Share News

Revanth Reddys Global Summit: ఉజ్వల తెలంగాణ దిశగా ఈ పరుగు

ABN , Publish Date - Dec 11 , 2025 | 05:25 AM

రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అపారమైన విశ్వాసం కనిపిస్తుంటే ప్రతిపక్షాలకు, వాటిని మోస్తున్న కొన్ని మీడియా సంస్థలకు ఎక్కడలేని కంటగింపుగా మారింది. వారి అడ్డగోలు విమర్ళలే ఇందుకు నిదర్శనం...

Revanth Reddys Global Summit: ఉజ్వల తెలంగాణ దిశగా ఈ పరుగు

రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అపారమైన విశ్వాసం కనిపిస్తుంటే ప్రతిపక్షాలకు, వాటిని మోస్తున్న కొన్ని మీడియా సంస్థలకు ఎక్కడలేని కంటగింపుగా మారింది. వారి అడ్డగోలు విమర్ళలే ఇందుకు నిదర్శనం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు వందల కోట్లు ఖర్చు చేసి ఈ సదస్సులు ఎందుకని ఒకరు, వచ్చిన పెట్టుబడులన్నీ గోబెల్స్ అని మరొకరు, ఇంకో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదంతా చేస్తున్నది తన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసమే అని ఇంకొకరు... ఇలా దిగజారి విమర్శలు చేస్తున్నారు.

ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ ప్రపంచం నుంచి పెట్టుబడులను ఆకర్షించి, పరిశ్రమలను, మౌలిక వసతులను, సరికొత్త టెక్నాలజీలను, నూతన వ్యాపార పోకడలను అలవర్చుకోవడం ద్వారానే అభివృద్ధి చెందాయి. 1971లో యూరోపియన్ మేనేజ్‌మెంట్‌ ఫోరం దావోస్‌లో నిర్వహించిన ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను ప్రపంచంలో తొలి పెట్టుబడిదారుల సదస్సుగా పరిగణిస్తున్నారు. ఆ తర్వాత 1987లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు, 2008లో యునైటెడ్ నేషనల్ వరల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం సదస్సు వంటివి ప్రపంచ ప్రగతికి కీలక చోదకశక్తులుగా నిలిచాయి.

మన దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాలు ప్రపంచ పెట్టుబడి సదస్సులను నిర్వహించాయి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం దావోస్ లాంటి సదస్సుల్లో పాల్గొనేందుకు చూపించిన చొరవ, అటువంటి సదస్సులను హైదరాబాద్‌లో నిర్వహించడంలో ఏ మాత్రం చూపలేదు. 2003లో ప్రస్తుత ప్రధాని, ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ఏర్పాటు చేసిన ‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ను ప్రచారపర్వంగా కాకుండా ప్రజలకు పెట్టుబడులు వచ్చే గమ్యంగా మార్చాలని అక్కడి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సూచించిందే తప్పా నోటికి వచ్చిన విమర్శలు చేయలేదు. ఈ ఒక్క సదస్సులోనే గుజరాత్‌ ప్రభుత్వం రూ.87,000 కోట్ల విలువైన ఎంఓయూలు కుదుర్చుకున్నది. అప్పటిదాక ఓ మోస్తరు రాష్ట్రంగా ఉన్నదల్లా ఒక్కసారిగా ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎదిగింది. ఆ తర్వాత 2007లో మధ్యప్రదేశ్; 2010లో కర్ణాటక; 2015, 2019 సంవత్సరాల్లో రెండుసార్లు తమిళనాడు; 2018లో మహారాష్ట్ర ఇలాంటి గ్లోబల్‌ సమ్మిట్‌లను నిర్వహించి కోట్ల పెట్టుబడులు రాబట్టాయి. ఇదే వరుసలో రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ప్రదేశ్‌లు కూడా పెట్టుబడుల సదస్సులను నిర్వహించాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఈ ఒక్క ఏడాదే విజయవాడలో ‘ఇన్వెస్టోపియా గ్లోబల్ ఆంధ్రప్రదేశ్–2025’ను నిర్వహించింది, ఆ తర్వాత నవంబర్ నెలలో సీఐఐతో కలిసి నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఏకంగా గూగుల్ డేటా సెంటర్‌తో కలిపి దాదాపు రూ.13.25 లక్షల కోట్ల ఒప్పందాలను చేసుకుంది.


