UK India Trade Deal:: బ్రిటన్‌కు ఆపన్నహస్తం
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:21 AM
పెట్టుబడిదారులు, వణిక్ ప్రముఖులే కాదు, వివిధరంగాల ప్రతినిధులతోకలిపి మొత్తం నూటపాతికమందితో ఆర్థికరాజధానిలో ముంబైలో కాలూనిన బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పెద్ద హడావుడి, ఆర్భాటం లేకుండా వచ్చిన...
పెట్టుబడిదారులు, వణిక్ ప్రముఖులే కాదు, వివిధరంగాల ప్రతినిధులతోకలిపి మొత్తం నూటపాతికమందితో ఆర్థికరాజధానిలో ముంబైలో కాలూనిన బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ పెద్ద హడావుడి, ఆర్భాటం లేకుండా వచ్చిన పనిముగించుకొని వెళ్ళిపోయారు. బెదిరింపులు, గాండ్రింపులు, హూంకరింపులతో అమెరికా అధినేత ట్రంప్ ఎదుటివారిని అవమానిస్తున్న కాలంలో భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ఉపశమనాన్ని ఇస్తోంది. ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగిన భారత్‌తో ఒప్పందాలు కుదర్చుకోవడం బ్రిటన్‌కే ఎక్కువ అవసరమన్న వాదన వాస్తవమే అయినా, సుంకాలూ ప్రతీకార సుంకాల పేరిట మన ఎగుమతులమీద ట్రంప్ కక్షసాధిస్తూ, వీసాల మీద నియంత్రణలతో మన ఉద్యోగులూ విద్యార్థులనూ హింసపెడుతున్న దశలో వాణిజ్యానికే కాదు, మేధస్సుకూ, నైపుణ్యాలకూ అడ్డుగోడలు ఉండబోవని బ్రిటిష్ ప్రధాని హామీ ఇస్తున్నారు.
ప్రపంచంలోనే మన అతిపెద్ద మార్కెట్ బ్రిటన్‌కోసం తలుపులు తెరుచుకుంటోంది. ఆర్థికవ్యవస్థల వరుసలో నాలుగోస్థానంలో ఉన్న భారత్‌తో యూకే చేస్తున్న వ్యాపారం స్వల్పం. భారత్ మొత్తం ఎగుమతుల్లో బ్రిటన్ వాటా మూడుశాతం, బ్రిటన్‌నుంచి ఇటు జరుగుతున్నది రెండుశాతమే కనుక, ఇరుదేశాల మధ్యా ఇచ్చిపుచ్చుకోవడానికి ఆకాశమంత అవకాశం ఉంది. ఏదో మేర రాజీలూ రాయితీలతో రేపోమాపో అమెరికాతోనూ ఒప్పందం కుదరవచ్చును కానీ, అంతలోగా సుంకాలనూ శాపనార్థాలనూ కలగలిపి మన మనసులను ట్రంప్ గాయపరచిన దశలో, రక్షణనుంచి సినీరంగం వరకూ అన్నీ పంచుకుందామంటూ స్టార్మర్ సగౌరవంగా ప్రతిపాదించడం బాగుంది. కొన్నిరంగాల్లో బ్రిటన్ పెట్టుబడుల ప్రవేశం గురించి మన ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టంగా లేదన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, అనేకరంగాల్లో భారత్ ఎగుమతులకు అదుపులూ అడ్డంకులూ లేకపోవడం స్వాగతించాల్సిన విషయం. అరడజనుకుపైగా రంగాల్లో బ్రిటన్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టి, రెండుదేశాలూ లాభపడవచ్చునంటున్నారు భారత ప్రధాని మోదీ. మిసైళ్ళు, నౌకల ఇంజన్ల కొనుగోలుతో బ్రిటన్‌తో రక్షణరంగంలో దోస్తీ మరింత హెచ్చింది. మనకంపెనీలు అక్కడ వేలకోట్ల పెట్టుబడులు పెడుతున్నందున, అటునుంచి కూడా ధనప్రవాహం ఉండబోతున్నదట. ఇక్కడి సినీనిర్మాతలు అక్కడ షూటింగ్ చేయడం, అక్కడి యూనివర్సిటీలు ఇక్కడ క్యాంపస్‌లు తెరవడం వంటివి ఆర్థిక ప్రయోజనాలతో పాటు, రెండుదేశాల మధ్యా సాన్నిహిత్యం మరిన్ని రంగాలకు విస్తరించిన సత్యాన్ని తెలియచేస్తున్నాయి. ఉద్యోగవీసాలమీద మీసాలు దువ్వుతూ, విదేశీవిద్యార్థుల ప్రవేశంమీద తమ విశ్వవిద్యాలయాలను ట్రంప్ నియంత్రిస్తున్న తరుణంలో, ఇకపై స్టెమ్ కోర్సుల కోసం బ్రిటన్‌వైపు చూసే విద్యార్థుల సంఖ్య కూడా హెచ్చుతుందట.
పరిణామంలో చిన్నదే కావచ్చును కానీ, ఈ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) ఉభయ దేశాలనూ దగ్గరచేసింది. వస్తు, సేవల రెండింటిలోనూ మిగులు మనవైపే ఉన్న విషయాన్ని అటుంచితే, యాభైఆరు బిలియన్ డాలర్ల ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఉభయదేశాలూ ఐదేళ్ళలో 120 బిలియన్ డాలర్లు చేయాలనుకుంటున్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటివి బ్రిటన్‌కు అత్యధికంగా ఎగుమతులు చేస్తూ తొలిస్థానాలు ఆక్రమించిన నేపథ్యంలో భారత్ ప్రధానంగా లబ్ధిపొందగలిగే రంగాలు ఏమిటన్న నిర్ధారణలు ఇప్పటికే జరిగాయి. సుంకాలు దాదాపుగా సున్నా అయిన స్థితిలో ఇప్పటికే బరిలో ఉన్న మిగతాదేశాలతో పోటీపడటానికి మనం విధానపరంగా చేయాల్సిందేమిటన్న విశ్లేషణలూ సాగుతున్నాయి. ఈ ఒప్పందం రేపటిరోజుల్లో అమెరికా, ఈయూలతో చేసుకోబోయే ఒప్పందాలకు మార్గదర్శకంగా ఉపకరించడంతో పాటు, ఎగుమతుల రంగంలో మనం చేపట్టవలసిన సంస్కరణలకు సన్నద్ధం కావడానికీ ఉపకరిస్తుంది. ట్రంప్ టారిఫ్ అస్త్రాలదెబ్బకు మిగతా ప్రపంచమార్కెట్ల అన్వేషణలో పడిన భారతదేశానికి బ్రిటన్ తొలిమెట్టు కాబోతోంది. ఒకపక్క బ్రెగ్జిట్ బాధనుంచి కోలుకోలేక బ్రిటన్ ఇంకా విలవిలలాడుతూంటే, ట్రంప్ తన అస్తవ్యస్థ విధానాలతో మొత్తం ప్రపంచాన్నే చెల్లాచెదురు చేసేశారు. ‘సెటా’తో బ్రిటన్‌కు ఆపన్నహస్తం అందించిన భారతదేశం, అక్కడనుంచి వచ్చిపడే చవుక ఉత్పత్తులతో తాను దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. మన చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, వ్యవసాయం, దాని అనుబంధరంగాలను ఎలా కాపాడుకోవాలో పాలకులు ఆలోచించాలి.
ఈ వార్తలు కూడా చదవండి...
నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్
ఏపీ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు దిశగా అడుగులు
Read Latest AP News And Telugu News