A Critical Look at Workers Rights: లేబర్ కోడ్స్‌కు షుగర్ కోటింగ్
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:18 AM
‘కార్మికలోకానికి శాపం ఈ కమ్యూనిస్టులు’ శీర్షికన బీజేపీ నాయకులు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి రాసిన వ్యాసం (12.12.2025) మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నిస్వార్థంగా...
‘కార్మికలోకానికి శాపం ఈ కమ్యూనిస్టులు’ శీర్షికన బీజేపీ నాయకులు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి రాసిన వ్యాసం (12.12.2025) మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై నిస్వార్థంగా పోరాడుతున్న కమ్యూనిస్టులను విమర్శించడమే లక్ష్యంగా సాగింది. అందులో భాగంగా మోదీ ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోడ్లను వ్యాసకర్త అసత్యాలతో ఆకాశానికి ఎత్తేశారు.
కార్మికులకు ప్రధానంగా అవసరమైనవి గౌరవప్రదమైన వేతనం, పని ప్రదేశంలో భద్రత. వీటికి యాజమాన్యాలు ఒప్పుకోకపోవడం వల్లే కార్మికులు సంఘాలు పెట్టుకుంటారు, సమ్మెలు చేస్తారు. అందువల్ల వేతనం, సంఘం, సమ్మె– ఈ మూడూ కార్మికుల అస్తిత్వానికి ప్రధానం. వీటిని మోదీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్ల ద్వారా కాల రాస్తోంది.
వాస్తవంగా మన దేశంలో ఎటువంటి చట్టం లేకముందే కార్మికులు అనేక సమ్మెలు చేశారు. దరిమిలా నాటి బ్రిటిష్ ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ చట్టం 1926 చేసింది. ఈ చట్టం ప్రకారం ఏదైనా పరిశ్రమలో ఏడుగురు కార్మికులు కలిసి యూనియన్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కోడ్ ప్రకారం 10 శాతం కార్మికులు కానీ, 100 మంది కలిస్తేనే కానీ యూనియన్ ఏర్పాటు కాదు. ఈ నిబంధనకు అనుగుణంగా యూనియన్ ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఒకవేళ ఏదైనా సమయంలో ఈ సంఖ్య తగ్గితే ఆ యూనియన్ రిజిస్ట్రేషన్ రద్దు అయిపోయే నిబంధన కొత్తగా చేర్చారు. దీనివల్ల యూనియన్ ఏర్పాటు గగనం అయిపోతుంది.
పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఏదైనా అత్యవసర సంస్థలో సమ్మె చేయాలంటే గతంలో 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. నేడు దానిని 60 రోజులకు మార్చివేశారు. అలాగే నోటీసు ఇచ్చిన వెంటనే లేబర్ కమీషనర్ కన్సిలియేషన్ వేయాలని, అది పెండింగ్‌లో ఉండగా సమ్మె చేయరాదని షరతు విధించారు. ఒకవేళ అప్పుడు సమ్మె చేస్తే దాన్ని చట్ట విరుద్ధ సమ్మెగా పరిగణించి, సమ్మె చేసిన వారికి, ప్రోత్సహించినవారికి జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించవచ్చు. అంటే, ఆచరణలో ఇక సమ్మె చేయడమే దుర్లభంగా మారుతుంది.
పోనీ, ఈ లేబర్ కోడ్లలో కార్మికుల వేతనాలు, పని పరిస్థితులు, జీవన ప్రమాణాలు పెంచే అంశాలేమైనా ఉన్నాయా? దుర్భిణీ వేసి చూసినా కనిపించవు సరికదా మరింత దిగజారుడే కనపడుతుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికుని కనీస వేతనం రోజుకు రూ.465గా ఇటీవలే కేంద్ర లేబర్ కమిషనర్ ప్రకటించారు. అంటే నెలకు 26 రోజులుగా భావిస్తే వచ్చే వేతనం కేవలం నెలకు రూ.12,090. ఈ వేతనమే జీవన ప్రమాణాలు పెంచేసేదిగా వ్యాసరచయితకు కనపడడం విడ్డూరమే. కేంద్ర సంస్థల్లోనే ఇలా ఉంటే, ఇక ప్రైవేటు సంస్థల గురించి చెప్పనవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ‘అంత్యోదయ’ కింద పేదలకు ఇచ్చే రేషన్ కార్డు అర్హత నెలకు రూ.15వేలు. మోదీ ప్రభుత్వం కార్మికుని కనీస వేతనాన్ని దారిద్ర్య రేఖ కంటే తక్కువగా నిర్ణయించి, సంపద సృష్టికర్తలైన కార్మికులను నిత్య దరిద్రులుగా బతకమనడం దేశానికి శ్రేయస్కరం కాదు. ఇలా వేతనాలు పెంచక, సంఘాలు పెట్టుకోనివ్వక, సమ్మెలు చేయనివ్వకుండా ఈ లేబర్ కోడ్లు తయారు చేయడం అంటే కార్మికులను యాజమాన్యాల దయాదాక్షిణ్యాలకు వదిలివేయడమే, వారిని బానిసలుగా మార్చేయడమే! ఫ్యాక్టరీ చట్టం ప్రకారం భద్రతా ప్రమాణాలు తనిఖీ చేసే ఇన్‌స్పెక్టర్ పేరు కూడా ఫెలిసిటేటర్‌గా మార్చేసి, అధికారాలన్నీ తీసేసి, కార్మికుల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేస్తోంది.
