Share News

Amit Shah : అమిత్‌షా కల ఫలిస్తుందా?

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:09 AM

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో భారత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘మావోయిస్టు రహిత భారత్‌ అనే స్వప్నం సాకారమవుతోంది’ అని ప్రకటించారు. గరియాబంద్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత దేశంలో ‘మావోయిస్టు ఉద్యమం కొనఊపిరితో ఉంద’ని అన్నారు. ఈ మాటలన్నీ మావోయిస్టు ఉద్యమానికి,

Amit Shah : అమిత్‌షా కల ఫలిస్తుందా?

ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో భారత కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ‘మావోయిస్టు రహిత భారత్‌ అనే స్వప్నం సాకారమవుతోంది’ అని ప్రకటించారు. గరియాబంద్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత దేశంలో ‘మావోయిస్టు ఉద్యమం కొనఊపిరితో ఉంద’ని అన్నారు. ఈ మాటలన్నీ మావోయిస్టు ఉద్యమానికి, భారత ప్రభుత్వానికి మధ్య రాజకీయార్థిక రంగంలో, భావజాల సాంస్కృతిక రంగాల్లో జరుగుతున్న సంఘర్షణకు వ్యక్తీకరణ మాత్రమే. అసలు ఎన్‌కౌంటర్‌ ఘటనలే ఆ సంఘర్షణ వ్యక్త రూపాలు.

రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే మావోయిస్టు ఉద్యమ అణచివేతను కేంద్రమే చూసుకుంటోంది. ఇంతకు ముందు ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆదివాసీ ప్రాంతాల మీద వైమానిక దాడులు చేశాయి. ప్రజల మీద రాకెట్‌ లాంఛర్లను ప్రయోగించాయి. దేశ సరిహద్దుల్లో ఉండే సైనిక బలగాలు ఛత్తీస్‌గఢ్‌ అడవులకు చేరుకున్నాయి. అత్యాధునిక సాంకేతికతను వాడి విప్లవకారుల కదలికలు తెలుసుకొని వేల సంఖ్యలో భద్రతా బలగాలు చుట్టుముట్టి కాల్చేశాయి. ఈ విడత ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అణచివేత మరింత తీవ్రమైంది.


మామూలుగా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని కోరుకుంటాం. సంక్షేమ బాధ్యతలు నిర్వర్తించాలని ఆశిస్తాం. కానీ భారత రాజ్యం, కార్పొరేట్‌ పెట్టుబడి కలిసి కొనసాగుతున్నాయి. వనరుల మీద, మానవుల శ్రమశక్తి మీద అధికారం ఉన్న కార్పొరేట్‌ వర్గపు రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక ప్రయోజనాలన్నీ భారత రాజ్యంలో ప్రతిఫలిస్తున్నాయి. అడవులను, గనులను, సముద్ర తీరాలను, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను అదాని, అంబానిలాంటి కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు. ఈ పాలనా విధానాలు, చట్టాలు, వాటి అమలు కోసం చేస్తున్న సైనిక చర్యలు అన్నీ కార్పొరేట్‌ రాజ్యపు సారభూత వ్యక్తీకరణలు. సనాతన, సామ్రాజ్యవాద మేలు కలయికగా ఈ వ్యవస్థను యథాతథంగా ఉంచడం రాజ్యం అసలు లక్ష్యం. కార్పొరేట్‌ దోపిడీని, సనాతనత్వంలోని హింసా పీడనలను బలోపేతం చేయడం బీజేపీ ఆశయం. ఇది ఇట్లా ఉంటూనే చాలా మార్పులు రావచ్చు. అవన్నీ పాత అసమానతలను నిలబెట్టి, కొత్త అసమానతలు తీసుకొచ్చేవే.

మావోయిస్టు ఉద్యమంతో భారత రాజ్యానికి అక్కడ పేచీ ఉన్నది. ఫాసిజానికి మిగతా అన్ని ప్రజాతంత్ర ఉద్యమాల మీద ఆగ్రహం ఉన్నప్పటికీ మావోయిస్టు ఉద్యమంలోని మిలిటెన్సీ, త్యాగనిరతి, విశాలమైన ప్రాపంచిక దృక్పథం, ముఖ్యంగా మానవ జీవితాన్ని సరికొత్తగా నిర్మించగల భవిష్యత్‌ దర్శనం దానికి చుక్కెదురు. పార్లమెంటరీ పార్టీలన్నిటినీ ఓడించేశక్తి దానికి ఉన్నదని గత మూడు సాధారణ ఎన్నికల్లో రుజువైంది. బీజేపీ మీద కొద్దిపాటి వ్యతిరేకత వ్యక్తమైనా మొత్తం మీద సానుకూలంగానే ఉన్నది. దేశంలో ఫాసిస్టులకు అంకెకు రాని ఒకే ఒక శక్తి మావోయిస్టు ఉద్యమం. అది ఆ ఉద్యమ ప్రాపంచిక దృక్పథంలో ఉన్నది. భావజాలంలో ఉన్నది. దాని రాజకీయ కార్యక్రమం వల్లే అనేక సమస్యలపై పోరాటాలు చేయగలుగుతున్నది. వివిధ పోరాట ప్రవాహాలకు ప్రేరణనిస్తున్నది. వాటికి ఉమ్మడి స్వభావాన్ని ఇస్తున్నది. సారాంశంలో రాజ్యాంగ పరిధిలో, దానికి బైటా జరుగుతున్న ప్రజా ఉద్యమాలు కార్పొరేటీకరణకు ప్రతిబంధకంగా తయారయ్యాయి. ఈ ఉద్యమాలు సనాతన భావజాలానికి వ్యతిరేకంగా హేతు వికాసానికీ తోడ్పడుతున్నాయి. ఫాసిస్టు పునాదుల మీద విప్లవోద్యమ ప్రత్యక్ష, పరోక్ష నాయకత్వంలో, ప్రభావాలతో ఉద్యమాలు జరుగుతున్నాయి. మావోయిస్టు ఉద్యమం రాజకీయ భావజాలశక్తిగా ఉన్నంత కాలం ఈ దేశాన్ని కార్పొరేట్‌ ఇండియాగా మార్చడం కష్టం.


