Share News

Telangana CM Revanth Reddys Outburst: తలంటిన రేవంత్‌ మంత్రులు షాక్

ABN , Publish Date - Oct 26 , 2025 | 12:38 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మండుతోంది. గురువారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సమావేశం ముగిశాక అధికారులను బయటకు పంపించి..

Telangana CM Revanth Reddys Outburst: తలంటిన రేవంత్‌ మంత్రులు షాక్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మండుతోంది. గురువారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. సమావేశం ముగిశాక అధికారులను బయటకు పంపించి... గంటకు పైగా మంత్రులకు ఆయన తలంటారు. దాదాపు రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి తాను ఎంత శ్రమించిందీ, ఎంత రిస్కు తీసుకున్నదీ వివరిస్తూ ఇటీవల పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ కలుపుకొని వెళ్లాలన్న ఉద్దేశంతో మంత్రులందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ బాధ్యత తీసుకోవడానికి ఒక్కరు కూడా ముందుకు రావడంలేదని ఆక్షేపించారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను ధీటుగా ఎదుర్కోడానికి చొరవ తీసుకోకపోగా, ముఖ్యమంత్రిగా తనను ఫెయిల్యూర్‌గా ముద్రవేయడానికి ప్రయత్నాలు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో మంత్రిని పేరు పెట్టి పిలిచి ‘మీకు ఏం తక్కువ చేశానని ఇలా ప్రవర్తిస్తున్నారు?’ అని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని, అనుభవరాహిత్యంతో పార్టీని రేవంత్‌రెడ్డి నాశనం చేస్తున్నారని, పార్టీకి అనాదిగా ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి, దళితులను దూరం చేసుకున్నారని, బీసీ రిజర్వేషన్లు అంటూ పార్టీకి నష్టం చేశారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించినట్టుగా చేస్తున్న ప్రచారంపై రేవంత్‌ మండిపడ్డారు. ఈ విషయమై తాను ఆరా తీయగా ఖర్గే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని రూఢీ అయిందని, అయినా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ చిరాకుపడ్డారు. ‘‘నా రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఆ క్రమంలో ఎన్నో కష్టాలు పడ్డాను. ఎన్నికల సందర్భంగా ఎంతో రిస్కు తీసుకొని కోట్లు అప్పు చేసి పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం చేశాను. ప్రస్తుత ఎమ్మెల్యేల గెలుపుకోసం కాలికి బలపం కట్టుకొని తిరిగాను. కాంగ్రెస్‌ గెలుపుకోసం నా అంతగా కష్టపడిన మరొకరి పేరు చెప్పండి?’’ అని రేవంత్‌రెడ్డి సహచర మంత్రులను నిలదీశారు. మంత్రులు తరచుగా కీచులాడుకోవడం వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పుడు నాలో సహనం నశించింది. ఏదైతే అదవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడను’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ‘‘ఖర్గే నన్ను ఉద్దేశించి అనని మాటలను కూడా అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా మంత్రులు మౌనంగా ఉండటం ఏమిటి? నా ప్రతిష్ఠ దెబ్బతింటే ఆ ప్రభావం పార్టీపై పడదా? నేను ఒక ముఖ్యమంత్రిని అని విస్మరించి ఇష్టారీతిన మాట్లాడటం ఏమిటి? నా సహనానికి కూడా హద్దుంటుంది. బద్నాం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. నేనేమిటో రుజువు చేసుకొనే సమయం ఆసన్నమైంది. మీ అందరికీ చెప్పాల్సింది చెప్పాను. ఇకపై నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు బాధపడి ప్రయోజనం ఉండదు. జరుగుతున్నదంతా పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తా’’ అని రేవంత్‌ స్పష్టం చేశారు. ‘‘నన్ను ఫెయిల్యూర్‌ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నింటికీ ముగింపు పలికిస్తా’’ అని కూడా హెచ్చరించారు. ‘‘పీసీసీ అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా?’’ అని కూడా రేవంత్‌ నిలదీసినట్టు తెలిసింది.


