Share News

Emotional Politics: జాతి సంస్కారానికి భావోద్వేగాల కళంకం

ABN , Publish Date - Oct 08 , 2025 | 02:02 AM

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. అదే సమయంలో ఫలానా సంఘటన వెనుక కొన్ని ప్రేరేపిత శక్తులున్నాయని కూడా చెప్పడం సరైనది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై...

Emotional Politics: జాతి సంస్కారానికి భావోద్వేగాల కళంకం

కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరగవు. అదే సమయంలో ఫలానా సంఘటన వెనుక కొన్ని ప్రేరేపిత శక్తులున్నాయని కూడా చెప్పడం సరైనది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై ఒక న్యాయవాది బూటు విసిరేందుకు ప్రయత్నించిన సంఘటనకు కూడా ఇదే వర్తిస్తుంది. భారత దేశంలో ఎలాంటి భావోద్వేగ పరిస్థితులు నెలకొన్నాయో, ప్రజలు ఏ మనోభావాలకు ప్రేరితులవుతున్నారో చెప్పేందుకు ఇది ఉదాహరణ. అంతే కాదు, మీడియా ఒక వ్యాఖ్యను సమగ్రంగా ప్రసారం చేసేందుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో కూడా ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేనప్పుడు, దేశంలో ఉన్న ప్రజాస్వామిక సంస్కృతి, దాని చరిత్ర గురించి అవగాహన లేనప్పుడు, భారత రాజ్యాంగం స్ఫూర్తిని జీర్ణించుకోలేనప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్నది. కొన్ని వందల సంవత్సరాల పాటు అనేక శక్తులతో పోరాడిన తర్వాత దేశానికి ప్రజాస్వామిక వ్యవస్థ లభించింది. అనేక మంది మేధావులు చర్చించిన తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. రాజ్యాంగంలోని ప్రగతిశీల అంశాల ఆధారంగానే కాలం చెల్లిన దురాచారాల్ని, అన్యాయాల్ని అనేకం మనం వదుల్చుకోగలిగాం. నిజానికి మతాల్లోని దుర్మార్గాలను కూడా తొలగించుకుని కాలానికి తగ్గట్లుగా మార్చుకునేందుకు కూడా రాజ్యాంగ వ్యవస్థలే దోహదం చేశాయి. అందువల్లే మనం సంప్రదాయాల్ని పాటించినా ఆధునిక జీవన విధానాలను అనుసరిస్తున్నాం. నాయకులు రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాలాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తారు కానీ రాజ్యాంగం ప్రగతిశీలంగానే ఉంటుంది. అంతే కాదు, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైనప్పటికీ అనేక దేశాల మాదిరి మన దేశంలో అల్లకల్లోలాలు, అస్థిరత ఏర్పడలేదంటే ఇది కొన్ని వేల శతాబ్దాలుగా మనం రూపొందించుకున్న వ్యవస్థలు ఎప్పటికప్పుడూ మారుతూ పరిపక్వంగా రూపొందుతున్నాయనే అర్థం. మన సంప్రదాయం సహనాన్ని బోధిస్తుంది. మన తత్వశాస్త్రం సహనాన్ని బోధిస్తుంది. మన రాజ్యాంగం సహనాన్ని ఆచరిస్తుంది. దీన్ని పలుచన చేయవద్దు.. అని జస్టిస్ చిన్నప్పరెడ్డి అన్నారు. ఎందుకో కానీ దేశంలో అసహనం విపరీతంగా పెరిగిపోతున్నదని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.


మన దేశానికి ప్రజాస్వామ్యం కొత్తది కాదని, బుద్ధుడి కాలంలోనే సంఘాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలను పాటించాయని అంబేడ్కర్ రాజ్యాంగ సభలో చెప్పారు. తమిళనాడులో కంజీవరం సమీపంలోని గ్రామాల్లో అనేక ఆలయాల గోడలపై బ్యాలెట్ బాక్స్, బ్యాలెట్ పేపర్‌ల గురించి ప్రస్తావన ఉన్నదని టంగుటూరి ప్రకాశం కూడా రాజ్యాంగ సభలో తెలిపారు. ఆధునిక ప్రజాస్వామ్య పద్ధతులు దేశానికి కొత్త కాదని అన్నారు. నిజానికి జనసంఘ్ సిద్ధాంతకర్త దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రజాస్వామ్యం సహజంగా ఇమిడిపోయినందువల్లే దేశం ఇంత సజావుగా నడుస్తోందని అభిప్రాయపడ్డారు. వేదిక్ సభలు, సమితిలు ప్రజాస్వామ్యయుతంగా జరిగేవని ఆయన చెప్పారు. దేశ సమైక్యతకు ప్రజాస్వామ్యం ఒక సమర్థమైన సాధనమని దీనదయాళ్ చెప్పారు. కాని ఈ ప్రజాస్వామిక స్ఫూర్తి రోజురోజుకూ తగ్గిపోతోందా?

