Share News

Shankar and Sarangapani: జానపదానికి వన్నెతెచ్చిన ధ్రువతారలు

ABN , Publish Date - Aug 21 , 2025 | 06:03 AM

తెలుగు జానపద కళా చరిత్రలో శంకర్‌, సారంగపాణిలది సువర్ణాధ్యాయం. తమ మధురమైన జానపద పాటలతో తెలంగాణ కీర్తిని దశదిశలకు వ్యాపింపజేసిన కళాదిగ్గజాలు వారు. వరంగల్‌ జిల్లా కేంద్రంగా సృజించి...

Shankar and Sarangapani: జానపదానికి వన్నెతెచ్చిన ధ్రువతారలు

తెలుగు జానపద కళా చరిత్రలో శంకర్‌, సారంగపాణిలది సువర్ణాధ్యాయం. తమ మధురమైన జానపద పాటలతో తెలంగాణ కీర్తిని దశదిశలకు వ్యాపింపజేసిన కళాదిగ్గజాలు వారు. వరంగల్‌ జిల్లా కేంద్రంగా సృజించి, ప్రచారంలో పెట్టిన పాటలు వందలాదిగా ఉన్నాయి. ముఖ్యంగా యువతరానికి 1970‌‌–80 దశకాల్లో ఈ ఇద్దరూ ఒక రోల్‌ మోడల్‌. తెలంగాణ పల్లెల్లో పాటలేని ఊరు ఉండదు. మట్టిబిడ్డల దగ్గర ఉన్న జానపదాలను నిశితంగా పరిశీలించి, వాటిని తమ గొంతుల ద్వారా మరింత వన్నెకెక్కించారు.

వీరి కళాబృందంలో ఆర్కెస్ట్రాతో పాటు మైమ్‌, మిమిక్రీ వంటి కళలు కూడా ఉండేవి. ఎక్కడ ప్రోగ్రాం చేసినా ప్రజలను అమితంగా ఆకట్టుకునేవారు. పాటకు, మాటను, ఆటను జతచేసి ఉర్రూతలూగించారు. పల్లెటూరు ప్రజల అమాయకత్వాన్ని వీరి ‘‘అమ్మలారా... అయ్యలారా’’ పాట దృశ్యమానం చేసింది. పాటలో పల్లెటూరి యువకుడి కష్టాలను, పట్నపోళ్లు చేసే మోసాలను ఏకకాలంలో ఒక బ్యాలెగా రూపొందించి ప్రదర్శించేవారు. మూడు దశాబ్దాల పాటు వరంగల్‌ కేంద్రంగా ఏ సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఎవరో ఒకరు ఈ బ్యాలెను ప్రదర్శిస్తూనే వచ్చారు. అలాగే అత్తరుసాయబు, ఒల్లానోయి దేవా... ఓ చెల్లెమ్మా వంటి పాటలు జనాలను ఒక ఊపు ఊపిపడేశాయి. ఇక ‘‘మియ్యారు గుర్రాలు, మాయారు గుర్రాలు... పన్నెండు గుర్రాల బగ్గిపోతంది’’ అని శంకర్‌ పాడిన పాట ఇప్పటికీ ఏ జానపద ప్రేమికుడూ మరిచిపోలేడు. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన ఎన్వీ రమణ సైతం ఒక సందర్భంలో శంకర్‌, సారంగపాణిల పాటలంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అని ప్రకటించారు. అట్లా జానపదానికి కేరాఫ్‌గా శంకర్‌, సారంగపాణి ఎదిగి వచ్చారు. వీరిరువురు పాటెత్తుకుంటే జనాలు మైమరచిపోయేవారు.