ఆవేదన, ఆవేశం...

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకింత షాక్‌కు గురయ్యారు. ఆయన ఆగ్రహంగా ఉన్నారని గ్రహించిన కొండా సురేఖ విలేకరుల సమావేశంలో తన కుమార్తె వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలను ఉద్దేశించి... ‘‘సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను. నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను. ఇంకేం చేయాలి?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరికీ ఆయన క్లాస్‌ తీసుకున్నారు. రేవంత్‌రెడ్డిలో ఈ మార్పు చూసి మంత్రులు అవాక్కయ్యారు. ఆయనలో ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పట్టులేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవలి కాలంలో కొన్ని సంఘటనలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్‌ అన్న ప్రచారం చాప కింద నీరులా సాగుతోంది. ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా మంత్రులు తమకు సంబంధం లేదన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అనుభవరాహిత్యంతో రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ప్రచారం చేస్తున్నారట! కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలెట్టారు. అదే సందర్భంలో మంత్రుల మధ్య కీచులాటలు బహిర్గతం అయ్యాయి. మంత్రులు బాహాటంగా విమర్శించుకున్నారు. ఈ దశలోనే మంత్రి కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడటంతో రేవంత్‌రెడ్డికి సహజంగానే బాధ కలిగింది.


‘మునుపటి’ కాంగ్రెస్‌

కాంగ్రెస్‌ రాజకీయాలు ఒకప్పుడు ఇలాగే ఉండేవి. కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలను ప్రజలు మరచిపోయి దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో ముఖ్యమంత్రి అయిన రాజశేఖరరెడ్డి పార్టీ పైన, ప్రభుత్వంపైన పూర్తి పట్టు సాధించారు. దీంతో కాంగ్రెస్‌లో అసంతృప్త స్వరాలు మూగబోయాయి. తెలుగునాట ప్రాంతీయ పార్టీలు బలపడటంతో ప్రజలు కూడా కాంగ్రెస్‌ మార్కు రాజకీయాలను మరచిపోయారు. రాజశేఖరరెడ్డి కూడా కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీ స్థాయిలోనే నడిపారు. ఏక వ్యక్తి పాలనకు, ప్రాంతీయ పార్టీల కల్చర్‌కు అలవాటుపడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో దశా దిశా లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ రేవంత్‌రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తిచెందుతోంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతుండటంతో జనంలో ఆయన పలుచన అవుతున్నారు. దీని ప్రభావం సహజంగానే పార్టీపై కూడా పడుతోంది. 1995 నుంచి నేటి వరకు ఒంటి చేత్తో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిన, నడుపుతున్న చంద్రబాబు... ఇంకా కేసీఆర్‌, జగన్‌రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిని చూసిన ప్రజలు రేవంత్‌రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తారనీ వ్యవహరించాలనీ ఆశించారు. అయితే, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. ముఖ్యమంత్రిని దూషించిన వారిపై కూడా చర్య తీసుకోలేని పరిస్థితి ఉండటం ఏమిటి? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. చర్య తీసుకోకపోగా మంత్రి కొండా సురేఖ దంపతులను ముఖ్యమంత్రి నివాసానికి తీసుకెళ్లి చర్చలు జరపడం ఏమిటి? దీనివల్ల ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారు? సురేఖ దంపతులతో రేవంత్‌రెడ్డి రాజీ కుదుర్చుకున్నారన్న అభిప్రాయం ప్రజల్లో సహజంగానే ఏర్పడింది. మరో వైపు మంత్రులు ఎవరికి వారు సర్వ స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నారు. ఆ శాఖ, ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లకు కూడా నేరుగా ఫోన్లు చేస్తూ కనీస మర్యాద ఇవ్వకుండా ఇతర శాఖలకు సంబంధించిన అంశాలలో ఆదేశాలు జారీచేస్తున్నారు. కొంతమంది మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించుకుంటున్నారు. రాష్ర్టానికి ఒక్కరే ముఖ్యమంత్రిగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడాన్ని అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస ప్రజాదరణ లేని వాళ్లు సైతం తాము కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లం అని డాంబికాలు పోతూ రేవంత్‌రెడ్డిని జూనియర్‌ అని కించపరుస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికి ప్రయత్నించినప్పుడే పార్టీ ప్రతిష్ఠ, ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంలో వివిధ స్థాయిలలో అవినీతి పెరిగిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులను కట్టడి చేయలేకపోతున్నారన్న అభిప్రాయం ఏర్పడింది. మరోవైపు ప్రభుత్వం వద్ద నిధుల కొరత కారణంగా చిన్న చిన్న పనులు కూడా మంజూరు చేయించలేని స్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిణామాలతో వారిలో అసంతృప్తి చోటుచేసుకుంటోంది.


