Share News

గోదావరి వరద జలాలపై తెలంగాణ మొండి వాదన

ABN , Publish Date - Jun 19 , 2025 | 04:35 AM

గోదావరి వరదజలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వైఖరి చిన్న పిల్లల పుస్తకాల్లో ఉన్న పులి–మేక కథను తలదన్నే విధంగా ఉంది. నది ఎగువ భాగంలో నీళ్లు తాగుతున్న పులి కింద భాగంలో నీళ్లు తాగుతున్న...

గోదావరి వరద జలాలపై తెలంగాణ మొండి వాదన

గోదావరి వరదజలాల వినియోగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వైఖరి చిన్న పిల్లల పుస్తకాల్లో ఉన్న పులి–మేక కథను తలదన్నే విధంగా ఉంది. నది ఎగువ భాగంలో నీళ్లు తాగుతున్న పులి కింద భాగంలో నీళ్లు తాగుతున్న మేకను ఉద్దేశించి తను తాగే నీళ్లు ఎంగిలి చేస్తున్నావని బెదిరించిన కథ అందరికీ తెలుసు! అచ్చం అలాగే ఉంది తెలంగాణ వ్యవహార సరళి. గోదావరికి ఎగువ భాగంలో తెలంగాణ ఉంది. గోదావరిలో నీటి ఎద్దడి ఏర్పడి తెలంగాణ బంద్ చేస్తే, ఆంధ్రప్రదేశ్ కటకటలాడవలసిందే. కృష్ణనదిలో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండితే గాని జూరాలకు నీళ్లు రావనేది తెలంగాణ నేతలకు తెలుసు. గోదావరి అయినా అంతే. తెలంగాణలో గోదావరి మీద గత పదేళ్లుగా పలు ప్రాజెక్టులు నిర్మించారు. ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటివాటాల వివాదం అపరిష్కృతంగా ఉన్నా, గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన 1486.85 టీఎంసీల్లో 957.85 టీఎంసీల నీళ్లు తమవని ఏకపక్షంగా తెలంగాణ చెబుతున్నది. కానీ ట్రిబ్యునల్ నియామకానికి ఇష్టపడటం లేదు. ట్రిబ్యునల్ నియామకమైతే దాని ముందు తన వాటాను గురించి వాదించవచ్చుకదా? ప్రస్తుతం తను చెబుతున్న వాటా మేరకు కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఆమోదం కోసం పట్టు వదలకుండా కృషి చేస్తున్నది. తెలంగాణ దృష్టిలో దీన్ని తప్పు పట్టలేం. అయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా ఆచరణలో తెలంగాణకు వచ్చిన నష్టం ఏమిటి? పోలవరం జలాశయం ముంపు తప్ప. తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లు కిందకు వస్తేనే ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకొంటుంది. బాబ్లీ ప్రాజెక్టు తలుపులు ఎత్తితేనే శ్రీరామ్‌సాగర్‌కు నీళ్లు వస్తున్నాయి. గోదావరి నదిలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి ప్రాజెక్టులు కట్టుకొంటే పై నుంచి అవసరమైన మేరకు నీళ్లు రాకుంటే వాటిని ఎండబెట్టుకోవలసిందే!


ఎగువ రాష్ట్రాలు నిర్మించే ప్రాజెక్టులపై సాధారణంగా దిగువ రాష్ట్రాలు అభ్యంతరాలు చెబుతాయి. దిగువన ఉండే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టుకొంటే ఎగువన వుండే తెలంగాణకు ఏ విధంగా నష్టం? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టులకు వాడుకోగా ఒక నీటి సంవత్సరంలో ఒక నెల రోజులు అపారమైన వరద వెల్లువెత్తుతుంది. ఈ వరదనీటిని వాడుకొనేందుకే గోదావరి–బనకచర్ల అనుసంధానం రూపకల్పన చేస్తున్నారు.

ఈ వివాదం జటిలం కావడానికి తన పబ్బం గడుపుకొనే కేంద్ర ప్రభుత్వ వైఖరే మూల హేతువు. దీంతో పాటు జగన్మోహన్‌రెడ్డి కూడా బాధ్యులే. 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణ జలాలు పంపకానికి తోడు, గోదావరి జలాల వాటాలు తేల్చేందుకు ట్రిబ్యునల్ వేయాలని తీర్మానం చేశారు. అయితే కృష్ణ జలాల ట్రిబ్యునల్ కోసమే కేసీఆర్ పట్టుబట్టారు. దానితో బీజేపీ 2023 ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కృష్ణా ట్రిబ్యునల్ వేసింది. కానీ గోదావరి ట్రిబ్యునల్ ఇంతవరకు వేయలేదు. కేసీఆర్ లాగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గోదావరి ట్రిబ్యునల్‌ కోసం కేంద్రం వెంట పడలేదు. సంవత్సరం గడచిపోయినా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా గోదావరి ట్రిబ్యునల్‌పై అంత పట్టుదలగా లేదు. గోదావరి ట్రిబ్యునల్ నియామకమై ఎవరి వాటాలు ఎంతో తేలిపోయి ఉంటే, ఇప్పుడు గోదావరి–బనకచర్ల అనుసంధానంపై తెలంగాణ యాగీ చేసే అవకాశం ఉండేది కాదు. పైగా ఏ నదీ పరీవాహక ప్రాంతంలోనైనా చిట్టచివరన వుండే రాష్ట్రానికి మిగులుతో పాటు వరద జలాలపై హక్కును సహజ న్యాయసూత్రాల ప్రకారం ట్రిబ్యునల్స్ కల్పిస్తాయి. ఆ వెసులుబాటు ఉపయోగించుకొనే అవకాశం ఉండేది.

