మాటలు.. మంటలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 04:35 AM
నన్ను క్షమించండి, గతాన్ని వదిలేసి, ఈ కొత్తసంవత్సరంలో అన్ని జాతులవారూ ఒక్కటిగా కలసిమెలసి నడవండి అంటూ నెలక్రితం ఓ అద్భుతమైన ఉపన్యాసం దంచిన మణిపూర్ ముఖ్యమంత్రి...

నన్ను క్షమించండి, గతాన్ని వదిలేసి, ఈ కొత్తసంవత్సరంలో అన్ని జాతులవారూ ఒక్కటిగా కలసిమెలసి నడవండి అంటూ నెలక్రితం ఓ అద్భుతమైన ఉపన్యాసం దంచిన మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ఇంతలోనే అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలో నెలల తరబడిసాగిన హత్యాకాండను ప్రేరేపిస్తున్నది ఆయనేనంటూ మీతీయేతరులు ఆనాదిగా చేస్తూవచ్చిన ఆరోపణలకు ఈ ఆడియోటేపుల వ్యవహారం ఊతాన్నిస్తున్నది. మీతీలను తుపాకులు దోచుకోనివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఆయుధాలను లూటీచేసేందుకు అవకాశమివ్వండి అంటూ ఆయన అధికారులను ఆదేశించినట్టుగా ప్రచారంలో ఉన్న సదరు ఆడియోక్లిప్‌తో బీరేన్‌సింగ్ గొంతు 93శాతం మేరకు సరిపోలిందని ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది. బీరేన్‌తో పాటు ఆయనను ఇంతకాలం వెనకేసుకొస్తున్న బీజేపీ పెద్దలకు కూడా ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ.
ట్రూత్‌ల్యాబ్స్ నివేదికను సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు సమర్పించినప్పుడు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీలో పరీక్షలు జరగాలంటూ అభ్యంతరం వెలిబుచ్చడంతో తదుపరి విచారణ మార్చి 24కు వాయిదాపడింది. కుకీ హ్యూమన్ రైట్స్ సంస్థ దాఖలు చేసిన ఈ కేసు చంద్రచూడ్ కాలంనుంచీ సాగుతోంది. నవంబరు 14న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు అనుమతించినమేరకే ఈ ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీలో టేపుల పరీక్ష జరిగింది. అత్యంత సంక్లిష్టమైన కేసులను పరిష్కరించడానికి సీబీఐ, ఎన్‌ఐఏ ఇత్యాది కేంద్ర దర్యాప్తుసంస్థలు ఇదే ప్రైవేటు ఫోరెన్సిక్ సంస్థమీద ఆధారపడిన విషయం డబుల్ ఇంజన్ సర్కార్ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్‌కు తెలియనిదేమీ కాదు. నిజనిర్ధారణ జరిగిన తరువాత ఇప్పుడు ఆయనకు అసలు ఈ కేసు విచారణ అర్హత సుప్రీంకోర్టుకు లేదని అనుమానం వచ్చింది. మణిపూర్ హైకోర్టుకు దీనిని బదలాయించాలన్న ఆయన విజ్ఞప్తిమీద తదుపరి విచారణలో నిర్ణయం తీసుకుంటామని ప్రస్తుత చీఫ్‌జస్టిస్ అంటున్నారు. కేసు స్వరాష్ట్రానికి తరలిపోయి, వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చినా రావచ్చు. న్యాయప్రక్రియ ఎలా సాగబోతున్నదో, సీల్డుకవర్‌లో సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబరేటరీ సమర్పించబోతున్న నివేదికలో ఏ గుట్టు ఉంటుందో తెలియదు కానీ, నిజం ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న మీతీ బీరేన్ రాజ్యాంగబద్ధంగా నడుచుకోలేదని, తన పదవీ ప్రమాణానికి పూర్తిభిన్నంగా వ్యవహరించారని దాదాపుగా తేలిపోయింది. మూలవాసులను తరిమేసి మణిపూర్‌ను మీతీల రాజ్యంగా మార్చేయాలన్న ఆయన లక్ష్యం మేరకే అగ్గిరాజుకుందన్నది వాస్తవం.
మణిపూర్ హింసాకాండపై విచారణకోసం హోంమంత్రిత్వశాఖ నియమించిన జుడీషియల్ కమిషన్‌కు ‘కోహుర్’ ఈ ఆడియోటేపులను తొలుత అందించింది. ఆ తరువాత నేరుగా సుప్రీంకోర్టుకు సమర్పించినందువల్ల ఈ మాత్రం కదలికైనా వచ్చింది. తరతమభేదాలు లేకుండా ప్రజలను రక్షిస్తానని రాజ్యాంగంమీద ప్రమాణం చేసిన ఓ ముఖ్యమంత్రి తద్భిన్నంగా తనవారిని ఉద్ధరించడానికి మిగతావారిని ఊచకోతకు గురిచేయడం దుర్మార్గం. 21 నెలలుగా మణిపూర్ మండిపోతూంటే, అందుకు కారకుడైన వ్యక్తిని ప్రధాని, హోంమంత్రి వెనకేసుకురావడం ఆశ్చర్యకరం. గ్రామాలకు గ్రామాలు తగలబడిపోతూ, ఊచకోతలు, అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగిపోతున్న తరుణంలో నరేంద్రమోదీ స్వయంగా ఆ రాష్ట్రంలో పర్యటించి, అనుమానాలు, అవిశ్వాసాలతో నిలువుగా చీలి ఉన్న ఆ సమాజంలో శాంతినెలకొల్పే ప్రయత్నం చేస్తారని దేశం ఆశించింది. ఇది జరగకపోగా, మణిపూర్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా బీజేపీ అధినాయకులు విపక్షంమీద విరుచుకుపడుతూ వచ్చారు.
మీతీలు మినహా మణిపూర్‌లోని మిగతా అందరి నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన బీరేన్‌సింగ్ అధికారంలో ఉన్నంతకాలం సమాజంలో సయోధ్య సాధ్యపడదని ఈ ఆడియోటేపులు తేల్చేశాయి. సంఖ్యాబలం ఉన్నప్పటికీ, ఆయనపట్ల పార్టీలో అసంతృప్తి తీవ్రంగా ఉన్నమాట వాస్తవం. ఆయన స్థానంలో కొత్తవ్యక్తిని కూచోబెడితేనే మద్దతు ఉంటుందని మిత్రపక్షాలు కూడా తేల్చేశాయి. ఆడియోటేపుల్లో గుట్టురట్టయిన తరువాత కూడా బీరేన్‌ను తప్పించకపోతే పార్టీ పెద్దలకు మరింత అప్రదిష్ట తప్పదు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: మంత్రులకు ర్యాంకులు.. టాప్.. లాస్ట్ ఎవరంటే..?
Also Read: అక్రమవలస దారులకు సంకెళ్లు.. స్పందించిన విదేశాంగ మంత్రి
Also Read: విద్యుత్ ఛార్జీలు ఒక్క పైసా పెంచడానికి వీలు లేదు
Also Read: మాదాపూర్‌లో మళ్లీ డ్రగ్స్ పట్టివేత
For National News And Telugu News