కలిసిరాని నిర్ణయాలు...

ప్రభుత్వపరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కలసి రావడంలేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలన్న నిర్ణయం ఈ కోవలోకే వస్తుంది. ముందూ వెనుకా ఆలోచించకుండా, చట్టపరమైన చిక్కులను లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. 42 శాతం రిజర్వేషన్లు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదే అని బీసీలు భావిస్తుండగా... పార్టీకి అండగా ఉన్న రెడ్లు ఈ నిర్ణయం పట్ల కినుక వహించారు. దళితులు కూడా అసంతృప్తితో ఉన్నారు. నిజానికి బీసీలకు రిజర్వేషన్ల అంశంపై గతంలో పలువురు నాయకులు చేతులు కాల్చుకున్నారు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతమైన నాయకురాలు కూడా మండల్‌ కమిషన్‌ నివేదిక అమలు చేయడానికి సాహసించలేకపోయారని దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్‌ తన పుస్తకంలో ప్రస్తావించారు. వీపీ సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్‌ కమిషన్‌ నివేదిక అమలుకు పూనుకోగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. మండల్‌ కమిషన్‌ మంటలు మిన్నంటడంతో వీపీ సింగ్‌ రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పూర్వాపరాలు ఆలోచించకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు అమలులో ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు కొట్టిపారేశాయి. దీంతో బీసీల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన రాజకీయ పార్టీలు ఇప్పుడు బాధ్యతను కాంగ్రెస్‌ ప్రభుత్వంపైకి నెట్టి తప్పుకొన్నాయి. ఫలితంగా ఈ సమస్య పరిష్కార బాధ్యత ప్రభుత్వంపై పడింది. రాజకీయాలు రంగ ప్రవేశం చేయడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దశా దిశా లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందిన భారత రాష్ట్ర సమితి ఈ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి సర్వశక్తులూ ఒడ్డుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున ఈ స్థానాన్ని గెలుచుకోవలసిన ఆవశ్యకత కాంగ్రెస్‌ పార్టీకి ఏర్పడింది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వం కొంతలో కొంత కుదుటపడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడుతుంది. ఇలాంటి సవాళ్లను ఎదురుగా పెట్టుకొని మంత్రులు, నాయకులు క్రమశిక్షణను ఉల్లంఘించి వ్యవహరించడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఉంటుంది. అందుకే ఆయన ఈ రెండేళ్లలో ఎన్నడూ లేని విధంగా సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా మంత్రులందరికీ క్లాస్‌ పీకారు.


అధిష్ఠానం ఏం చేస్తున్నట్లు?

