Share News

స్త్రీని మించిన ఇతివృత్తం లేదు

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:45 AM

తెలుగులో ఉత్తరాంధ్ర సాహిత్యానికి ప్రత్యేకమైన విభిన్నత ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళికతకు, జీవన విధానానికి కొంత సంఘర్షణ ఎక్కువ. ఆ సంఘర్షణను, ఆర్తిని కవితా వాహికగా....

స్త్రీని మించిన ఇతివృత్తం లేదు

తెలుగులో ఉత్తరాంధ్ర సాహిత్యానికి ప్రత్యేకమైన విభిన్నత ఉంటుంది. ఈ ప్రాంత భౌగోళికతకు, జీవన విధానానికి కొంత సంఘర్షణ ఎక్కువ. ఆ సంఘర్షణను, ఆర్తిని కవితా వాహికగా నిబద్ధతతో వెల్లడిస్తున్న రచయితల్లో సాంబమూర్తి లండ ఒకరు. కవిత్వం పట్ల ఆయన దృక్పథాన్ని, జీవితాన్ని యుద్ధానికి ఉపమానంగా వాడడం వెనుక ఉన్న భావనని ఆయన మాటల్లోనే తెలుసుకొందాం.

మీ కుటుంబ నేపథ్యం గురించి, సాహిత్య ప్రేరణల గురించి చెప్పండి?

నిజానికి మేం సముద్రం పిల్లలం (మత్స్యకార సామాజిక వర్గం). కానీ, నాన్నకు ముందు మూడు తరాలుగా మట్టితో అనుబంధం పెంచుకున్న దిగువ మధ్యతరగతి కుటుంబం. మార్క్స్‌ను చదివిన పోతన నాన్న. అప్పట్లో మాది రెండున్నర ఎకరాల జీడిమామిడి, కొబ్బరి, పనస, మునగ తోటల ఉద్యానవనం. టీచర్‌గా ఉద్యోగం వచ్చినా ఎమ్మెస్సీ చదువుకుంటానంటే కాదనలేనంత ఇష్టం నాన్నకు చదువు మీద.

బాల్యంలో లాంతరు వెలుగుల మధ్య నాన్న చదివి వినిపించిన కాల్పనిక సాహిత్యం నాలో అక్షరాల్ని విత్తాయి. ఆ విత్తనాలు ఉత్తరాంధ్ర బతుకు విధ్వంస ప్రతిఘటనకు దారి చూపాయి. అమ్మ మిగిల్చిపోయిన ఖాళీ తక్షణం నన్ను అక్షరంగా మలిచింది. ‘గాజు రెక్కల తూనీగ’, ‘నాలుగు రెక్కల పిట్ట’, ‘ఆమెకు మిగలని ఆమె’ కవితా సంపుటాలుగా ఇప్పటికి మూడు ఆకులు తొడిగాను. పగళ్లు స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతూ... రాత్రులు కళ్ళల్లో దివిటీలు వెలిగించుకుని నన్ను నేను వాక్యాలుగా అనువదించుకోవడం మొదలై ఎనిమిదేళ్ళు.


కవిత్వాన్ని మీరు ఎలా నిర్వచించుకుంటారు?

నది ఇంకిన చోట ఒక తడి మేఘపు వాగ్దానం కవిత్వం. జడత్వం నిండిన కాలం ముఖం మీద నీళ్ళు కుమ్మరించి మేల్కొలిపే బాధ్యత. భయంతో నాలుకలన్నీ పిడచగట్టుకు పోయినపుడు నిశ్శబ్దాన్ని చీల్చుకుని మొలకెత్తే చైతన్యపు విత్తు. కవిత్వమంటే అదృశ్య సముద్రం మీద వేట. కనబడని అరణ్యంలో కావాలనే తప్పిపోయి, భుజానికి ఒక వాక్యాన్ని తగిలించుకుని ఇల్లు చేరడం.

.మీ కవిత్వ శీర్షికలలో ఎక్కువగా ‘రెక్కల’ ప్రస్తావన ఎక్కువ ఉంటుంది, ఎందుకు?

బాల్యంలో ఇంటికీ బడికీ ఇంచుమించు కిలోమీటర్ దూరం. పదోతరగతి వరకూ కాళ్ళు దిగబడే ఇసుకదారిలో రోజుకు నాలుగుసార్లు నడవాల్సి వచ్చేది. అప్పుడంతా చేతుల్ని రెక్కల్లా ఊపుకుంటూ ఎగురుతున్నట్టు కలలొచ్చేవి. రెక్కలమీద ప్రేమ అలా మొదలైందేమో. రెక్కలు అన్నవి నా బాల్యం నాకిచ్చిన శైలీ ముద్ర అనుకోవచ్చేమో మరి.


మీ రచనల్లో జీవితం మీద యుద్ధం చెయ్యాలనే స్ఫూర్తి ఎక్కువగా కనపడటానికి కారణం మీరు టీచర్‌ కావటం అనుకోవచ్చా?

