Private Healthcare Crisis: ప్రైవేటు వైద్యంపై నియంత్రణ ఏది
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:11 AM
మెరుగైన వైద్యం ప్రజల హక్కు. దీనిని ప్రజలకు అందించే బాధ్యత ప్రభుత్వాలది. కానీ దేశంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 35 శాతం మందికి, దళిత–గిరిజనులకు...
మెరుగైన వైద్యం ప్రజల హక్కు. దీనిని ప్రజలకు అందించే బాధ్యత ప్రభుత్వాలది. కానీ దేశంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 35 శాతం మందికి, దళిత–గిరిజనులకు 47 శాతం మందికి వైద్య ఆరోగ్య, సేవలు అందుబాటులో లేవని ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 80 శాతం పైగా స్పెషలిస్టులు, అవసరమైన పరికరాలు, సదుపాయాలు, మందులు అందుబాటులో లేవనేది అనేక సర్వేల్లో వెల్లడైంది. సీజన్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వందలాదిమందికి వైద్య సేవలు అందించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిని పర్యవేక్షించే నాథుడే లేడు. ప్రభుత్వ వైద్యుల స్పందన, హెల్త్ కేర్ ప్రజలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లి, రోగులు ప్రైవేటు బాట పడుతున్నారు.
అన్ని రంగాల్లో మార్కెట్ శక్తుల ప్రాబల్యం పెరిగినట్లుగానే, వైద్యరంగంలో కూడా మార్కెట్ శక్తులు ప్రవేశించాయి. దీనివల్ల వైద్యుడు–రోగి సంబంధం పోయి, వైద్యం ఒక సరుకుగా మారింది. వైద్య రంగానికి సంబంధం లేనివారు కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులను నెలకొల్పుతున్నారు. వీటిలో లాభాపేక్ష తప్ప, సేవాభావం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉదంతం ఇందుకు సజీవ సాక్ష్యం. ఈ సంతాన సౌఫల్య కేంద్రం పిల్లలు లేని జంటల కోరికపై ఏ స్థాయిలో వ్యాపారం చేసిందో, ఎంత అనైతిక పద్ధతులను పాటించిందో విదితమే.
80 శాతం ప్రజలు వైద్య సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెడుతున్నారు. ఇవి రోగం స్థితి, రోగుల అనుమానాలు–భయాలను క్యాష్ చేసుకుంటున్నాయి. ఆస్పత్రుల్లో చేరిన రోగికి బంధువులకు మనోధైర్యాన్ని ఇచ్చే బదులు, మానసిక ఒత్తిడి పెంచి వారి నుంచి డబ్బు పిండుకుంటున్నారు. రోగనిర్ధారణ చేయవలసిన ల్యాబ్‌లు, డాక్టర్ అడిగినట్లుగా రిపోర్ట్స్ తయారు చేస్తున్నాయి. రోగ నిర్ధారణకు చేయాల్సిన టెస్టుల స్థానంలో రోగి నుంచి బిల్లు వసూలు చేసే లక్ష్యంగా అనవసరపు టెస్టులు చేస్తున్నారు. మాస్టర్ చెకప్‌ల పేరిట కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న ప్రచారానికి మధ్యతరగతి ప్రజలు బాగా ఆకర్షితులవుతున్నారు.
పేషెంటుకున్న వ్యాధిపై పోరాడే సందర్భంలో డాక్టర్ ప్రధాన వనరు ఔషధాలే. ఈ ఔషధాలపై డాక్టర్లదే నిర్ణయాధికారం. దీంతో వీరికి పార్టీలు, టూర్స్, ఖరీదైన గిఫ్టులు, సెమినార్స్ వంటివి ఎరవేసి సేవకులుగా మార్చుకుంటున్నాయి ఫార్మా కంపెనీలు. అందుకే డాక్టర్ రాసిన మందులు అనుబంధ ఫార్మసీలో తప్ప బయట ఎక్కడా దొరకవు. వారి ఆదాయాల కోసం అవసరం లేని మందులను కూడా రోగితో తినిపిస్తున్నారు. దీంతో రోగుల ఆరోగ్యం ప్రమాదకరమైన స్థితిలోకి చేరుతోంది.