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్ఠానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖరరెడ్డి హయాంలో వలె ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వేచ్ఛ ఇవ్వడంలేదు. కాంగ్రెస్‌ పార్టీలో అందరినీ కలుపుకొనిపోవడం అంటే ఆషామాషీ కాదు. నాయకుడికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. భయంతో కొందరు, భక్తితో మరికొందరు ముఖ్యమంత్రి పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తారు. అయితే రేవంత్‌ విషయంలో ఇప్పుడా పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు. పార్టీ అధికారంలోకి రావడానికి తన కృషి ప్రధాన కారణమని తెలిసినప్పటికీ... పార్టీలో తాను జూనియర్‌ అన్న భావన ఉన్నందున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభం నుంచి అణకువతోనే ఉంటూ వచ్చారు. చివరికి అది అందరికీ అలుసుగా మారింది. కొంతమంది మంత్రులైతే ఆయనను ముఖ్యమంత్రిగా కూడా గుర్తించడానికి ఇష్టపడటం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ పుట్టి మునగడంతోపాటు తాను కూడా మునిగిపోతానని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, ముఖ్యమంత్రిగా తాను ఫెయిల్యూర్‌ అన్న ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను రేవంత్‌రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కారణంగానే తనకు రాజకీయం తెలియక మెతకగా ఉంటున్నానని భావించవద్దు అని ఆయన తాజాగా మంత్రులను హెచ్చరించారు. ఇకపై తాను కఠినంగా ఉండబోతున్నానన్న సంకేతాన్ని ఆయన మంత్రులు, నాయకులతోపాటు పార్టీ అధిష్ఠానానికి కూడా పంపాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. కొండా సురేఖ విషయమే తీసుకుందాం! ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేసి ఉండాలి. రేవంత్‌రెడ్డి కూడా ఒక దశలో ఇదే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవ తీసుకొని కొండా సురేఖను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. దీంతో ఆయన అప్పటికి శాంతించారు. అయితే, గురువారం మంత్రివర్గ సమావేశంలో అధికారులు వెళ్లిపోయిన తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారట.


ఫలితంగానే తన కుమార్తె వ్యవహార శైలికి కొండా సురేఖ క్షమాపణ చెప్పుకొన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న విషయం పక్కన పెడితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కాయకల్ప చికిత్స చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అధికారం శాశ్వతం కాదు. అధికారంలో ఉన్నంత కాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావొచ్చు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో ప్రస్తుతం రేవంత్‌రెడ్డికి ప్రత్యామ్నాయం లేదు. రేవంత్‌రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే కూలిపోవచ్చు. పార్టీ అధిష్ఠానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించాలి. 2004 తర్వాత రాజశేఖరరెడ్డి పార్టీలో, ప్రభుత్వంలో పట్టు పెంచుకున్నట్టుగానే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. హద్దు మీరుతున్న మంత్రులపై చర్యలు తీసుకొనే విషయంలో చొరవ తీసుకోవాలి. అప్పుడే ఆయన నాయకత్వం పట్ల భయంతో పాటు భక్తి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రిగా బాగా పనిచేశారని రుజువు చేసుకోగలిగినప్పుడే భవిష్యత్తులో మళ్లీ మళ్లీ అవకాశాలు వస్తాయి. అలా కాకుండా ఫెయిల్యూర్‌గా ముద్రపడితే భవిష్యత్తులో మళ్లీ అవకాశం రావడం కష్టం. ఏ ఒక్కరూ అధికారంలో శాశ్వతంగా ఉండరు అన్న సత్యాన్ని గ్రహించి మెలగాలి. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి కూడా తన పోకడలను కొంత మార్చుకోవాలి. ప్రభుత్వ పరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం, అవగాహన ఉండే మంత్రులు, శాసనసభ్యులతో చర్చలు జరపాలి. ప్రతిపక్షాల నుంచి తనకు రక్షణ కవచంలా నిలబడే వారితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రాజకీయాల్లో వర్గాలు సహజం. ముఖ్యమంత్రికి కూడా వర్గం ఉంటుంది. ఎన్నికల ఫలితాల తర్వాత మెజారిటీ శాసనసభ్యులు మద్దతు పలికినందునే కదా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయింది? ముఖ్యమంత్రిగా తన స్థానం పదిలం చేసుకున్న తర్వాత అందరూ ఆయన వర్గమే అవుతారు. గతంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఇదే జరిగింది. అప్పటిలా ఇప్పుడు కాంగ్రెస్‌ అధిష్ఠానం బలంగా కూడా లేదు. ముఖ్యమంత్రికి మార్గదర్శకత్వం వహించేవారు కూడా అధిష్ఠానంలో లేరు. అందుచేత రేవంత్‌రెడ్డి తనకు నమ్మకమైన వారితో థింక్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న కొంతమంది వల్ల ఆయన గౌరవం తగ్గుతోంది. అధికారంలో లేనప్పుడు మీ పక్కన ఎవరున్నారన్నది ఎవరూ పట్టించుకోరు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా ముఖ్యమంత్రి వంటి అత్యున్నత పదవిలో ఉన్నప్పుడు ఆయన చుట్టుపక్కల ఎవరు ఉన్నారన్నది ప్రజలు గమనిస్తుంటారు. నాయకుడికి ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసినప్పుడే పరిస్థితులు అనుకూలంగా మారతాయి.


