Share News

Trumps Nuclear Madness: అణు ఉన్మాదం

ABN , Publish Date - Nov 08 , 2025 | 05:23 AM

అనేక యుద్ధాలు ఆపాను, యుద్ధం అంచులకుపోతున్న దేశాలను హెచ్చరించి మరీ నిలువరించాను, అయినా నాకు నోబెల్‌శాంతి ఇవ్వలేదు, కనీసం నా శాంతియత్నాలను కూడా ప్రపంచం గుర్తించడం...

Trumps Nuclear Madness: అణు ఉన్మాదం

అనేక యుద్ధాలు ఆపాను, యుద్ధం అంచులకుపోతున్న దేశాలను హెచ్చరించి మరీ నిలువరించాను, అయినా నాకు నోబెల్‌శాంతి ఇవ్వలేదు, కనీసం నా శాంతియత్నాలను కూడా ప్రపంచం గుర్తించడం లేదు, ఐక్యరాజ్యసమితి సైతం మెచ్చుకోలేదు... అని అదేపనిగా వాపోయిన అమెరికా అధ్యక్షుడు అందుకు ప్రతిగా ప్రపంచంమీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారేమో! శాంతి‍దూత ట్రంప్‌ నోట వారంలోనే పలుమార్లు అణ్వస్త్రాలు, అణుయుద్ధాల ప్రస్తావనలు వినిపించాయి. యావత్‌ ప్రపంచాన్ని నూటయాభైసార్లు నాశనం చేయగల అణ్వస్త్రాలు తన వద్ద ఉన్నాయని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. ఒకపక్క శాంతిగురించి మాట్లాడుతూనే, అణునిరాయుధీకరణ మహాగొప్పదని అంటూనే, మరోపక్క మానవజాతిని సమూలంగా మట్టుబెట్టడానికి అమెరికాకు అట్టే సమయం పట్టదని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. దేశాలను దారికి తేవాలంటే సుంకాలతో మోదితే చాలని మొన్నటివరకూ ఉపన్యాసాలు దంచిన ట్రంప్‌ ఇప్పుడు ట్రేడ్‌వార్‌ కాక నూక్లియర్‌వార్‌ కోసం అర్రులు చాస్తున్నట్టు కనిపిస్తోంది. పదిరోజుల క్రితం, దక్షిణకొరియాలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీకి ఒకరోజు ముందు ట్రంప్‌నోట ఈ అణుపాటపరీక్షల మాట వినబడింది. అందరూ చేస్తున్నదే అంటూ ఆయన చైనా, రష్యా, ఉత్తరకొరియాలను ఉదహరించడంతో పాటు పాకిస్థాన్‌ పేరు కూడా ప్రస్తావించారు. ఈ దేశాలన్నీ రహస్యంగా ఆ పనిచేస్తున్నాయని, తాను చెప్పిమరీ చేస్తానని అన్నారాయన. ట్రంప్‌ నోట పాకిస్థాన్‌ పేరు వినబడగానే దొంగపనులు ఆ దేశానికి అలవాటేనంటూ భారత ప్రభుత్వం విరుచుకుపడింది. అలనాటి పోఖ్రాన్‌ పరీక్షల శక్తియుక్తులను ప్రజలకు గుర్తుచేస్తూ అణుపరీక్షలకు మనదేశం మళ్ళీ సిద్ధపడుతోందని మీడియా కథనాలను వండివార్చుతోంది. పాక్‌, చైనాలు అణుబలం పెంచుకుంటూంటే మనం ఎలా ఊరుకుంటామంటూ సామాజిక మాధ్యమాల్లో దేశభక్తులు వీరంగాలు వేస్తున్నారు. ఈమారు ఎన్ని టన్నుల మందుగుండు వాడాలో, ఎంత శక్తిని విడుదలచేయాలో లెక్కలు కడుతున్నారు. అణుపరీక్షలకు సిద్ధంకమ్మని తాను ఇప్పటికే ఆదేశించాననీ, ఏర్పాట్లు మొదలయ్యాయని అమెరికా అధ్యక్షుడి నోటివెంటే రావడంతో రష్యాకు కూడా ఇక మొహమాట పడాల్సిన అవసరం లేకపోయింది. అమెరికా అణుపరీక్షలు జరిపినవెంటనే విస్ఫులింగాలు కురిపించడానికి అదీ సర్వంసిద్ధం చేసుకుంటోంది.