నిజానికి జస్టిస్ గవాయ్ ఎక్కడా ఒక మతాన్ని విమర్శించినట్లు దాఖలాలు లేవు. మధ్యప్రదేశ్‌లో ఖజురాహో శిల్ప కళాఖండాలలో భాగమైన జవారీ ఆలయంలో ఏడు అడుగుల ఖండిత విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను పూర్తిగా ఉటంకించనందువల్లే ఈ వివాదం తలెత్తింది. ఈ విగ్రహాన్ని మళ్లీ యథాతథంగా పునర్నిర్మించి ప్రాణప్రతిష్ఠ చేయాలని రాకేశ్ దలాల్ అనే వ్యక్తి గత కొంతకాలంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకూ, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకూ వినతిపత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. చివరకు సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు. ‘ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోనిది. అలాంటిది ఆ సంస్థ అనుమతిస్తుందో లేదో తెలియదు. అందులో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సెప్టెంబర్ 16న స్పష్టంగా చెప్పారు. అంతటితో ఊరుకోకుండా ‘వెళ్లి మీ దేవుడినే ఏమైనా చేయమని అడగండి.. మీరు విష్ణుభగవానుడి పరమభక్తుడైతే ఆయననే ప్రార్థించి ధ్యానం చేయండి.. లేకపోతే ఖజురాహోలో అతి పెద్ద శివలింగం ఉన్నది కదా.. మీరు శైవమతానికి వ్యతిరేకం కాకపోతే అక్కడకు వెళ్లి ప్రార్థన చేయొచ్చు’ అని సలహా ఇచ్చారు. గవాయ్ మనస్ఫూర్తిగానే ఈ సలహా ఇచ్చి ఉండవచ్చు. ఖజురహో నిజానికి ఒక తత్వానికి కట్టుబడి ఉన్నది కాదు. అక్కడి శిల్పాల్లో వైష్ణవం, శైవంతో పాటు, జీవితంలో ఇమిడిపోయిన ప్రేమ, ప్రకృతి, కామం, స్వలింగ సంపర్కం, తంత్ర మొదలైనవన్నీ మిళితమై ఉంటాయి. మొత్తం భారతీయ జీవన విధానం, సంస్కృతి, స్వేచ్ఛలకు అది ప్రతిబింబం. దట్టమైన అడవుల్లో మునిగిపోయిన ఈ అమూల్యమైన శిల్పసంపద గురించి మనకు బ్రిటిష్ వారే తెలిపారు. మతపరమైన భావోద్వేగాల కంటే మన భారతీయ సంస్కృతిలోని ఔన్నత్యానికి మనం ప్రాధాన్యత నీయాల్సిన అవసరం ఉన్నది.


నిజానికి గవాయ్ వ్యాఖ్యలు సంచలనం కావాల్సిన అవసరం లేదు. కేసుల విచారణ సందర్భంగా న్యాయ మూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. అయోధ్య కేసులో విచారణ జరుగుతున్నప్పుడు శ్రీరాముడు కచ్చితంగా ఎక్కడ పుట్టారో చెప్పగలరా? రఘువంశానికి చెందినవారెవరైనా అక్కడున్నారా? ఆ ప్రాంతానికి దైవత్వం ఎందుకు ఆపాదిస్తున్నారు? అన్న ప్రశ్నలు వేశారు కాని అప్పుడెవరూ న్యాయమూర్తులను నిందించలేదు. శబరిమల కేసులో సుప్రీంకోర్టు భక్తి శ్రద్ధల విషయంలో లింగవివక్ష కూడదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎన్నో వాద వివాదాలు జరిగాయి. నాడు జస్టిస్ గొగోయ్, జస్టిస్ దీపక్ మిశ్రాలపై ఎవరూ దాడి చేయలేదు. కాని ఇప్పుడెందుకు గవాయ్‌పై దాడి జరిగింది? ఆయన దళితుడైనందుకా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. జస్టిస్ గవాయ్ సాధారణ నేపథ్యం ఉన్న వ్యక్తి కాదు. ఆయన తండ్రి ఆర్ఎస్ గవాయ్ అంబేడ్కర్‌తో పాటు బౌద్ధమతాన్ని స్వీకరించిన వేలాది మందిలో ఒకరు. జస్టిస్ గవాయ్ కూడా బౌద్ధమతస్థుడే. నిజానికి బుద్ధుడిని కూడా దశావతారాల్లో ఒకరిగా హిందూమతం స్వీకరించింది.

జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు చేసిన రోజునుంచే సోషల్ మీడియాలో ఆయనపై దాడులు మొదలయ్యాయి. నిజానికి ఆయన మాటల్ని ఎవరూ పూర్తిగా ఉటంకించలేదు. ప్రధాన న్యాయమూర్తి హిందూ మనోభావాలను దెబ్బతీశారని, సీజేఐ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఒక న్యాయవాది ఆయనకు లేఖ కూడా రాశారు. ఇలాంటి వ్యాఖ్యలు హిందూయేతర మతాలపై ఆయన చేయగలరా? అని ప్రశ్నించిన వారూ ఉన్నారు. విషయంలోని తీవ్రతను గ్రహించిన జస్టిస్ గవాయ్ తన మాటలకు సెప్టెంబర్ 18న కోర్టులోనే వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో తన మాటలను వక్రీకరించారని, తాను అన్ని మతాలనూ గౌరవిస్తానని చెప్పారు. కోర్టులోనే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సోషల్ మీడియాలో అతిగా ప్రతిస్పందనలు వస్తున్నాయి అని చెప్పారు.


కానీ సోమవారం కోర్టు గదిలో రాకేశ్ కిశోర్ అనే సీనియర్ న్యాయవాది తన స్పోర్ట్ షూస్‌లో ఒకటి విప్పి ప్రధాన న్యాయమూర్తిపై విసిరేందుకు ప్రయత్నించడంతో భద్రతా సిబ్బంది ఆయనను నిలువరించారు. సనాతన ధర్మాన్ని అవహేళన చేశారని ఆయన ఆరోపించారు. అయితే ఆయనను వదిలివేయమని జస్టిస్ గవాయ్ చెప్పడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేయకుండా వదిలివేశారు.. భావోద్వేగాల వల్ల జరిగిన సంఘటనలను మరింత ప్రేరేపించడం మంచిది కాదని ఆయన భావించి ఉండవచ్చు. గతంలో బాబ్రీ మసీదు కట్టడాన్ని కూల్చి వేయకుండా కాపాడతానని మాట ఇచ్చి మరీ విఫలమైన ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌ను లాంఛనంగా ఒకరోజు నిర్బంధించి రూ. 20వేల పైన్ వేసి వదిలేసిన సంఘటన ముందు ఇదెంత? నిజానికి కేంద్రంలోనూ, మధ్యప్రదేశ్ లోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నది. మధ్యప్రదేశ్‌లో ఖజురాహో ఆలయాల సముదాయాల్లో దెబ్బతిన్న విష్ణుమూర్తి ప్రతిమ నొకదానికి ప్రాణప్రతిష్ఠ చేసి అతి పెద్ద ఆలయాన్ని నిర్మించడం బీజేపీ తలుచుకుంటే పెద్ద పని కాదు. కాని అక్కడ పురాతత్వ శాఖకు ఏ నిబంధనలు అడ్డువచ్చాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.

నిజానికి ఇవాళ దేశ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం వ్యవస్థలు ఎంతో కొంత సవ్యంగా నడుస్తున్నందువల్లే దేశం చెక్కుచెదరకుండా ఉన్నది. ఎమర్జెన్సీలో రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించారు. దేశంలో అనేక చోట్ల నియంతృత్వ ప్రభుత్వాలను ప్రజలు మార్చివేశారు. రాజ్యాంగ బద్ధంగా నిర్వహించిన ఎన్నికల వల్లే ఇవాళ మెజారిటీ ప్రజలు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. మూడు సార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి రాజ్యాంగం ఏర్పర్చిన వ్యవస్థలే కారణం. ఈ విషయం తెలిసినందువల్లే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించారు. ప్రతి భారతీయుడికీ ఈ చర్య ఆగ్రహం తెప్పించిందని, ఇలాంటి గర్హనీయమైన చర్యలకు మన సమాజంలో స్థానం లేదని అన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ కూడా ఈ చర్య నిందనీయమని, ఏ భారతీయుడూ దీనికి మద్దతు నీయడని చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సంఘటనలో వ్యవహరించిన తీరు చాలా హుందాగా ఉన్నదని ఆయన అన్నారు. వాట్సాప్ యూనివర్సిటీల విద్యే అసలైన విద్యగా చలామణి అవుతున్న కాలంలో అదే రాజ్యాంగం ప్రమాదంలో పడకుండా, రాజ్యాంగ విలువలైన న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అధికారంలో ఉన్నవారిపై ఉంటుంది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

విడిచి పెట్టం.. పేర్నినానికి మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్

జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరు.. సోమిరెడ్డి సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2025 | 02:02 AM