రాజకీయాలలో రిస్కు తీసుకున్నప్పుడే ఫలితాలు వస్తాయి. రేవంత్‌రెడ్డి గతంలో రిస్కు తీసుకొని తెలుగుదేశం పార్టీని వదిలి కాంగ్రెస్‌ పార్టీలో చేరి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొని ఉండకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి కాగలిగేవారా? తనను చులకన చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి చెక్‌ పెట్టే కార్యక్రమాన్ని ఆయన వెంటనే ప్రారంభించాలి. రేవంత్‌రెడ్డి తనను తాను సంస్కరించుకోవడంతో పాటు పార్టీని, ప్రభుత్వాన్ని సంస్కరించడానికీ నడుం బిగించాలి. నిజానికి రేవంత్‌రెడ్డి అత్యంత రిస్కు తీసుకొని సాధించుకున్న ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు వంటిది కాదు. రాష్ట్రంలో నాయకత్వ మార్పిడికి అధిష్ఠానం కూడా సాహసించలేని పరిస్థితి. ఒక ముఖ్యమంత్రికి ఇంతకంటే అనువైన వాతావరణం ఇంకేముంటుంది? పార్టీలో, ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్‌రెడ్డి పరిగణించాలి. అలా చెయ్యలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవలసి వస్తుందని తెలుసుకోవాలి. ఏ పార్టీలోనైనా తమ నాయకుడి ప్రతిష్ఠను పెంచడం వల్లనే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రాజశేఖరరెడ్డిని పార్టీ మొత్తం తలకెత్తుకోవడం వల్లనే ఆయన ప్రతిష్ఠ పెరిగి 2009లో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. అలా కాకుండా కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు ఇప్పటిలా వ్యవహరించి ఉంటే 2009లో పార్టీ ఓడిపోయి ఉండేది. భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పటికే తాము అధికారంలోకి వచ్చినట్టేనని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ లేదా బీజేపీకి అవకాశం ఇవ్వడమా? లేక కాంగ్రెస్‌ ప్రతిష్ఠను, ప్రభుత్వ ప్రతిష్ఠను పునరుజ్జీవింపజేయడమా? అన్నది కాంగ్రెస్‌ ముఖ్యులే తేల్చుకోవాలి. ప్రజలు మరచిపోయిన కాంగ్రెస్‌ సంస్కృతిని మళ్లీ గుర్తుకు తెచ్చే విధంగా ప్రవర్తిస్తే అధికారం కోల్పోవడానికి సిద్ధపడక తప్పదు. తస్మాత్‌ జాగ్రత్త!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు బస్సు ప్రమాదంలో కీలక మలుపు

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 12:39 AM