గిగ్ వర్కర్లకు ఏదో మేలు జరుగుతుందని భావించడం భ్రమే! ఎందుకంటే ఈ లేబర్ కోడ్లలో ఎక్కడా ప్రభుత్వం వీరి సంక్షేమం కోసం రూపాయి కూడా ఇస్తుందని లేదు. ఇక్కడ కూడా యాజమాన్యాల నుండే వసూలు చేస్తారట. అంటే తిరిగి ఆ సేవలు అందుకునే సామాన్యుల మీదే ఆ భారం పడుతుంది. శాశ్వత ఉపాధి దాదాపు లేనట్లుగా చేసి, కాంట్రాక్టు పద్ధతిని వ్యవస్థీకృతం చేసేలా అనేక అంశాలు ఈ కోడ్లలో పొందుపరిచారు. ఇక సంక్షేమం గురించి వేరే చెప్పనవసరం లేదు. పాతికేళ్లు, ముప్పైఏళ్ళు పైగా ఒక పరిశ్రమలో పనిచేసి, రిటైరయిన కార్మికునికి ఈపీఎస్ పేరున ఇస్తున్న పింఛన్ అత్యధికమందికి మూడువేల రూపాయలకు మించి లేదు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇస్తున్న నాలుగు వేల రూపాయల సామాజిక పింఛన్ కంటే కూడా ఇది చాలా తక్కువ. ఈ ఈపీఎస్ పింఛన్ తొమ్మిది వేల రూపాయలకైనా పెంచాలని ఎంత మొర పెట్టుకున్నా మోదీ ప్రభుత్వంలో చలనం లేదు. ఎన్పీఎస్, యూపీఎస్ పేరున కార్మికుల పొదుపు సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టి మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది. ఇదీ! మోదీ ప్రభుత్వం శ్రామికులకు ఇస్తున్న గౌరవం.
కమ్యూనిస్టులు పరిశ్రమల నాశనమే విధానంగా పని చేస్తారని వ్యాసకర్త ఇంకో విమర్శ చేశారు. వాస్తవంగా మోదీ ప్రభుత్వం పాలించిన ఈ పదకొండేళ్ళ కాలంలో ఉత్పాదక రంగం బలహీనపడింది. అధికారిక లెక్కల ప్రకారమే అనేక చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు మూతబడ్డాయి. అన్నింటికి మించి, దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మగా ఉన్న ప్రభుత్వరంగ పరిశ్రమలను అమ్మేయడమే మోదీ ప్రభుత్వ ప్రధాన విధానంగా ఉంది. మరోపక్క కమ్యూనిస్టులు ప్రభుత్వ రంగ పరిరక్షణకు పోరాడుతున్న కార్మికులకు పూర్తి అండగా నిలిచారు. కమ్యూనిస్టులు కార్మికులను ఓట్ బ్యాంకుగా చూస్తారని మరో అపవాదు వేశారు బీజేపీ విష్ణువర్ధన్‌రెడ్డి. వాస్తవమేమిటంటే కార్మికులను కులం, మతం, ప్రాంతాల పేరున విడదీసి, వారి ఐక్యతను విచ్ఛిన్నం చేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నది బీజేపీనే! దీనికి భిన్నంగా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి, ప్రజల, దేశ ఐక్యతను కాపాడుతున్నది కమ్యూనిస్టులే. అటువంటి కమ్యూనిస్టులపై లేనిపోని నిందలు వేయడం సూర్యునిపై ఉమ్మివేయడం లాంటిదే!
ఎ.అజశర్మ
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారు!
తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్
For More AP News And Telugu News