన్ని సృష్టించి మత సామరస్యానికి విఘాతం కలిగిస్తోంది.
ఇదిలావుండగా ఉత్తరాఖండ్‌లో అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వమూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ‘అభివృద్ధి’ పేరిట పర్యావరణ విధ్వంసానికి పాల్పడడం పరిపాటిగా ఉన్నది. కొండలు తొలిచివేస్తున్నారు. నాణ్యత లేని రోడ్లు నిర్మిస్తున్నారు. ఆలోచనారహితంగా భారీ డ్యాంల నిర్మాణానికి పూనుకుంటున్నారు. చార్ ధామ్ హైవే ఈ ప్రాజెక్టులలో అత్యంత ప్రమాదకరమైనది. ప్రజలు, పర్యావరణానికి ఈ ప్రాజెక్టు హానికరమైనదని నిరాకరించలేని శాస్త్రీయ సాక్ష్యాధారాలు నివేదించినప్పటికీ ఆ హైవే నిర్మాణాన్ని కొనసాగించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.
ఒక సాధికారిక అంచనా ప్రకారం 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకు హై వేలు, డ్యాంలు, గనులు, ప్రభుత్వ బస్తీలు మొదలైన ‘అభివృద్ధి ప్రాజెక్టుల’ పేరిట 50 వేల ఎకరాల సహజ అడవిని కోల్పోయింది. ఆ ‘అభివృద్ధి’ నుంచి ప్రజలు రవ్వంత కూడా లబ్ధి పొందలేదు. ఎంత తక్కువగా అంచనా వేసినా ప్రతి హెక్టారు సహజారణ్యంలో 3000 వృక్షాలు ఉంటాయి. హరించుకుపోయిన 50 వేల హెక్టార్లలో ఇంచుమించు 15 కోట్ల వృక్షాలు ఉండవచ్చు. ఉత్తరాఖండ్ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వమే ఆ వృక్ష సంపదను సంపూర్ణంగా నిర్మూలించింది. ఈ సహజ సంపద విధ్వంసకాండ ఆర్థిక, పర్యావరణ వ్యయాలు అగణితమైనవి.
హిమాలయాల పర్యావరణ వ్యవస్థ సున్నితమైనది. భూకంపాలు సంభవించే ప్రాంతంలో హిమాలయాలు ఉన్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పోషణకే కాకుండా నేల కోత, వరదల నుంచి రక్షణకు కూడా దట్టమైన అడవులు విలసిల్లడం చాలా అవసరం. హైవేలు, రైళ్ల మార్గాలను నిర్మించేందుకు కొండలు తొలిచి సొరంగాలు నిర్మిస్తున్నారు. సదరు కొండ ప్రాంతాలను కాంక్రీట్ నిర్మాణాలతో నింపివేస్తున్నారు. ఈ పర్యావరణ విరుద్ధ నిర్మాణాలతో వరుసగా అనేక ఘోర ప్రమాదాలు, విపత్తులు సంభవించాయి. ధరాళిలో చోటుచేసుకున్న దుర్ఘటన ఈ ప్రమాదాలలో చాలా ఇటీవలది. భూపాతాల కారణంగా చోటుచేసుకున్న మానవ మరణాలు, ఆస్తినష్టం లెక్కకు మించి జరిగింది. ఇటీవలి కాలంలో వరదలు తరచుగా సంభవిస్తున్నాయి. పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి ఇవి దారితీశాయి. జీవనాధారాలకు వాటిల్లిన నష్టం అపారమైనది. ఈ దుర్ఘటనలను పాలక పక్షాలు ‘ప్రాకృతిక విపత్తులు’గా పరిగణిస్తున్నాయి. నిజానికి అవి మానవుల విచక్షణారహిత కార్యకలాపాల మూలంగానే సంభవించాయి. రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై స్వప్రయోజనాలకై రోడ్ల విస్తరణ, డ్యాంల నిర్మాణాలు, రిసార్ట్స్ ఏర్పాటుకు ముందు వెనుకలు చూడకుండా అనుమతినిస్తున్నారు.
ప్రకృతి పరిరక్షణకు, సమాజశ్రేయస్సుకు తోడ్పడని ఈ ప్రాజెక్టులు తరచు విపత్తులకు దారితీస్తున్నా ఉత్తరాఖండ్‌ను పరిపాలిస్తున్నవారు లబ్ధి పొందుతున్నారు. డెహ్రాడూన్‌లో బిందాల్, రిస్పాన నదులపై తలపెట్టిన రెండు ఎలివేటెడ్ హైవే (నేలమట్టం లేదా నదీతలానికి పైన ఎత్తుగా నిర్మితమయ్యేవి)లనే తీసుకోండి. ఒక్కోటి పది కిలోమీటర్లకు పైగా పొడవు ఉంటుంది. ఏమిటి వీటి లక్ష్యం? అధికారికంగా చెప్పకపోయినప్పటికీ మైదాన ప్రాంతాల నుంచి డెహ్రాడూన్‌లోకి ప్రవేశించిన పర్యాటకుల వాహనాలు శీఘ్రగతిన ముస్సోరికి చేరేందుకు సౌలభ్యాన్ని కల్పించడమేనన్నది స్పష్టం. ఒక్కో ఎలివేటెడ్ హైవే నిర్మాణ అంచనా వ్యయం రూ.6000 కోట్లు. ఇది మరింతగా పెరుగుతుందనడంలో సందేహం లేదు. వీటి నిర్మాణానికి చట్టబద్ధంగా నిర్మాణమైన వేలాది గృహాలు, ఇతర కట్టడాలను కూల్చివేయవలసి ఉంటుంది. పెద్ద ఎత్తున నేల కోత సంభవిస్తుంది. వంతెనల స్తంభాలు సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల ఆకస్మిక వరదలు పెరిగిపోయే ప్రమాదమున్నది. వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎలివేటెడ్ హైవేల ప్రత్యక్ష లబ్ధిదారులు కాంట్రాక్టర్లు కాగా పరోక్ష లబ్ధిదారులు కార్ల ఉత్పత్తిదారులు, వాటి పంపిణీదారులు అని డెహ్రాడూన్ పౌరసమాజ బృందం ఒకటి విమర్శించింది.