ఇప్పుడున్నదంతా సంక్షుభిత కాలం. వచ్చేది ఎడతెగని విధ్వంస రుతువు. మనుషుల మధ్య అనుబంధాలను చంపేస్తున్న గ్లోబలైజేషన్, వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకు వచ్చిన సోషల్ మీడియా, అన్నింటా పెరిగిన వేగం... వంటి అనూహ్యతల వల్ల మనిషి సహజ సున్నితత్వాన్ని కోల్పోయి అతి సున్నితత్వానికి చేరుకొంటున్నాడు. ఇది సున్నితత్వం లేకపోవడం కంటే ప్రమాదం. అటువంట ప్పుడు ఎవరైనా యుద్ధాన్నే బోధించాలి. తెలంగాణాలో ఇంటర్ పిల్లల ఆత్యహత్యల నేపథ్యంలో ‘ఇంకొంచెం యుద్ధాన్ని ప్రేమించు’, చిన్నవిషయాలకే కలత చెందే నేటి అమ్మాయిలకు ‘యుద్ధం నాకు కొత్తకాదు’ వంటి కవితలు రాశాను. దీని వెనుక నాలోని టీచర్ కంటే మానసిక సన్నద్ధత కోసం అక్షరాల్ని వాడే రచయిత ప్రభావమే ఎక్కువ ఉందనుకొంటాను.

మీ మూడో కవితా సంపుటిగా వెలువరించిన ‘ఆమెకు మిగలని ఆమె’ గురించి చెప్పండి?

పొద్దున లేచిన్నుంచీ తిరిగి కళ్ళు మూతలు పడే దాకా ఎందరో స్త్రీలు కనుపాపల మీదుగా నడిచిపోతుంటారు. ఊరికే నడిచిపోరు. కనుపాపల మీద లోతైన గాయాలను మిగిల్చిపోతారు. అనేకానేక స్త్రీల ఒకానొక ప్రతిఫలనం ‘ఆమెకు మిగలని ఆమె’. జీవితంలో ఇప్పటివరకూ నాకు తారసపడిన ప్రతి నీడకూ అక్షరాలతో బొమ్మ కట్టాలని చూసాను.


ఈ కవితా సంపుటి మొత్తం స్త్రీ కేంద్రంగా రాయడానికి కారణం?

ఏ స్థల కాలమాన పరిస్థితుల్లోనైనా ఆమె బాధిత. గాయాలతో అవ మానాలతో అనుమానాలతో సంకెళ్ళతో వున్న ఆమె రూపం ప్రతిసారీ గుండెను ఛిద్రం చేస్తూనే వుంటుంది. ఎప్పుడూ ఆమెను ఓడించాలని చూసే ప్రపంచాన్ని ఎలా ఇష్టపడతాను? వాక్యాల్ని పట్టుకుని ఎదురు నిలబడ్డాను. ఆమె విషయంలో జరుగుతున్నదంతా అన్యాయమేనని చేస్తున్నదంతా నమ్మకద్రోహమేనని చెప్పాలనుకున్నాను.

జీవితంలో తారసపడ్డ స్త్రీలు నన్ను మరింత సున్నితంగా మార్చకపోతే బహుశా ఈ ప్రత్యేక సంపుటి లేదు. సమాజంలో ఇప్పటికీ ఆమె ద్వితీయ శ్రేణి పౌరురాలిగానే పరిగణించబడడాన్ని జీర్ణించుకోలేను. మొగ్గల నుండి రేపో మాపో రాలిపోయే పువ్వుల దాకా జరుగుతున్న లైంగికదాడులు, అత్యాచార పర్వాలు, నగ్న ఊరేగింపులు సిగ్గుతో తలదించుకునేలా చేస్తాయి. సమాజంలో ఉన్న ద్వంద్వ ప్రమాణాలు నిర్ఘాంతపరుస్తాయి. స్త్రీని దేవతను చేసి కూర్చోబెట్టి రాజ్యాలను ఏలుకునే కుట్రలను బద్దలు కొట్టాలనిపిస్తుంది. కవిత్వంలో ఓల్గా, కొండేపూడి నిర్మల, మహెజబీన్‌ల నుండి అందుకున్న ప్రేరణ వుంది. స్త్రీకి మించిన విశాల ఇతివృత్తం లేదు.


ఉత్తరాంధ్ర కవిత్వ నేపథ్యంలో మీ కవిత్వాన్ని ఎలా చూస్తారు?

నా ముందూ నా తర్వాతా సాగే యుద్ధానికి మధ్యలో కొనసాగింపు కావాలి నేను. పదే పదే కట్లు తెంపుకుని చేను మీద పడుతున్న పశువుల మందతో ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది. బతుకుల్ని చెరిపేయ డానికి ఒక తుఫాను ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తూనే వుంటుంది. తీరంలో ప్రమాద హెచ్చరికలా నిలబడాలి. ఆ దిశగానే సాగుతున్నాను. ఈ ప్రయా ణంలో ఒంటరిని కాదు. మా ముందుతరం దీపధారై నడుస్తోంది. ప్రతిభ, అధ్యయనం, సొంత గొంతూ వున్న వర్తమానతరం వారసత్వాన్ని రెండు చేతులతో అందుకుంది. ఉత్తరాంధ్ర కథకులు, కవులలో ప్రక్రియ, శైలీ, శిల్పం వేరు వేరు కావచ్చు. కానీ వారు చిత్రించే కళింగాంధ్ర సాహితీ ఆత్మ మాత్రం ఒక్కటే. ఈ నేలలో పుట్టిన ఏ కవీ కథకుడూ నిద్రపోవడానికి లేదు. నిరంతరం మెలకువగానే ఉండాలి.

ఇంటర్వ్యూ : సారిపల్లి నాగరాజు,

బి. మదన మోహన్ రెడ్డి

80083 70326


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 06:45 AM