తెలుగు రాష్ట్రాలలో 40–50 సంవత్సరాల మధ్య గల మహిళల్లో ఎక్కువ మందికి గర్భసంచిలు లేవనేది సత్యమే. గర్భసంచికి ఏ చిన్న సమస్య వచ్చినా క్యాన్సర్ పేరిట భయాలు నెలకొల్పి ఆపరేషన్లు చేసి వాటిని తీసేస్తున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గర్భిణీలకు నార్మల్ డెలివరీ చేయాలి. కానీ అనేక మంది గైనకాలజిస్టులు అధిక ఫీజుల కోసం తమ వద్ద చేరిన పేషెంట్లలో 90 శాతానికి పైగా సర్జరీలు చేసే బిడ్డల్ని తీస్తున్నారు. జిల్లాలో ఏ ఆస్పత్రిలో ఎంతమంది మహిళలకు సర్జరీలు జరిగాయో డేటా డీఎంహెచ్ఓ వద్ద ఉన్నా కూడా కనీసం వారిని ప్రశ్నించడం లేదు. అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా రకరకాల భయాలు పెంచి, వారాల తరబడి బాక్సుల్లో పెట్టి డబ్బు దండుకుంటున్నారు. ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలి. కానీ ప్రదర్శించరు.
వైద్య రంగంలో కమిషన్ల కక్కుర్తి విపరీతంగా పెరిగిపోయింది. లోకల్ ప్రాక్టీషనర్, అంబులెన్స్ డ్రైవర్, ఆటో డ్రైవర్, ఆస్పత్రి సిబ్బంది ఇలా అందరికీ పేషెంట్ చెల్లిస్తున్న అన్ని రకాల బిల్లుల నుంచి 30 నుంచి 40శాతం కమిషన్లు పంపుతున్నారు. కమిషన్ ఇవ్వని డాక్టర్లు ఆస్పత్రి మూత వేసుకోవడమే. ఈ కమిషన్ల దందాని అడ్డుకోకపోతే రోగులు మరింత నష్టపోయే ప్రమాదం ఉంది. నైతిక విలువలు కలిగిన వైద్యులు, విలువలతో క్లినిక్ నడిపే పరిస్థితి లేదు. నైతిక విలువలను కాపాడే డాక్టర్లు ఈ రంగం నుంచి వెళ్ళిపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.
ప్రైవేటు వైద్యం వల్ల ఏటా ఆరు కోట్ల మంది పేదరికంలోకి జారిపోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. ఈ దోపిడీని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, ఓట్లు తెచ్చిపెట్టే నాలుగు పథకాలని ఆర్భాటంగా ప్రచారం చేసి పాలన కొనసాగించడం తప్ప. అందరికీ నాణ్యమైన, సమానమైన, పారదర్శకమైన విద్య, వైద్యాన్ని అందించే బాధ్యతకు హామీ పడటం లేదు. మానవత్వానికి, సేవకు మారుపేరైన ఈ వృత్తిలో ప్రస్తుతానికి అది లేదు. వైద్యులలో స్వీయ నియంత్రణ కరువవుతోంది. అవకతవకలను సరి చేయవలసిన యంత్రాంగం లేదు. ఈ అక్రమాలపై పాలకులు దృష్టి సారించి, పరిస్థితిని చక్కదిద్దాలి. ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేసి ప్రైవేట్ వైద్యాన్ని నియంత్రించి, వైద్య రంగంలో జరుగుతున్న దోపిడీని సమూలంగా మార్పు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అందుకు పాలకులపై పౌర సమాజం ఒత్తిడిని పెంచాలి.
ఆవుల అశోక్
సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకులు
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News