ఈ హైవేల నిర్మాణాలకు బిందాల్, రిస్పాన నదుల నుంచి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్విపోయవలసి వుంటుందని, దీనివల్ల వరదల సంభవత పెరుగుతుందని డెహ్రాడూన్ నివాసి అయిన భారతి జైన్ అన్నారు. డెహ్రాడూన్ పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాల పెరుగుదలకు విశేషంగా తోడ్పడే ఈ నదులలో మట్టి తవ్వకాలు, జల ప్రవాహాలకు ఆటంకాల వల్ల వర్షాకాలంలో వరదలు, వేసవిలో కరువులు వస్తాయని ఆమె తెలిపారు. డెహ్రాడూన్ ప్రాంతం ఇప్పటికే భూగర్భ జలాల కొరత నెదుర్కొంటుందని, రిస్పాన–బిందాల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం వల్ల వాహనాల రాకపోకలకు సౌలభ్యం కలగవచ్చునేమో కానీ దానివల్ల జల భద్రత, పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేర్పడుతుందని ఆమె అన్నారు. తాత్కాలిక వెసులుబాటు లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలలో నొకదాన్ని డెహ్రాడూన్ పౌరులు ఎంచుకోవల్సిన సమయమాసన్నమయిందని భారతి జైన్ స్పష్టం చేశారు.
ఈ హైవేల నిర్మాణంపై డెహ్రాడూన్ పౌరులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇటీవల ఒక సర్వేలో వెల్లడయింది. వీటితో పాటు ఢిల్లీ–డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నారు. వీటివల్ల డెహ్రాడూన్ పౌరులకు సమకూరే తాత్కాలిక సామాజిక ప్రయోజనాలు స్వల్పం కాగా దీర్ఘకాలిక పర్యావరణ, సామాజిక నష్టాలు చాలా తీవ్రంగా ఉంటాయి. పర్యాటకులకు అవి ఏ విధంగా లబ్ధి కలిగిస్తాయి అన్నది తెలియదు. ఈ హైవేల నిర్మాణం పూర్తయితే ముస్సోరిలోకి ప్రతిరోజూ అదనంగా వేలాది చిన్నకార్లు, బస్సులు ప్రవేశిస్తాయి. ఈ పర్యాటకుల రద్దీని ఎలా తట్టుకుంటారు? అదనపు వాహనాల వెల్లువ సృష్టించే ట్రాఫిక్ జామ్‌లను ఎలా నివారిస్తారు? వాహనాలను తాత్కాలికంగా నిలపడానికి కొండ పక్కన పది అంతస్తుల పార్కింగ్ సదుపాయాన్ని నిర్మించేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పూనుకోనున్నదా?
ఉత్తరాఖండ్ విలక్షణ భౌగోళికత, చరిత్ర, సంస్కృతి గురించి మన కాలంలో మరెవ్వరికి కంటే సమగ్రంగా తెలిసిన శేఖర్ పాఠక్ తన విద్వత్ ప్రాజ్ఞతతో ఒక వివేకవంతమైన వ్యాఖ్య చేశారు: ‘ప్రాకృతిక జగత్తు, జన సమూహాల వైవిధ్య జీవన రీతులను గౌరవిస్తూ నిదానంగా, నిరాడంబరంగా జరిగే పుణ్యక్షేత్రాల సందర్శన యాత్రలా పర్యాటకాన్ని రూపొందించుకోవల్సి ఉండగా ప్రకృతి, ప్రజలకు విధ్వంసాన్ని కాలుష్యాన్ని మిగిల్చే ఆర్భాటపూరిత పర్యాటకంలా తీర్థయాత్రలను తీర్చిదిద్దాలని ప్రభుత్వాలు ఆకాంక్షిస్తున్నాయి’ అని పవిత్ర క్షేత్రాల సందర్శనలా పర్యాటక రంగాన్ని పునః రూపకల్పన చేయడమనేది ఉత్తరాఖండ్‌ను ప్రస్తుతం పరిపాలిస్తున్న రాజకీయవేత్తల, అధికారుల ప్రధాన ప్రాధాన్యత అవ్వాలి. మరింత మెరుగైన, అందరికీ అందుబాటులో ఉండే పాఠశాలల, ఆసుపత్రుల నిర్వహణ, తద్వారా ఆ హిమాలయ రాష్ట్ర ప్రజలకు సుస్థిర ఆర్థిక భవిష్యత్తును సమకూర్చడం ఉత్తరాఖండ్ పాలకులకు రెండవ, బహుశా మరింత ముఖ్యమైన ప్రాథమ్యం కావాలి. ఉత్తరాఖండ్ ఆవిర్భావానికి ప్రేరణ అయిన ఉదాత్త ఆకాంక్షలు, సమున్నత లక్ష్యాలు ఇప్పటికీ చాలా స్వల్పంగా మాత్రమే నెరవేరాయి. వాటిని సంపూర్ణంగా సాకారం చేయవలసిన బాధ్యత ఉత్తరాఖండ్ ప్రస్తుత, భావి పరిపాలకులపై ఉన్నది.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవి కూడా చదవండి
మరో స్కామ్ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి