తొందరపడి ముందే కూసిన కోయిలని!
ABN , Publish Date - Jan 27 , 2025 | 01:18 AM
మా నాన్న గారిని సాహిత్యమంటే బాగా పిచ్చి. చిన్నప్పటి నుంచీ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పుస్తకాలు చదివించే వారు. సాహిత్య సభలకు తీసుకు వెళ్ళేవారు. అలా సాహిత్య మంటే నాకూ అభిరుచి కలిగింది....
మందరపు హైమవతి
మా నాన్న గారిని సాహిత్యమంటే బాగా పిచ్చి. చిన్నప్పటి నుంచీ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పుస్తకాలు చదివించే వారు. సాహిత్య సభలకు తీసుకు వెళ్ళేవారు. అలా సాహిత్య మంటే నాకూ అభిరుచి కలిగింది. నా పన్నెండవ ఏట నుంచీ కవిత్వం రాయడం మొదలుపెట్టాను. అప్పుడు పువ్వు విరిసినా, పక్షి ఎగిరినా, వెన్నెల కురిసినా ప్రతిదాన్నీ కవిత్వీకరించేదాన్ని. కవితా సంపుటాలను చదివినప్పుడల్లా నా కవితలను కూడా పుస్తక రూపంలో చూసుకోవాలని కోరికగా వుండేది. పెద్దలు ఇప్పుడే వద్దు అన్నారు కానీ ఒక విధమైన బాల్య చాపల్యంతో పుస్తకం తీసుకు వచ్చేదాకా ఊరుకోలేదు. అలా తొందరపడి ముందే కూసిన కోయిలలా వచ్చిన పుస్తకమే ‘సూర్యుడు తప్పి పోయాడు’, నా మొదటి కవితా సంపుటి. దీనిలో నేను మొదట రాసిన కవితలు కూడా ఉన్నాయి. 32 కవితల ఈ సంపుటి 1982 డిసెంబర్‌లో వచ్చింది.
అభ్యుదయ దృక్పథంతో రాసిన ఈ పుస్తకానికి ఆరుద్ర ముందుమాట రాసారు. స్పందన సాహితీ సమాఖ్య తరఫున గుత్తికొండ సుబ్బారావు పుస్తకం ప్రచురించారు. కవితలు రాయడం తప్ప ముద్రణ గురించి నాకేమీ తెలీదు. డా. జి.వి. పూర్ణచంద్ ప్రచురణ బాధ్యత తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పుస్తక ప్రచురణ కోసం రూ.900 ఆర్థిక సహాయం చేసింది. బాలి కవర్ పేజీ వేశారు.
ఈ సంపుటిలో మొదటి కవిత ‘సూర్యుడు తప్పి పోయాడు’. ‘‘చైతన్య మాత పెద్ద కుమారుడు/ మానవత ఇంటిపేరు గల వాడు/ అభ్యుదయ సూర్యుడు తప్పిపోయాడు’’ అని ఈ దేశంలో అభ్యుదయం లేదనే అభిప్రాయంతో ఈ కవిత కొనసాగుతుంది. ‘ఉదయిస్తాడు సూర్యుడు’ అనే కవితతో సంపుటి ముగుస్తుంది.
1980లలో స్త్రీ వాద కవిత్వం మొదలైనా ఈ సంపుటిలో ఆ ఛాయలేమీ కనపడవు. ‘అపుత్రస్యగతిర్నాస్తి’ కవిత మాత్రం ఒక ముసలి తల్లి వేదన. కొడుక్కి దూరంగా పల్లెటూళ్లో వున్న ఒక ఒంటరి తల్లి కథ. ‘‘ఆ రోజు మబ్బులు ముసిరి/ మసకబారి పోయే జాబిలి/ సురభిళ రమ్యం యౌవన సుమం/ వాడకముందే వీడిపోగా పతి/ సుఖాల ఆతపత్రఛ్ఛాయలనమర్చిన/ కరుణామహితవల్లి ఆమె/ మాతృదేవోభవ అని తల్లికి పూజ్యస్థానం ఇస్తూ ముసలితనం ముసిరినాక విసిరి కొట్టు వీరు... ఏ మహోన్నత సంస్కృతికి వారసులు/ ఏ ప్రాచీన నాగరికతకు ప్రతీకలు’’ అని ప్రశ్నిస్తూ కొడుకుల నిరాదరణకు గురైన అభాగ్య మాతృమూర్తుల దీనస్థితిని చిత్రించిన కవిత ఇది. ముందు మాటలో ఆరుద్ర ఈ కవితను ప్రస్తావిస్తూ కేవలం ఆడపిల్ల మాత్రమే రాయగలిగిన కవిత అని అన్నారు. ఈ పుస్తకాన్ని డా. బెజవాడ గోపాలరెడ్డి ఆవిష్కరించారు. సంజీవదేవ్ సభకు అధ్యక్షత వహించారు. ఎం.ఎ. మూర్తి మాట్లాడారు. పిల్లలు నడిచేటప్పుడు తప్పటడుగులు వేస్తారు. పడుతూ లేస్తూ నడక నేర్చుకొంటారు. నా తొలి సంపుటి కూడా ఇలాంటిదే. ‘‘మేఘమాలికల స్వాప్నిక గగన విహారమిక చాలించుము/ అఱ్ఱు సాచి పైకి చూచే చూపులనిక భూమిపైన సారించుము’’ అని కొన్ని చోట్ల గ్రాంథిక భాషా వాసన కనిపిస్తుంది.
నా కవితలను పుస్తక రూపంలో రావాలనుకొన్న కోరిక నెరవేరి పుస్తకం చేతిలోకి వచ్చాక ఆనందంతో ఎగిరి గంతేసి నట్లు అనిపించింది. నా తొలి పుస్తకాన్ని నా తల్లిదండ్రులు మందరపు దుర్గాంబ, మందరపు కాసులు గారికి అంకితమి చ్చాను. అప్పుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ ఎడిటర్‌గా ఆంధ్ర జ్యోతి వీక్లీ వచ్చేది. ఆ వీక్లీలో పని చేస్తున్న అఫ్సర్ నా పుస్తకం మీద రివ్యూ రాసారు. 1985లో ఈ పుస్తకానికి కృష్ణశాస్త్రి అవార్డు వచ్చింది. ఆ తర్వాత 2004లో నా రెండవ కవితా సంపుటి ‘నిషిద్ధాక్షరి’ వచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి
CM Revanth Reddy: మమ్మల్ని అవమానిస్తారా.. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం..
Read Latest Telangana News and Telugu News