Share News

The Silent Witness of Walls: నీలి గోడల వెలుతురు నీడ

ABN , Publish Date - Aug 25 , 2025 | 12:48 AM

మీరెప్పుడైనా గమనించారా ఖాళీ చేసిన ఇంటి గోడలు మాట్లాడుకోవటం క్రీస్తులా గుండెల్లో దిగేసిన మేకుల బాధలతో మనుషుల జ్ఞాపకాల ఊసులు మోసిన భావాలతో మౌనగళాలు విప్పి నిశ్శబ్ద భాషలో చర్చించుకోవటం...

The Silent Witness of Walls: నీలి గోడల వెలుతురు నీడ

మీరెప్పుడైనా గమనించారా ఖాళీ చేసిన ఇంటి గోడలు మాట్లాడుకోవటం క్రీస్తులా గుండెల్లో దిగేసిన మేకుల బాధలతో మనుషుల జ్ఞాపకాల ఊసులు మోసిన భావాలతో మౌనగళాలు విప్పి నిశ్శబ్ద భాషలో చర్చించుకోవటం నిన్నటి కళాకాంతుల కొట్టాడై ధగధగలాడిన కుడ్య వదనాలు నిర్జీవ శవకళతో మూగరోదనైన సందర్భాలు చాకలిపద్దుల వివరాలతో పాలవాడి గైర్హాజరు తేదీలతో ఇంటి ఇల్లాలికి జవాబుదారీగా ఉన్న రోజులు ఎంత బాధ్యతని చిరునవ్వుతో మోశాయో! దేవుడి పటాలను తమకు వారగా ఆనించి మంత్రోచ్ఛారణలతో ధూపదీప నైవేద్యాలతో చేసిన పూజలు గోడలకు వేలాడ దీసిన తాత ముత్తాతల జ్ఞాపకాలు ఇల్లు ఖాళీ చేసినంత సులువుగా మర్చిపోగలవేనా ఆ స్మృతులు బుడిబుడి అడుగుల హంసలు రంగుల చాక్‌పీసులతో తమ ఒంటి నిండా చేసిన సంతకాలన్నీ తమని అజంతా ఎల్లోరా గుహల కోవలో నిలబెట్టి గర్వంగా తలెత్తుకునేలా చేసిన అమృత గడియలు. ఏ గోడైతే యేంటి మిత్రమా! కోటగోడైనా, ఇంటి గోడైనా మనిషి తలదాచుకున్న చరిత్రకి ఆనవాలే కదా! తాజ్‌మహలు గోడలు ప్రేమ ప్రతీకలైతే ఇంటి గోడలు వాత్సల్యోద్వేగాల అనురాగ గీతికలే కదా! గోడలంటే తట్టెడు రాళ్లు దోసెడు సిమెంట్ మాత్రమే కాదు నాలుగు గోడలు తమ నెత్తి మీద ఒక కప్పుని మోస్తూ అమ్మ మాయ తిత్తిలో కలల నెలవంకని కాపాడినంత ఆప్యాయంగా ఇంటిల్లిపాదినీ కాపాడే సైనిక శిబిరం కూలిపోయిన మొండిగోడలైనా మానవ జీవన యాన మహాయాత్రకి మౌనసాక్షి మనిషిని కాపలా కుక్కలా రక్షించిన అహింసాయుధం నాగరికతని చాటిచెప్పిన ఇళ్ళూ మహళ్ళూ భవనాలే లేకపోతే ఈ భువన భాండమంతా నరసంచార కీకారణ్యమే కదా! చీని చీనాంబరాలే కాదు, చుట్టూ సరిహద్దు గోడే చైనా ప్రజానీక రక్షణ వ్యూహం నిన్నగాక మొన్న కూల్చేసిన బెర్లిన్ గోడే కదా మనుషులందరి మనసుల్ని కలిపి కుట్టిన పూలమాల స్వాతంత్ర్య సమరోద్యమ స్ఫూర్తి ప్రదాతలు ఊరూరా నిప్పు రవ్వల్ని రాజేసిన పత్రికల్ని జెండాలా మోసిన గోడలు చీకటి చెరువులో కలిసిపోయిన నీలి గోడల వెలుతురు నీడ మొండి గోడలే కదా చరిత్ర వీధుల్లో విరాజిల్లిన చేతి వెన్నముద్దలు. అనుకునే వాళ్ళు అనుకోవచ్చు కానీ ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటికి చేరామని అక్కడైనా తమ చరిత్రను వేలాడదీయాల్సింది గోడల పైనే కదా.

ఈతకోట సుబ్బారావు

94405 29785

ఈ వార్తలు కూడా చదవండి..

లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 25 , 2025 | 12:48 AM