Share News

Social Work: సమాజాన్ని చక్కదిద్దడమే సోషల్ వర్క్

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:37 AM

వందేళ్ల స్వాతంత్ర్యానికి దగ్గర పడుతున్నా నేటికీ సమాజంలో అనేక రుగ్మతలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నా, సమాజంలో ఏదో ఓ మూలన...

Social Work: సమాజాన్ని చక్కదిద్దడమే సోషల్ వర్క్

వందేళ్ల స్వాతంత్ర్యానికి దగ్గర పడుతున్నా నేటికీ సమాజంలో అనేక రుగ్మతలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు తమవంతు ప్రయత్నం చేస్తున్నా, సమాజంలో ఏదో ఓ మూలన విభిన్నమైన అలజడులు, ఆందోళనలు, హత్యలు, లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయిదేళ్ల పాప నుంచి వివాహిత మహిళల వరకూ ఇందుకు మినహాయింపు లేదు. ఈ మధ్య పోక్సో కేసులు అధికం అయ్యాయంటే సమాజంలో నరరూప రాక్షసులు ఎంతగా పెరిగి పోయారో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి అనేక సమస్యలు మానవ సమాజాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని నిరోధించడానికి ఇప్పటికే అనేక సంస్థలు పని చేస్తున్నా, పూర్తి స్థాయిలో నిర్మూలన జరగడం లేదు. ఇటువంటి అనేక గత్తరల నుంచి సమాజాన్ని చక్కదిద్దడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా సామాజిక సేవ (సోషల్ వర్క్) చదివిన వారికి ఆయా సంస్థల్లో అవకాశాలు ఇవ్వడం వల్ల పరిస్థితులను అదుపులోకి తీసుకురావొచ్చు.

పెరిగిన సాంకేతికతోనూ, స్మార్ట్ ఫోన్ వల్ల యువత అనేక దారుణాలకు కారణం అవుతోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌తో ప్రాణాలు తీసుకుంటున్నారు. వివాహ బంధాలు సైతం సరైన అవగాహన లేక క్షణికావేశంతో విడాకులకు దారి తీస్తున్నాయి. ఇటువంటి అనేక రుగ్మతలను రూపుమాపాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయి పరిశీలనతో కూడిన సోషల్ వర్క్ చదివిన విద్యార్థులను ఇందుకు ఉపయోగించుకోవచ్చు. వీరు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ కోర్సులో నేర్చుకుంటారు. ఇప్పటికే వీరు హెచ్‌ఐవీ బాధితుల కోసం కౌన్సిలర్లుగా పనిచేస్తూ, వారిలో మానసిక స్థైర్యం నింపేలా కృషి చేస్తున్నారు. ఈ విధానాన్ని అన్ని రంగాల్లో అమలు చేస్తే సమాజంలో మరింత గుణాత్మక మార్పు తీసుకురావొచ్చు.


దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల్లో విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మరోపక్క విపరీతంగా పెరిగిపోతున్న సోషల్ మీడియా... దానివల్ల జరిగే మోసాలతో యువత, విద్యార్థులు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత చిన్న వయసులోనే నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఉన్నాయి. విద్యార్థుల బలవన్మరణాలు కలవరపెడుతున్న తరుణంలో, వీటిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ‘పాఠశాలలు, విద్యాలయాల్లో మానసిక కౌన్సిలర్లను నియమించాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్నిబట్టి సామాజిక కార్యకర్తల, కౌన్సిలర్ల ఆవశ్యకతను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక దృఢత్వం కోసం కౌన్సిలర్లను ఏర్పాటు చేయడానికి సోషల్ వర్కర్లను నియమించాలి. తద్వారా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణాలను అడ్డుకోవచ్చు. ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించి, సోషల్ వర్క్ విద్యనభ్యసించిన వారితో ఈ పోస్టులను భర్తీ చేయాలి.

సంపత్ గడ్డం

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:37 AM