Share News

Sonia Gandhi Legacy: తెలంగాణతో సోనియా బంధం అపురూపం

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:17 AM

అధికారమే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందివచ్చిన అధికారాన్ని తృణపాయంగా త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచారు. నాలుగు దశాబ్దాల రాజకీయ...

Sonia Gandhi Legacy: తెలంగాణతో సోనియా బంధం అపురూపం

అధికారమే పరమావధిగా భావిస్తున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందివచ్చిన అధికారాన్ని తృణపాయంగా త్యాగం చేసిన సోనియాగాంధీ, దేశ రాజకీయాలకే ఆదర్శంగా నిలిచారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో 22 ఏండ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించిన సోనియాగాంధీ లౌకికవాదానికి కట్టుబడుతూ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వారసత్వాన్ని కొనసాగించారు. భర్త రాజీవ్‌గాంధీకి తోడుగా అమేథి నియోజకవర్గం బాగోగులను చూసుకుంటూ ప్రజలతో మమేకమై, సమస్యలను పరిష్కరిస్తూ వారి ప్రేమాభిమానాలు పొందారు.

ఇందిరాగాంధీ అమానవీయ హత్యతో సోనియాగాంధీ షాక్‌ అయ్యారు. అనంతరం రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాక ఆమెలో ఒకింత ఆందోళన నెలకొన్నది. 1991 మే 21న రాజీవ్‌గాంధీ తమిళనాడులో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో హత్యకు గురయ్యారు. భర్త మరణం తర్వాత– కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానమంత్రి కావాలని యావత్‌ దేశం, కాంగ్రెస్‌ పార్టీ కోరినా... సోనియాగాంధీ సున్నితంగా తిరస్కరించి, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత ధైర్యం తెచ్చుకుని, పిల్లలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు తన భర్త, అత్త ధైర్యసాహసాలు, వారు చేసిన త్యాగాలు నూరిపోసి గొప్ప దేశ నాయకులుగా తీర్చిదిద్దారు.

‘రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌’ చేపట్టే పలు సేవా కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. బాబ్రీ మసీద్‌ అల్లర్లు, గుజరాత్‌ అల్లర్ల సమయంలో దేశంలో లౌకికవాదానికి ముప్పు వాటిల్లిందని ఆమె తల్లడిల్లిపోయారు. వీటితో పాటు సునామీ విపత్తుతో అనాథలైన పిల్లలకు చదువు చెప్పించడంతో సహా అన్ని రకాల సహాయసహకారాలను ఆమె ఫౌండేషన్‌ తరఫున అందించారు. దివ్యాంగులకు ఫౌండేషన్‌ తరఫున అనేక కార్యక్రమాలు రూపొందించారు.


దేశంలో కుల, మత రాజకీయాలు పెరిగిపోయి ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం బలహీనపడడంతో దేశ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఒత్తిడి తేవడంతో సోనియాగాంధీ 1997లో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 1998లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. 1999లో లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ప్రజల గొంతుకయ్యారు. ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతగా ఆమె అలుపెరగని పోరాటం చేశారు. సోనియాగాంధీ 2003లో దేశవ్యాప్తంగా దాదాపు 30 వేల మైళ్లు ప్రయాణించి, సుమారు 150 ర్యాలీల్లో పాల్గొన్నారు.

2004 ఎన్నికలలో ‘‘కాంగ్రెస్‌ కీ హాత్‌.. గరీబోం కీ సాత్‌’’ (కాంగ్రెస్‌ హస్తం.. పేదల నేస్తం) అనే నినాదంతో దేశ ప్రజల మనస్సులను చూరగొని, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమి కేంద్రంలో అధికారం చేపట్టడానికి సోనియా ఎంతో కృషి చేశారు. వామపక్ష పార్టీల మద్దతుతో అప్పుడే ఆమెకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ సోనియాపై కక్షగట్టి ‘విదేశీ మహిళ’ అంటూ బీజేపీ కుట్రలు పన్నింది. ఒక భారతీయురాలిగా దేశాభివృద్ధి కోసం కృషి చేస్తాను, నాకు పదవుల కంటే దేశం సుభిక్షంగా ఉండడమే ఇష్టం– అని తలచిన సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. దేశాభివృద్ధి కోసం అనుభవజ్ఞుడైన, నిజాయతీకి మారుపేరైన ఆర్థికవేత్త డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ను ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు ఒప్పించి 10 సంవత్సరాల పాటు ఆయనకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.

దేశాభివృద్ధికి సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ వంటి పథకాలు తీసుకురావడానికి కృషి చేసిన సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని, ఆమె ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని బీజేపీ ఆరోపిస్తే, ఆమె ఎన్‌ఏసీ చైర్మన్‌ పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేసి, పదవులు తనకు తృణపాయమని మరోసారి నిరూపించారు. సోనియాగాంధీ యూపీఏ చైర్మన్‌గా ఉన్నప్పుడే చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెట్టారు. ఆమె కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్‌, తొలి దళిత మహిళా లోక్‌సభ స్పీకర్‌గా మీరా కుమార్‌ ఎంపికే మహిళలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనం.

తెలంగాణ రాష్ట్రానికి, సోనియాగాంధీకి మధ్య ఉన్న బంధం వెలకట్టలేనిది. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి జరిగిన ఉద్యమాలు, రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛను గుర్తించిన సోనియాగాంధీ 2004లో కరీంనగర్‌ వేదికగా తెలంగాణ ఏర్పాటుపై హామీ ఇచ్చారు. 2009 డిసెంబర్‌ 9న హోం మంత్రి చిదంబరం ద్వారా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటింపజేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయకుండా 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఈ ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌

టీపీసీసీ అధ్యక్షులు

(నేడు సోనియాగాంధీ పుట్టినరోజు)

ఈ వార్తలు కూడా చదవండి..

రామ్మోహన్ నాయుడికి ప్రధాని, హోం మంత్రి ఫోన్..

వికసిత్ భారత్ దిశగా తెలంగాణ: గవర్నర్ జిష్టు దేవ్ వర్మ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2025 | 02:17 AM