Share News

ఏకాంతం

ABN , Publish Date - Feb 10 , 2025 | 06:36 AM

కిటికీ లోంచి వచ్చి పడుతున్న చీకటితో గదిలో గుడ్డిదీపం తగాదా పడుతోంది దూరంగా ఎక్కడో కురుస్తున్న వర్షాన్ని వెక్కిరింతగా మా ఊరికి ఉరుమి చెప్తోంది నింగి...

ఏకాంతం

ప్రియ పద్యం

కిటికీ లోంచి వచ్చి పడుతున్న చీకటితో

గదిలో గుడ్డిదీపం తగాదా పడుతోంది

దూరంగా ఎక్కడో కురుస్తున్న వర్షాన్ని

వెక్కిరింతగా మా ఊరికి ఉరుమి చెప్తోంది నింగి

పగటిపోరాటంలో గెలవలేని ఓ బక్కకుక్క

రాత్రి చీకట్లో పౌరుషంగా రంకెలేస్తోంది

వీధిలో ఒంటరిగా

లాభనష్టాలు లోకం లెక్కలు

ప్రేమ – విరహం హృదయానివి

ప్రేమలో ఓడిపోనీ

అది లోకంలో విజయాలన్నిటి కంటే విలువైనది

ఒట్టి వ్యథ, దుఃఖం, కన్నీళ్ళు, కవిత్వం

ప్రేమ వల్ల అర్థవంతమయ్యాయి

ప్రేమకోసం లోకంలో వెతుకుతున్నావా?

పాపం అది ప్రేమలో అనాథ బిచ్చగత్తె

పొలమారి గొంతు అడ్డం పడ్డప్పుడు

అన్నీ నీళ్ళ కుండలుగానే తోస్తాయి

లోపల ప్రేమ పొలమారినప్పుడే

మనసు మరో మనసు కోసం తడుముకుంటుంది

వచ్చిపోయే వలసపక్షుల గుడారం–చెట్టుకి

దాని నీడ మాత్రమే తన శాశ్వత తోడని

ఎవరూ చెప్పనక్కర్లేదు

తాటిశెట్టి రాజు


ఇవి కూడా చదవండి

Delhi Election Results: ఆ మంత్రం భలే పని చేసింది.. బీజేపీ గెలుపులో సగం మార్కులు దానికేనా..

Delhi Election Result: కాంగ్రెస్‌కు మళ్లీ ``హ్యాండ్`` ఇచ్చిన ఢిల్లీ.. మరోసారి సున్నాకే పరిమితం..

Priyanka Gandhi: విసిగిపోయిన ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటేశారు: ప్రియాంక గాంధీ

For More National News and Telugu News..

Updated Date - Feb 10 , 2025 | 06:37 AM