మూడుదశాబ్దాల విరామం తరువాత అమెరికా అణుపరీక్షలకు సిద్ధపడుతూండటం ప్రపంచాన్ని పెనుప్రమాదంలోకి నెట్టేస్తోంది. రష్యా, చైనా బూచి చూపుతూ అణుపాటవాన్ని మరింత పెంచుకుంటానని ట్రంప్‌ ప్రకటించడంతోపాటు, అత్యంత శక్తిమంతమైన ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి మినిట్‌మ్యాన్‌ ప్రయోగం సైతం రష్యా, చైనాలను హెచ్చరించడానికీ, ఉత్తరకొరియాను గిల్లడానికీ ఉపకరిస్తాయి. ఈ క్షిపణికి నూక్లియర్‌ వార్‌హెడ్‌ తగిలించకపోవచ్చును కానీ, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నస్థితిలో ఈ అధునాతన క్షిపణిని పరీక్షించడం ప్రత్యర్థి దేశాలను హెచ్చరించడానికే. ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి వాతావరణాన్ని సృష్టించడం, అణుపోటీని రగల్చడం ట్రంప్‌ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎదుటివారివద్ద అణ్వాయుధాలున్నాయన్న ఆరోపణతో శత్రువులను హతమార్చడం, దేశాలను స్వాధీనం చేసుకోవడం అమెరికాకు అలవాటు. అణుపరీక్షలు నిర్వహిస్తున్నాయంటూ ఇప్పుడు ట్రంప్‌ ఆరోపించిన దేశాలేవీ నిజానికి ఆ పనిచేసిన ఆధారాలేమీ లేవు. ఉత్తరకొరియా విషయంలో పాశ్చాత్యదేశాలన్నీ కట్టగట్టుకొని చేస్తున్న ప్రచారం నమ్మినపక్షంలో దానిని కొంతమేరకు మినహాయించవచ్చును. ఈ అధునాతన సాంకేతిక యుగంలో అణుపరీక్షలను రహస్యంగా జరపడం, దాచడం కష్టం. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపని మొండిఘటం పుతిన్‌ను లొంగదీయడానికో, వాణిజ్యయుద్ధంలో లొంగిరాని జిన్‌పింగ్‌ను దారికితెచ్చుకోవడానికో తన అణు హెచ్చరికలు ఉపకరిస్తాయని ట్రంప్‌ అనుకొనివుంటే అది పెద్ద భ్రమ. అమెరికాలోని యాభైరాష్ట్రాల్లో ముప్పై రాష్ట్రాలు ట్రంప్‌కు హారతులుపట్టి ఏడాది అయింది. మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ (మాగా) పేరిట ఆయన దేశంలోనూ, విదేశాలతోనూ చేస్తున్న పలురకాల యుద్ధాలు ప్రజలకు అంతగా రుచించ లేదని మొన్నటి ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. న్యూయార్క్‌ మేయర్‌గా జోహ్రాన్‌ మమ్దానీ ఎన్నిక కావడం, న్యూజెర్సీ, వర్జీనియా డెమోక్రాట్ల చేతుల్లోకి పోవడం ట్రంప్‌కు ఎదురుదెబ్బ. ట్రేడ్‌వార్‌తో కాక, తన ఆప్తమిత్రుడు బెంజమీన్‌ నెతన్యాహూ తరహాలో రియల్‌వార్‌తోనే తాను అధికారంలో కొనసాగగలనని ట్రంప్‌ అనుకుంటున్నట్టు ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఎమ్మెస్కే ప్రసాద్‌కు ప్రొటోకాల్ వివాదంపై సీఎం చంద్రబాబు సీరియస్

రైతు వ్యతిరేక చట్టాలపై ఎన్జీ రంగా పోరాటం చేశారు: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 08 , 2025 | 05:23 AM