Share News

Sanghs Role in Character Building: సద్భావన నిర్మాణశక్తి

ABN , Publish Date - Oct 02 , 2025 | 04:07 AM

అది 1961వ సంవత్సరం. కబడ్డీ బాగా ఆడేవారు సంఘ్ శాఖలో ఉన్నారని, శరీర దారుఢ్యం కోసం వారు నిత్యం ఆటలు ఆడుతుంటారని తెలిసి అక్కడకు వెళ్లాను. ఆ సమయంలో నాకు స్ఫూర్తిప్రదాత అయిన భోగాది...

Sanghs Role in Character Building: సద్భావన  నిర్మాణశక్తి

అది 1961వ సంవత్సరం. కబడ్డీ బాగా ఆడేవారు సంఘ్ శాఖలో ఉన్నారని, శరీర దారుఢ్యం కోసం వారు నిత్యం ఆటలు ఆడుతుంటారని తెలిసి అక్కడకు వెళ్లాను. ఆ సమయంలో నాకు స్ఫూర్తిప్రదాత అయిన భోగాది దుర్గాప్రసాద్ అక్కడే ఉన్నారు. నన్ను కూడా ఆడమని ప్రోత్సహించారు. అయితే అది బయటవారికి కాదేమో అనుకున్న నాకు, ‘ఇక్కడ అలాంటి భేదభావాలేం ఉండవు, ఎవరైనా ఆడొచ్చు’ అని తెలిపారు. ఆ స్ఫూర్తి నన్ను ఆకట్టుకుంది. తర్వాత సంఘ్ సభ్యునిగా మారి, మార్గదర్శనం పొందాను. ఈ అడుగు నన్ను విశాలమైన ఆలోచనల దిశగా ముందుకు నడిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో నా ఉన్నతికి సంఘం ఇచ్చిన సంస్కారం, సంఘం నేర్పిన జాతీయ భావం, సామాజిక ఐకమత్యం, వ్యక్తిగత సౌశీల్యం పెంచుకోవడమే కారణమని సగర్వంగా చెప్పగలను. నేనే కాదు ప్రధాని నరేంద్ర భాయ్ మోదీ మొదలుకుని ఎందరో కేంద్రమంత్రుల ఎదుగుదలకు సంఘ్ ఇచ్చిన సౌశీల్యం, ప్రేరణే ప్రధాన కారణం.

శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే

ధ్యానాత్‌ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరమ్

భగవద్గీతలో 12వ అధ్యాయంలోని ఈ శ్లోకంలో త్యాగం గొప్పతనాన్ని గురించి పరమాత్ముడు వివరించారు. ‘అవివేకంతో కూడిన అభ్యాసం కంటే జ్ఞానం మేలు. జ్ఞానం కంటే ధ్యానం ఉత్తమం. ధ్యానం కంటే కర్మఫల త్యాగం మంచిది. ఆ త్యాగం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.’ అని ఈ శ్లోకం భావం.


ప్రపంచవ్యాప్తంగా వివిధ ఆశయాలతో కూడిన అనేక సంస్థలు ఉన్నాయి. అయితే వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్‌) త్యాగాలకు సాటిరాగల మరో సంస్థ మనకు కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలే ఆలంబనగా, సామాజిక జీవనంలో ఏర్పడిన లోటుపాట్లను అధిగమిస్తూ, జీవన విధానంలో దృఢత్వం, సమాజం కోసం అంకితమైన వ్యక్తిత్వంతో ఓ విలక్షణమైన కార్యదీక్ష కలిగిన క్రమశిక్షణాయుత సమూహం ఆరెస్సెస్‌ సొంతం. అందుకే, కాలగమనంలో అవరోధాలను, అణచివేతలను అధిగమిస్తూ... ప్రతికూల పరిస్థితుల్లో సైతం తన ప్రాబల్యాన్ని విస్తరిస్తూ, భారతీయ సంస్కృతిలోని సనాతన మూలాల నుంచి జాతీయవాద భావనతో ఆవిర్భవించి, మానవతా వాదాన్ని ఆవిష్కరిస్తోంది.

భారతీయ మూలాల్లో బలంగా విస్తరించిన సంస్కృతి విలువలను తెలియజేస్తూనే జాతీయ సమైక్యత, నైతిక విలువలు, సామాజిక సామరస్యం వంటి అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఆరెస్సెస్‌ ఓ శతాబ్దాన్ని పూర్తి చేసుకుంది. సంఘ్‌ కృషి కారణంగా దేశభక్తి ఒక ప్రాథమిక విలువగా అభివృద్ధి చెందిందని చెప్పడానికి గర్విస్తున్నాను. ‘సహనావవతు’ అనే సూత్రాన్ని అనుసరించి లక్షలాది మంది కలిసి పనిచేసే స్ఫూర్తి మనసుల్లో విస్తరింపజేసింది. దేశభక్తి అంటే జెండా ఎగరేయడం, దేశభక్తి గీతాలు పాడడం, ఐక్యత ప్రతిజ్ఞ చేయడం కాదని, ఈ స్ఫూర్తి మన ప్రవర్తనలో ప్రతిబింబించి, సమాజంలో పరివర్తనకు బీజాలు వేయాలన్నది ఆరెస్సెస్‌ లక్ష్యం.