గోదావరి–బనకచర్ల అనుసంధానంపై రగడను బీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖంగా లేవదీసింది. ఆ పార్టీ అధికార మీడియాలో ప్రతిరోజూ వరసబెట్టి ఈ అనుసంధానానికి, ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేక కథనాలు వస్తున్నాయి. కృష్ణ నది నీళ్లన్నీ దోచుకోవడం అయిందని, ఇప్పుడు గోదావరి నీళ్లపై కన్ను పడిందని పుంఖానుపుంఖాలుగా వార్తా కథనాలు వండి వారుస్తున్నారు. ఎగువ రాష్ట్రమైన తాము ఉపయోగించుకోగా మిగిలిన నీరే కిందకు పోతాయనే స్పృహ లేకుండా బీఆర్‌ఎస్ తీరు ఉంది. గోదావరి–బనకచర్ల అనుసంధానంపై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ కుంభకోణం బీఆర్‌ఎస్ పార్టీ మెడకు చుట్టుకోవడమే. దాన్ని పక్కదారి పట్టించేందుకు గోదావరి–బనకచర్లకు ముడిబెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, చంద్ర బాబు నాయుడు–రేవంత్‌రెడ్డి మధ్య గురుశిష్యుల సంబంధం ఉండడం వల్లే రేవంత్‌రెడ్డి మెతక వైఖరి అవలంబిస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు దెబ్బ తిని నీటిని నిల్వ చేయకపోవడానికి, గోదావరి–బనకచర్ల అనుసంధానానికి బీఆర్‌ఎస్ పార్టీ లింకుపెట్టి ప్రచారం చేస్తున్నది.


మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా నిర్మాణ లోపాలు బయటపడటంతో వాటిలో కూడా నీళ్లు నిల్వ చేయడం లేదు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణంపై ఒక పక్క విజిలెన్స్ అధికారులు పరిశీలించి నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న పలువురు అధికారులను ఈ నివేదిక దోషులుగా నిర్ధారించింది. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరుపుతున్న ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్‌ విచారణకు హాజరై ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే కాళేశ్వరం ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బీఆర్‌ఎస్ పార్టీ గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై దుమ్మెత్తి పోస్తోంది. ఇది ఎంతవరకు వెళ్లిందంటే రాయలసీమలో 350 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదిలా వుండగా బీఆర్‌ఎస్ చేస్తున్న ప్రచారంతో తామెక్కడ వెనుకబడిపోతామోననే భయంతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి గోదావరి–బనక చర్ల అనుసంధానం అమలు చేసేందుకు తాము వ్యతిరేకమని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పాటిల్‌తో చెప్పినట్లు ప్రకటించారు. ఈ విమర్శనా ధోరణి ఎంతవరకు వెళ్లిందంటే శ్రీశైలం కుడి ప్రధాన కాలువ లైనింగ్ కూడా చేయకూడదని తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి లేఖ రాశారు. వరద రోజుల్లో తప్ప కృష్ణ జలాల పంపిణీ... యాజమాన్య బోర్డు అధీనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని మౌలిక సదుపాయాలు కల్పించుకున్నా తెలంగాణకు వచ్చిన నష్టం ఏమిటి? వరద నీరు సముద్రంలో కలిసేందుకైనా ఇష్టపడతారు గాని ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి ఇష్టపడటం లేదు.


ఇంత రాజకీయ రగడ జరుగుతుంటే బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకు, వారి మీడియా దుష్ప్రచారాలకు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులు దీటైన సమాధానం ఇవ్వడం లేదు. గతంలో వైసీపీ పాలనలో కూడా ఇలాగే జరిగేది. తెలంగాణ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా, ఎవరూ పట్టించుకొనేవారు కాదు. వాస్తవంలో అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి సరిపోయింది.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

ఈ వార్తలు కూడా చదవండి..

హీరో ఫిన్‌కార్ప్‌ రూ 260 కోట్ల సమీకరణ

మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 19 , 2025 | 04:35 AM