Unified University Act: ఉన్నత విద్యకు దిక్సూచి ఏకీకృత చట్టం
ABN , Publish Date - Dec 12 , 2025 | 03:31 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యారంగం ఆర్థిక, పరిపాలనా ప్రతికూలతలు, నిర్మాణాత్మక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిసమానంగా తనను తాను...
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యారంగం ఆర్థిక, పరిపాలనా ప్రతికూలతలు, నిర్మాణాత్మక అడ్డంకులు ఎదుర్కొంటున్నప్పటికీ, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిసమానంగా తనను తాను మార్చుకుంటూ ముందుకు సాగుతున్నది. కోర్సుల రూపకల్పనలో ఆధునికత, సిలబస్ పునర్‌వ్యవస్థీకరణ, బోధన–అధ్యయన విధానాల్లో నవీనత, పరిశోధన–అభివృద్ధికి ప్రాధాన్యం, ఇన్నోవేషన్–స్టార్టప్–ఎంటర్‌ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ బలోపేతం వంటి రంగాల్లో గత కొన్నేళ్లలో జరిగిన సంస్కరణలు ఈ మార్పును స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ రూపొందిస్తున్న ‘ఏకీకృత విశ్వవిద్యాలయాల చట్టం’ ఉన్నత విద్యా పరిపాలనలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించే కీలక ప్రయత్నంగా కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూలు, ఉర్దూ విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, క్లస్టర్ విశ్వవిద్యాలయాలు వంటి అనేక సంస్థలు తమ ప్రత్యేక చట్టాల కింద పనిచేస్తున్నాయి. మరొకవైపు, సంప్రదాయ విశ్వవిద్యాలయాలకు మాత్రం ఒకే చట్టం వర్తిస్తున్నది. ఈ విభిన్న శాసన నిర్మాణం కారణంగా పరిపాలనలో అసమన్వయం, అకడెమిక్ ప్రమాణాల్లో భిన్నత్వం, నియామకాలలో అస్పష్టత, ఆర్థిక నిర్వహణలో అసమానత వంటి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని సరిచేయడానికి, ఏకరీతిచేసే శాసన చట్రం ఏర్పాటు చేసి, అన్ని వర్సిటీలను ఒకే దారిలో నడిపించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
2020లో దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ‘జాతీయ విద్యా విధానం’ ఉన్నత విద్యా వ్యవస్థలో మూలగామి మార్పులకు బాట వేసింది. మల్టీ–డిసిప్లినరీ విద్య విస్తరణ, అకడెమిక్ స్వతంత్రత, నాణ్యతా ప్రమాణాల ఏకరీతీకరణ, HEI క్లస్టర్ల ఏర్పాటు, పరిశోధన–ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం వంటి అంశాలు ఈ విధానం యొక్క ప్రధాన స్తంభాలు. త్వరలో అమల్లోకి రానున్న ఉన్నత విద్యా కమిషన్ ఆఫ్ ఇండియా (HECI) ద్వారా దేశవ్యాప్త ఉన్నత విద్యా పరిపాలన మరింత సమీకృతం, ప్రమాణీకృతం కానుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రూపొందిస్తున్న ఏకీకృత విశ్వవిద్యాలయాల చట్టం, జాతీయ విధానాల దిశగా రాష్ట్ర ఉన్నత విద్యా నిర్మాణాన్ని అనుసంధానించే ఒక ముందడుగుగా నిలుస్తోంది.
యూనిఫైడ్ యూనివర్సిటీ యాక్ట్‌ను అమల్లోకి తెచ్చిన రాష్ట్రాల అనుభవాలు సమగ్ర ఉన్నత విద్యా సంస్కరణలకు దారితీయగలవన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఈ చట్టాన్ని ముందుగా అమలు చేసి అనేక సానుకూల ఫలితాలు సాధించాయి. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలు, అమలు విధానాలు ఆంధ్రప్రదేశ్‌కు మార్గనిర్దేశం చేసే నమూనాగా ఉపయోగపడే అవకాశం ఉంది.
విశ్వవిద్యాలయాల ప్రధాన పరిపాలనా సంస్థ అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (EC) స్థానంలో, ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ (BoM) ఏర్పాటు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఈ బీఓఎమ్, విశ్వవిద్యాలయాల కీలక నిర్ణయాధికార సంస్థగా, పాలసీ రూపకల్పన కేంద్రంగా, కార్యనిర్వాహక మండలిగా వ్యవహరించనుంది. ఇందులో ఉపకులపతి అధ్యక్షుడిగా ఉంటారు. దీంతోపాటు అన్ని విశ్వవిద్యాలయాలు అనుసరించాల్సిన ఒక ‘మోడల్ స్టాట్యూట్’ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అవకాశం ఉంది.
ప్రతిపాదిత చట్టంలో సర్వీసు కోడ్ అత్యంత కీలక అంశంగా నిలవనుంది. నియామకాలు, జీతభత్యాలు, పదోన్నతులు, పదవీ విరమణ, సేవా నిబంధనలు, ప్రవర్తనా నియమావళి, శిక్షా ప్రక్రియ వంటి అంశాలన్నింటికీ ఒకే విధమైన సర్వీసు కోడ్ రూపొందించే అవకాశం ఉంది. దీనివల్ల వర్సిటీల మధ్య ఉన్న అసమానతలు తొలగి, ఉద్యోగులలో న్యాయం, సమానత్వం, పారదర్శకత పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్త చట్టం పరిధిలోకి వచ్చే విశ్వవిద్యాలయాల్లో కులపతిగా రాష్ట్ర గవర్నర్ కొనసాగుతారనే స్పష్టత కనిపిస్తోంది. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయంలో సీఎం కులపతిగా ఉండే ఏర్పాటు కూడా మారే అవకాశం ఉంది. ‘ఏకీకృత విశ్వవిద్యాలయాల చట్టం’ను సమతుల దృష్టితో, సమర్థవంతంగా అమలు చేయగలిగితే, ఉన్నత విద్యా ప్రమాణాల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండే అవకాశం ఉంది.
ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు
కృష్ణా విశ్వవిద్యాలయం
ఈ వార్తలు కూడా చదవండి..
సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..
మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు
Read Latest AP News and National News