Share News

SL Bhyrappa Biography: ఒకే ఒక భైరప్ప

ABN , Publish Date - Sep 29 , 2025 | 05:37 AM

సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే రచయితలకు కూడా ఉత్థాన పతనాలు ఉంటాయి. కొంతకాలం నిరంతరంగా విస్తృతంగా రచనలు చేస్తూ వచ్చిన రచయిత ప్రయాణం ఏదో ఒక చోట ఆగిపోతుంటుంది. అది తాత్కాలికంగానైనా...

SL Bhyrappa Biography: ఒకే ఒక భైరప్ప

సమాజంలోని అన్ని వ్యవస్థల్లాగే రచయితలకు కూడా ఉత్థాన పతనాలు ఉంటాయి. కొంతకాలం నిరంతరంగా విస్తృతంగా రచనలు చేస్తూ వచ్చిన రచయిత ప్రయాణం ఏదో ఒక చోట ఆగిపోతుంటుంది. అది తాత్కాలికంగానైనా శాశ్వతంగానైనా. అలాంటి ఉత్థాన పతనాలు లేని రచయితలు అరుదు. అలాంటి అతికొద్ది రచయితల్లో ఎస్‌.ఎల్‌. భైరప్ప ఒకరు. 1931లో హాసన్‌ జిల్లాలోని సంతేశివర అనే వూళ్ళో భైరప్ప పుట్టినపుడు ఆ పసిపిల్లవాడు తన పేరునే ఇంటిపేరుగా చేసుకుని తనకు పేరు ప్రఖ్యాతలు తెస్తాడని సంతేశివర గ్రామం ఊహించి ఉండదు. తను పుట్టిన ఊరికి భారతీయ చిత్రపటంలో శాశ్వత స్థానం కల్పించిన ఆ రచయితే ఎస్‌. ఎల్‌. భైరప్పగా పిలువబడే సంతేశివర లింగణ్ణయ భైరప్ప.

రచయిత తను రాస్తున్న విషయం గురించో అనుభవాల గురించో సిద్ధాంతం గురించో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మమేకమై రాసినపుడు, రాసే విషయానికి సంబంధించిన దాని ఆత్మను పట్టుకోగలిగినపుడు ఆ ఆత్మ ఆ రచనను నడిపిస్తుంది. పదికాలాలపాటు నిలబెడుతుంది. రచయిత గుండెల్లోంచో గుండె లోతుల్లోని తడిలో నుంచో ఉద్వేగాల జడిలో నుంచి కాకుండా పాళీ నుంచి వచ్చిన రచన ఏదీ బతికి బట్టకట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. ఈ కొలమానం నుంచీ నేపథ్యం నుంచీ చూసినపుడు భైరప్ప రాసిన ‘వంశవృక్ష’ ‘గృహభంగ’, ‘దాటు’, ‘పర్వ’, ‘ఆవరణ’, ‘సాక్షి’, ‘యాన’, ‘ఉత్తర కాండ’, ‘మతదాన’, ‘గ్రహణ’, ‘మంద్ర’ తదితర రచనలన్నీ ఆ కాల పరీక్షకు తట్టుకుని నిలబడగలిగినవే. చేసిన ప్రతి రచన ద్వారా సంచలనం సృష్టించిన అతికొద్దిమంది రచయితల్లో కూడా భైరప్ప ఒకడు.


సమాజపు పునాదులనే కూకటివేళ్ళతో పెళ్లగించి వేయగల కులం, మతం, మతాంతీకరణ, ఇతిహాసాలు, సంప్రదాయాలు తదితర అంశాలను ఇతివృత్తాలుగా తీసుకుని వాటిని విస్తృతమైన పరిశోధన, అనుభవాల మేళవింపుతో ఆసక్తిరమైన రచనలుగా మలచడంలో భైరప్ ప్రతిభకు ‘దాటు’, ‘వంశవృక్ష’, ‘పర్వ’లు ఒక నిదర్శనం.