శంకర్‌, సారంగపాణిలు వరంగల్‌లో స్టార్‌ సింగర్స్‌గా ఎదిగి వచ్చిన కాలం కూడా కీలకమైంది. అప్పటికే విప్లవోద్యమం వరంగల్‌ను కుదిపేస్తున్న కాలం. ఒకవైపు 1970లలో జననాట్యమండలి మొదలయ్యి యువతను పెద్దమొత్తంలో ఆకట్టుకుంటున్నది. అలాంటి సమయంలో జననాట్యమండలి పాటకు సమాంతరంగా జానపద పాటలతో పేరు తెచ్చుకున్నారు ఈ కళాకారుల ద్వయం. ఆ రోజుల్లో ఇది సాహసమనే చెప్పాలి. విప్లవోద్యమంలో ఎంతోమంది అప్పటికి మరణిస్తున్న కాలమది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానిక సీపీఐ నాయకుడు బి.ఆర్‌. భగవాన్‌ దాస్‌ ఈ ఇద్దరి మీద ఆ ప్రభావం పడకుండా కాపాడాడని ఇప్పటికీ అక్కడి ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. ప్రజలందరు జననాట్యమండలి పాటకు వంత పాడుతున్న కాలంలో, తమ సొంత గొంతుకతో ప్రజలను ఆకట్టుకున్న జానపద కళాకారులు శంకర్‌, సారంగపాణి.

తమ సంగీతంతో బాలీవుడ్‌ను ఏలిన శంకర్‌, జైకిషన్‌ ద్వయంలా తెలంగాణను ఈ శంకర్‌, సారంగపాణిల జంట ఏలిందంటే అతిశయోక్తి కాదు. కాకతీయుల రాజధానిగా ఉన్న వరంగల్‌, శాతవాహనుల రాజధానిగా ఉన్న కరీంనగర్‌ల నుంచి అనేకమంది కళాకారులు వచ్చారు. అలా వచ్చిన వారి మీద శంకర్‌, సారంగపాణిల పాటల ప్రభావం ఎంతగానో ఉంది. రెండు మూడు తరాలను ప్రభావితం చేసిన కళాశిఖరాలు వీరు ఇరువురు. ఎలాంటి యూట్యూబ్‌లు, సోషల్‌ మీడియాలు లేని కాలంలో వీరి పాటలు పల్లెపల్లెకు క్యాసెట్లు, మైకుసెట్ల రూపంలో వెళ్లాయి. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా అక్కడ వీరి పాట మార్మోగాల్సిందే.


శంకర్‌ నేపథ్య గాయకునిగా సినిమాల్లో కొన్ని పాటలు ఆలపించాడు. ఆర్‌. నారాయణమూర్తి అందుకు అవకాశం కల్పించాడు. ఎంతటి హైపిచ్‌ పాటనైనా అవలీలగా పాడి ఆశ్చర్యపరచడం శంకర్‌కు ‘గటకతో పెట్టిన విద్య’. ఒక సందర్భంలో సినీగాయనీ గాయకులతో పాట పాడడానికి స్టూడియోకి వెళ్లాడు శంకర్‌. ఇతడి వాలకం చూసి అక్కడున్నవారు తక్కువ అంచనా వేశారు. కానీ తర్వాత ఆయన గొంతు విప్పి ‘‘బండెనుక బండికట్టి...’’ పాట అందుకుంటే స్కేల్‌ పతాకస్థాయి దాటింది. దాంతో సదరు సినీ గాయకులు శంకర్‌కు పాదాభివందనం చేశారు. ఇక సారంగపాణి గాయకుడిగానే కాక వందలాది పాటలకు స్వరకల్పన చేసి బాణీలు కట్టిన అనుభవంతో సంగీత దర్శకునిగా మారాడు. అదే సమయంలో రైలు ప్రమాదంలో కనుమూశాడు. ఇవాళ ఈ ఇద్దరు మన ముందు లేకపోవచ్చుగానీ, వారి స్వరం మాత్రం ఇంకా కళాకారుల గుండెల్లో మార్మోగుతూనే ఉంది.

పసునూరి రవీందర్‌

తెలంగాణ సాంస్కృతికశాఖ సలహామండలి సభ్యుడు

(నేడు హన్మకొండ కాళోజీ కళాక్షేత్రంలో శంకర్‌, సారంగపాణి యాదిలో

‘జానపద జాతర’)

ఈ వార్తలు కూడా చదవండి..

వన్ ఫ్యామిలీ.. వన్ ఎంట్రప్రెన్యూర్ మన లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆర్జీవీ 'వ్యూహం' సినిమా నిర్మాత దాసరి కిరణ్‌‌ను అరెస్ట్

Read Latest AP News and National News

Updated Date - Aug 21 , 2025 | 06:03 AM