ఈ పెట్టుబడుల పోటీలో తెలంగాణ వెనకబడిపోకుండా మేటిగా నిలవాలనే తలంపుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వాయు వేగంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు అంకురార్పణ చేశారు. యువ ముఖ్యమంత్రిగా ప్రతీ అవకాశాన్నీ అందుకుని రాష్ట్ర ప్రగతిపథాన్ని పరుగులు పెట్టించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. గతంలో పాలించిన ముఖ్యమంత్రుల వలె రేవంత్‌కు ఈగో లేదు. నా రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశం తప్ప, ప్రజల మనిషిని అని అనిపించుకోవాలన్న తపన తప్ప, ఆయనకు మరే యావా లేదు. మాటలతో కోటలు కట్టలేడేమో కానీ, చేతలతో తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్తును మాత్రం నిర్మించగలడు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా ఆహా ఓహో అంటూ అబద్ధాలతో ఊదరగొట్టడం పెద్ద సమస్య కాదు. కానీ ఆర్థిక సమస్యలు అబద్ధాలతో నిండినప్పుడు ఎలాంటి నష్టాలు సంభవిస్తాయో సత్యం కంప్యూటర్స్ లాంటి ఒక సం‍‍స్థలో జరిగినప్పుడే ప్రజలు గమనించారు. ఇక అలాంటి విపత్తులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ స్థాయిలో జరిగితే ఎన్ని జీవితాలు ప్రభావితం అవుతాయీ అన్నది ఊహకు అందని విషయం.

గరళం లాంటి ఆర్థికలోటును కంఠంలో దాచుకొని ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్‌రెడ్డి. అందుకే 42 దేశాల నుంచి 1686 మంది ప్రతినిధులు, 225 మంది విదేశీ అతిథులతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలతో ప్రపంచానికి తెలంగాణ పరిపాలన సత్తాను చాటాడు. ఇది కేవలం తెలంగాణ చరిత్రలోనే కాదు, యావత్ భారతదేశ సమ్మిట్ల చరిత్రలో ఒక రికార్డు!

2047 సంవత్సరానికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం అంటే ప్రతీ సంవత్సరం అద్భుతమైన 8–9శాతం వృద్ధిరేటు సాధించాలి. ఈ లక్ష్యంతో, ప్రజల జీవితాలు ముడిపడ్డాయన్న భయాన్ని అధికారుల్లో నింపడం కోసమే ముఖ్యమంత్రి ఇంత శ్రమిస్తున్నారని చెప్పక తప్పదు. ఐటీలో అద్భుతాలు చేశామని ప్రగల్భాలు పలికే గత పాలకులు, వారి పదేళ్ళ పాలనలో హైదరాబాద్ ఎందుకు బెంగళూరును దాటలేకపోయిందన్న ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పరు. ఇప్పుడు ఆ ఘనతను హైదరాబాద్ సాధించబోతున్నది. CURE, PURE, RARE వంటి ప్రణాళికలు రేవంత్‌రెడ్డిలోని దార్శనికతకు నిలువుటద్దంగా కనిపిస్తున్నాయి. కొందరు ప్రతిపక్ష నాయకులు గోబెల్స్ అని విమర్శించవచ్చు, కానీ ఇది గోబెల్స్ కాదు గోల్డెన్ గ్లోబల్ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా కంపెనీ ఒప్పందాలు చెప్పకనే చెప్పాయి. ఇదే కాదు ఇతర కంపెనీలతో అవగాహనలు కూడా వడివడిగా జరిగాయి. అనేక కంపెనీలు డాటా సెంటర్ల ఏర్పాటుకు, ఫ్యూచర్ టెక్నాలజీస్ (AI, ML, Robotics) కంపెనీల స్థాపనకు, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు, రిన్యూవబుల్ ఎనర్జీ స్థాపనకు, హెల్త్‌ కేర్ & బయోటెక్ వంటి రంగాల్లో విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అందుకే రెండు రోజుల్లోనే రూ.5.75లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


‘‘Stable Governance + Progressive Policies + Skilled Workforce = Telangana Advantage’’ అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నినాదం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రతీ బిడ్డకు ఉజ్వల భవిష్యత్తును సమకూర్చుతుందని, తెలంగాణలో ప్రతీ పౌరునికి బతుకుపై భరోసాని నింపుతుందని అనడంలో ఎటువంటి సంశయం లేదు. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వ ప్రతిభకు తార్కాణం, రేపటి ఉజ్వల తెలంగాణకు సోపానం.

బత్తిని శ్రీనివాస్‌రావు

పీసీసీ సభ్యులు

ఈ వార్తలు కూడా చదవండి..

సీతాఫలం నుంచి గింజలను సింపుల్‌గా ఇలా వేరు చేయవచ్చు..

మరికొన్ని గంటల్లో దీక్ష విరమణ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తనున్న భవానీలు

Read Latest AP News and National News

Updated Date - Dec 11 , 2025 | 05:25 AM