భైరప్ప రచనల్లో విలక్షణమైనదిగా ఆయనకు ప్రథమంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ‘వంశవృక్ష’. ఆచార సంప్రదాయాలకు, ఆధునిక భావజాలానికి మధ్య వారధిగా ఆయన సృష్టించిన శ్రీనివాసశ్రోత్రి పాత్ర చిరకాలం గుర్తుండిపోతుంది. సదాచార బ్రాహ్మణ కుటుబంలో జన్మించి వంశవృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే శ్రీనివాసశ్రోత్రి తన పుట్టుక తాలూకూ మూలాలు తెలిసి ఖిన్నుడవుతాడు. ఏకైక కుమారుడు, భార్య చనిపోయినపుడు కూడా చలించకుండా ఆత్మనిగ్రహంతో ఉండగలిగిన శ్రోత్రి తన జన్మ రహస్యం తెలిసి ఒక్కసారిగా విరాగిగా మారిపోతాడు. ‘‘మరొకరి పాపపుణ్యాలను నిర్ణయించే అధికారం మనకు లేదు. అందులోనూ తల్లిదండ్రుల జీవితాలను తూచి చూడడం మహాపాపం,’’ అనుకోగలిగిన జన్మ సంస్కారం కలిగిన శ్రీనివాస శ్రోత్రి కూడా తండ్రికి శ్రాద్ధక్రియలు నిర్వహించాల్సి వచ్చే సందర్భంలో మానసిక విచికిత్సకు లోనవుతాడు. ఎవరి వంశానికి తాను ధర్మబద్ధంగా ఇవ్వబడలేదో వారికి శ్రాద్ధకర్మలు చేసే రస విహీనమైన నాటకం ఆడడంలో అర్థం ఏముందని అనుకుంటాడు. తనను పట్టుకున్న ఆధారం అదృశ్యమై అంతులేని అగాధంలో పడిపోతున్నట్టు భావిస్తాడు. ‘వంశవృక్ష’ విశ్వనాథ సత్యనారాయణ ‘వేయి పడగలు’ను తలపించే విశిష్ట నవల.


కౌరవులు, పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధమవుతున్న సందర్భాన్ని నేపథ్యంగా తీసుకుని భైరప్ప రచించిన ‘పర్వ’ ఆధునిక మహాభారతానికి రక్తమాంసాలను అద్ది, ఆ పాత్రలను సజీవంగా కళ్ళముందు నిలబెడుతుంది. మహాభారతం చుట్టూ అలుముకున్న దైవిక భావజాలానికి విరుద్ధంగా దానికి ఒక హేతుబద్ధమైన రూపం ఇచ్చి, ఆయా పాత్రల అంతఃసంఘర్షణకు మనోవిశ్లేషణకు ‘పర్వ’ అద్దం పడుతుంది. కుంతి, ద్రౌపది, భీముడు, అర్జునుడు తదితర పాత్రల అంతరంగపు అట్టడుగు పొరల్లో నిక్షిప్తమైన నిజాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది.

‘‘నువ్వు కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకున్నావో నిజం చెప్పు’’ అని కృష్ణుడు గాంధారిని అడిగినపుడు ‘‘నాకు ఇష్టం లేకుండా గుడ్డివాడిని భర్తగా చేస్తే అతని మొహం కూడా చూడను అని శపథం చేసి మొదట కళ్ళకు గంతలు కట్టుకున్నాను. ధృతరాష్ట్రుడికి లేని చూపు తనకు ఎందుకని కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు మిగిలిన వారు అంతా భావించి నన్ను ప్రశంసించినపుడు ఆ దేవీ పట్టం నుంచి దూరం కాకుండా ఉండేందుకు గంతలు కట్టుకోవడం కొనసాగించాను’’ అని అంటుంది గాంధారి. మహాభారతంలో బైటకు కనిపించని ఎన్నో చీకటి కోణాలని, యుద్ధాల పేరుతో జరిగే వినాశనాన్నీ, రాజుల అంతఃపురాలలో మగ్గిపోయే స్త్రీ జనపు కన్నీటి ఘోషనీ, పురుషులు స్త్రీల మధ్య పాటించే ద్వంద్వ ప్రమాణాలను అడుగడుగునా ‘పర్వ’ చెప్పకనే చెబుతుంటుంది. దాదాపు ఇరవై ఏళ్ళపాటు తనలో మహాభారత కథా వాస్తవాల పట్ల ప్రారంభమైన ఊహలు, ఆలోచనలకు పుస్తకరూపమే ‘పర్వ’ అంటారు భైరప్ప.

భైరప్ప నవలల్లో విశిష్ట ప్రాచుర్యం పొందడమే గాక వివాదాస్పదంగాను నిలిచిపోయిన నవల ‘ఆవరణ’. అభ్యుదయ భావాలున్న అమీర్‌ను పెళ్ళి చేసు కున్న లక్ష్మి తన పేరును రజియాగా మార్చుకుంటుంది. అయితే అమీర్‌ తను అనుకున్నంత ఉన్నతుడు కాదని తెలుసుకుని అతనికి దూరం అవుతుంది. ఆ క్రమంలో చరిత్ర మీద ఆసక్తి కలిగి మొగలుల చరిత్ర గురించి అధ్యయనం చేయాలనుకున్న లక్ష్మికి ఆ పరిశోధనలో ఇస్లామిక్‌ పరిపాలన వల్ల మారిన హిందూ సమాజ స్వరూప స్వభావాలకు సంబంధించి కొన్ని చారిత్రక సత్యాలు వెల్లడవుతాయి. హిందూ సంస్కృతిని ధ్వంసం చేసి ఆ పునాదులమీద మొగలులు సామ్రాజ్యాన్ని స్థాపించారని లక్ష్మి పరిశోధనా పత్రాలను తయారు చేసి ఒక సంచలనానికి కారణం అవుతుంది.