బీజేపీ ఏ ఏ జీవన రంగాల నుంచి కార్పొరేట్‌ హిందూ రాష్ట్రను స్థాపించాలని అనుకుంటున్నదో ఆ అన్ని తావుల నుంచి ప్రత్యామ్నాయ నిర్మాణం చేయగల చేవ, చూపు, చొరవ మావోయిస్టు ఉద్యమానికి ఉన్నాయని బీజేపీకి స్పష్టంగా తెలుసు. అందుకే మొదట ఈ దేశాన్ని మావోయిస్టు రహిత భారత్‌గా మార్చాలి. ఆ తర్వాతే కార్పొరేట్‌ భారత్‌గా మార్చడానికి వీలవుతుంది. ఈ రెండు పనుల కోసం కనీసం ఐదారేళ్లుగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2026 మార్చి నాటికి మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామని అంటున్నారు. మావోయిస్టు ఉద్యమ ప్రమాదం నుంచి తన దీర్ఘకాలిక వ్యూహాన్ని కాపాడుకోడానికి దేశాన్ని అంతర్యుద్ధంలోకి తోసేశారు. మొదట మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తే ఇక మిగతా పోరాట వ్యక్తీకరణలకు కనీసంగా చోటులేకుండా చేయడం సులభం.

దీని కోసం భౌతికంగా విప్లవకారులను హత్య చేయడమేగాక దాని చుట్టూ ఒక భావజాలాన్ని కూడా రాజ్యం నిర్మిస్తున్నది. మావోయిస్టు ఉద్యమం కొన ఊపిరిలో ఉందని తానొక్కడే అంటే లాభం ఉండదని అమిత్‌షాకు తెలుసు. ఆ మాట ఒక భావజాలంగా సమాజమంతా వ్యాపించాలి. ఈ స్థితికి కారణం ఫాసిస్టు యుద్ధమని కాకుండా విప్లవోద్యమ పంథాలో తప్పులు వెతికేలా మేధావులను తయారు చేయాలి. ఇక విప్లవం చేయలేరని అయినవాళ్లతో, కానివాళ్లతో కూడా అనిపించాలి. అలాంటి ఒక దుర్బల మానసికతను వ్యాపింపచేయాలి. మావోయిస్టు రహిత భారత్‌ అంటే మావోయిస్టులు అందరినీ చంపేయడమే కాదు. సమాజాన్ని మౌలికంగా మార్చలేమనే పలాయన మానసికతను స్థాపించడం. ఇది ఎంత ప్రమాదమో ఉదారవాదులు, పీడిత అస్తిత్వశక్తులు, మిగతా విప్లవ సంస్థలు ఆలోచించాలి.


నిజానికి ఒక రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక ఉద్యమంగా మావోయిస్టు పార్టీని ఎప్పటికైనా నిర్మూలించగలరా? గత యాభై ఐదేళ్ల చరిత్రలో ఇలాంటి నిర్బంధాలను ఆ ఉద్యమం చవిచూసింది. అనేక క్లిష్ట దశలను దాటుకొని వచ్చింది. ఇక ముగిసిపోయిందని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని డజన్ల కీలక నాయకులు, వందలాది మంది రెండోస్థాయి, మూడోస్థాయి నాయకులు హత్యకు గురయ్యారు. అనారోగ్యంతో, వయోభారంతో చాలా మంది చనిపోయారు. ఎందరో అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయారు. ఇన్ని ఆటుపోట్ల మధ్యనే కేంద్ర ప్రభుత్వానికి అతి ముఖ్యమైన టార్గెట్‌ కాగల స్థాయికి విప్లవోద్యమం ఎదిగింది. దేశంలో పిడికెడు మంది మినహా నూటా నలభై కోట్ల జనాభాకు విప్లవం అత్యవసరం కావడమే మావోయిస్టు ఉద్యమ వ్యూహాత్మక బలం. ఇది కేవలం ఆశావాదం కాదు. అనేక లోటుపాట్లను సమీక్షించుకొని పురోగమించిన దాని గత, వర్తమాన చరిత్ర సారం. అతి మామూలు మనుషులను నాయకులుగా, మేధావులుగా, రాజకీయ సాంస్కృతిక వ్యూహకర్తలుగా మార్చగల మానవీయ ప్రక్రియ విప్లవోద్యమంలో కొనసాగుతున్నంత వరకు మావోయిస్టు రహిత భారత్‌ ఎన్నటికైనా సాధ్యమవుతుందా? అమిత్‌షా కల ఫలిస్తుందా?

ఒక రాజకీయార్థిక సామాజిక సాంస్కృతిక ఉద్యమంగా మావోయిస్టు పార్టీని నిర్మూలించగలరా? గత యాభై ఐదేళ్ల చరిత్రలో ఇలాంటి నిర్బంధాలను ఆ ఉద్యమం చవిచూసింది. అనేక క్లిష్ట దశలను దాటుకొని వచ్చింది. ఇక ముగిసిపోయిందని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పలు ఆటుపోట్ల మధ్యనే కేంద్ర ప్రభుత్వానికి అతి ముఖ్యమైన టార్గెట్‌ కాగల స్థాయికి ఎదిగింది.

l పాణి


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:09 AM