స్వాతంత్ర్యం ముందు కాలం నుంచి ఆరెస్సెస్ వ్యవస్థాపకులు డా.హెడ్గేవార్, ఆ తర్వాతి సంఘచాలక్ గురు గోల్వాల్కర్ దేశ సమగ్రతను కాపాడేందుకు విశేషంగా కృషి చేశారు. ఆరెస్సెస్‌ శాఖల్లో వ్యక్తిగత నైతిక విలువలకు, క్రమశిక్షణకు అత్యున్నత ప్రాధాన్యం ఇచ్చారు. సాధారణ జీవనం గడుపుతూ, సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో అరమరికలు లేకుండా కలిసి పనిచేసే అలవాట్లను ప్రేరేపించారు. ఈ స్ఫూర్తి కారణంగానే వందలాది సంఘ్ ప్రేరేపిత సంస్థలు భారతదేశమంతటా పనిచేస్తున్నా ఎక్కడా అవినీతి, బంధుప్రీతి ఆరోపణలు చెలరేగడం కనిపించదు. పైగా, వాటి పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం స్పష్టంగా కనిపిస్తుంది. కులం, వర్గం, మతం, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు సమైక్యంగా ఉండాలని మాటలు చెప్పడం కాకుండా, ఆచరణలో ఆ విధంగా జీవించే వాతావరణం ఏర్పాటు చేయడంలో ఆరెస్సెస్‌ను మించిన మరో సంస్థ లేదని చెప్పవచ్చు.


యాభై ఏళ్ల క్రితం దేశంలో ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. లక్షమందికి పైగా ప్రతిపక్ష శ్రేణులు, స్వేచ్ఛ కోసం నినదించిన విద్యార్థులు, యువత, ఆరెస్సెస్‌ వంటి సంస్థల కార్యకర్తలతో జైళ్లను నింపేశారు. వారిలో విద్యార్థి నాయకుడినైన నేనూ ఉన్నాను. హద్దుల్లేని ప్రభుత్వ నిర్బంధాలు కొనసాగాయి. ‘ప్రాథమిక హక్కులు అమల్లో లేనందున ప్రభుత్వం ఎవరినైనా కాల్చి చంపినా కోర్టులు ప్రశ్నించలేవ’ని అంటూ ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో ప్రభుత్వ అటార్నీ జనరల్ వాదించారంటే ఎటువంటి నిరంకుశ వ్యవస్థ కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు.

దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించాక ఇందిరాగాంధీ నిషేధించిన తొలి ప్రజాసంస్థ ఆరెస్సెస్‌. 1975 జూన్ 30న నాటి ఆరెస్సెస్‌ సర్ సంఘచాలక్ బాలాసాహెబ్ దేవ్‌‌రస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది జూలై 4న ఆరెస్సెస్‌ను నిషేధించారు. దీంతో ఆరెస్సెస్‌ స్వయం సేవకుల ఇళ్లే ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రాలుగా మారాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు జైళ్లకు, ఇళ్లకు పరిమితమైనప్పుడు ఆరెస్సెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద నిరసన ఉద్యమం నిర్వహించింది. జైళ్లలో ఉన్నవారిలో అత్యధికులు ఆరెస్సెస్‌, సంబంధిత సంస్థలకు సంబంధించినవారే. నవంబర్, 1975లో జరిపిన సత్యాగ్రహ ఉద్యమంలో 45వేల మంది (ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఇంకా ఎక్కువే ఉంటుంది) అరెస్ట్ అయితే, ఇతర సంస్థలకు చెందినవారు నాలుగోవంతు ఉన్నారు.


రాజకీయాల పరిధిని మించి చూడలేని వారికి ఆరెస్సెస్‌ కార్యపద్ధతి అర్థం కాదు. దేశ ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని చూస్తేనే ఈ సంస్థ సిద్ధాంతం అవగతమవుతుంది. ఆవిర్భావం నుంచి రాజకీయ అధికారం కోసం కాకుండా ‘వ్యక్తి నిర్మాణం’ కేంద్రంగా, ప్రజలందరి శ్రేయస్సు కోసం ఆరెస్సెస్ పనిచేస్తోంది. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సహాయం చేయడానికి, సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి, పేద పిల్లలకు విద్య, వైద్య సదుపాయాలు అందించడానికి, వృద్ధులకు సేవ చేయడానికి స్వయం సేవక్‌లు అందించే సేవలలో వివక్ష మచ్చుకైనా కనిపించదు. ‘దృఢమైన భారతదేశ నిర్మాణం అంటే అన్ని మతాల ప్రజలు’ అని సంఘ్ విశ్వసిస్తోంది. ఈ విషయం ప్రస్తుత సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ మాటల్లో చెప్పాలంటే ‘మనకు సమాజంలో సద్భావన అవసరం’.

సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్

ఓం శాంతిః శాంతిః శాంతిః

అన్న శాంతి మంత్రం స్ఫూర్తితో... ప్రజలందరి సుఖసంతోషాలు, ఆరోగ్యం, శుభాలు, ఆనందం కోసం ఆరెస్సెస్‌ భవిష్యత్ భారత నిర్మాణంలో, తిరిగి విశ్వగురువుగా దేశాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి యువతరం సంఘ్ నుంచి స్ఫూర్తి పొంది, సంఘ్ శాఖలకు వెళ్లి, శరీర దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని, సామాజిక చైతన్యాన్ని పొంది... వికసిత భారత నిర్మాణానికి చోదకశక్తులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.

ముప్పవరపు వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి

(నేడు ఆరెస్సెస్‌ శతవార్షికోత్సవం)

ఈ వార్తలు కూడా చదవండి..

పీఎంకు థ్యాంక్స్ చెప్పిన సీఎం

నగదు ఇస్తానన్నా వదల్లేదు.. బాధితురాలి ఆవేదన..

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2025 | 04:07 AM