‘ఆవరణ’ నవలతో భైరప్ప సమాజాన్ని మతపరంగా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ‘సంస్కార’ నవల రచయిత యు.ఆర్‌. అనంతమూర్తి కూడా ‘ఆవరణ’ను ప్రమాదకరమైన నవలగా అభివర్ణించారు. అర్ధసత్యాలతో కూడిన ఇలాంటి రచనల వల్ల మత సమైక్యత దెబ్బతింటుందని ఇతర రచయితలు కూడా భైరప్పను తీవ్రస్థాయిలో విమర్శించారు. అయితే తను ఎంతో విస్తృతమైన పరిశోధన చేసి ఈ రచన చేశానని, ఇందులోనివన్నీ అక్షర సత్యాలని భైరప్ప అంటారు.

‘పర్వ’లో మహాభారతంలాగే ‘ఉత్తరకాండ’లో రామాయణంపై కూడా ఒక విభిన్న దృష్టికోణం నుంచి ప్రశ్నలు సంధిస్తారు భైరప్ప. సీత దృష్టికోణం నుంచీ రామాయణాన్ని నిర్వచించిన భైరప్ప రామాయణం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే సీతకు చేసిన ద్రోహం అని, ఆమె తప్పు లేకుండానే ఆమెకు విధించిన శిక్ష అనీ అంటారు. కైకపై దశరథుడికి ఉన్న ప్రేమ, కైకేయి దురాశ, రాముడి శక్తి సామర్థ్యాలు, భరతుడి నిస్సహాయత, లక్షణుడి భ్రాతృప్రేమ లాంటి విషయాలన్నిటినీ పక్కనపెడితే రామాయణం సీత జీవితం తాలూకూ విషాదానికి, అర్థరాహిత్యానికి నిదర్శనమని అంటారు భైరప్ప. ‘ఉత్తరకాండ’ కూడా కన్నడ సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.


ఒక రచయిత విస్తృతంగా రాస్తూ పోయినపుడు కొంతకాలానికి అతను చెప్పాలనుకున్నదంతా చెప్పివేస్తాడు. అంతవరకూ ఉప్పెనలా ఎగసి వచ్చిన ఆలోచనా ప్రవాహం ఒక చోట ఇంకిపోయి ఒకలాంటి భావశూన్యత ఏర్పడుతుంది. ఏది రాద్దామనుకున్నా అది ఎప్పుడో ఒకప్పుడు ప్రస్తావించిన విషయమే అనిపిస్తుంది. భావాల పునర్‌ వ్యక్తీకరణగా అనిపించినపుడు అతని కలం ఒకచోట ఆగిపోతుంది. ప్రతి రచయితా ఏదో ఒక దశలో ఈ అనుభవానికి లోనవకుండా ఉండడు. అయితే దీనికి మినహాయింపుగా భైరప్ప అవిశ్రాంతంగా రచనలు చేస్తూనే వచ్చారు. ఇరవైనాలుగుకు పైగా నవలలతో సహా దాదాపు నలభై ఎనిమిది పైగా రచనలు చేశారు. ఈ విశిష్టత కారణంగానే భైరప్పను పద్మభూషణ్‌, పద్మశ్రీ, సరస్వతి సమ్మాన్‌, కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి.

తను రాసే వస్తువు పైనా, విషయం పైనా నిబద్ధత ఉన్నపుడు రచయిత విమర్శను కూడా అంతే నిబద్ధతతో అంగీకరించవలసి, ఎదుర్కొనవలసి ఉంటుంది. రచయిత ఎంత గొప్పవాడైనా, మేధావి అయినా విమర్శకుడు తనను సమర్థించనపుడు, తనకు సహాయంగా రానపుడు రచయిత నిస్సహాయుడిగా ఉండిపోవలసిందేనని ప్రముఖ ఆంగ్ల విమర్శకుడు మాధ్యూ ఆర్నాల్డ్‌ అంటారు. అయితే భైరప్ప ఎప్పుడూ అలా నిస్సహాయుడిగా ఉండిపోలేదు. నిబద్ధతనూ వదులుకోలేదు. తను సృష్టించిన పాత్రలపై రచయితకు సహానుభూతి ఉండాలి. ఆ పాత్రలను సంపూర్ణంగా అవగాహన చేసుకుని వాటిల్లోకి పరకాయ ప్రవేశం చేయగలిగి ఉండాలి. గతంలోని అనుభవాలను వర్తమానంతో బేరీజు వేసుకుని భవిష్యత్తును దిశానిర్దేశం చేయగలిగిన దార్శనికత కలిగి ఉండాలి. అలాంటి ఒక దార్శనికుడు భైరప్ప.

జి. లక్ష్మి

94907 35322

ఇవీ చదవండి:

Allianz Global Wealth Report 2025: కుటుంబాల సంపద మరింత పైకి

Pharma Stocks Plunge: ఫార్మా సుంకాల షాక్‌

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 05:37 AM