Share News

తెలివైన వ్యాపారి

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:16 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నియంత అనకూడదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసాపత్రం ఇవ్వడానికి కొద్దిగాముందు, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా దురాక్రమణదారు కానేకాదని...

తెలివైన వ్యాపారి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నియంత అనకూడదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రశంసాపత్రం ఇవ్వడానికి కొద్దిగాముందు, ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా దురాక్రమణదారు కానేకాదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా నిర్థారించింది. అమెరికా, రష్యా ఒకేమాటమీదకు రావడం, ఏకరీతిన ఓటుచేయడం ఎన్నడైనా చూశామా? యుద్ధానికి సంబంధించిన రెండు తీర్మానాల్లో రష్యాతో కలసి అమెరికా ఓటుచేయడం వందరోజుల ట్రంప్‌ ఏలుబడిలో వచ్చిన సమూలమైన మార్పుకు నిదర్శనం. ఉక్రెయిన్‌కీ, పాశ్చాత్య మిత్రదేశాలకు ద్రోహం చేస్తూ, ట్రాన్స్‌ అట్లాంటిక్‌ బంధాన్ని తీసిపారేస్తూ అమెరికా తీసుకున్న ఈ వైఖరికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఎంతగానో సంతోషిస్తున్నారు.


యుద్ధానికి మూడేళ్ళయిన సందర్భంలో, తక్షణమే దానిని ముగించాలంటూ భద్రతామండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానంలోని భాష చైనా రష్యాలకు తెగనచ్చేసింది. ఉక్రెయిన్‌ పక్షాన, యూరోపియన్‌ దేశాలను కూడా కలుపుకొని రష్యాను ఒంటరిచేయడం లక్ష్యంగా ఇంతకాలమూ అమెరికా ఉపయోగించిన భాషకు ఇది పూర్తి భిన్నం. యుద్ధంతో ముడివడిన అన్ని పాపాలకూ, ప్రపంచం ఎదుర్కొంటున్న సర్వ సమస్యలకు రష్యాయే కారణమంటూ నిందిస్తూ వచ్చిన అమెరికా ఇప్పుడు యూరప్‌ దేశాల అండదండలతో ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాల్లో గతంలో వాడిన పదాలకు అభ్యంతరం చెబుతోంది. సర్వప్రతినిధి సభలో తగ్గాల్సివచ్చినందుకు, భద్రతామండలిలో తన మాట నెగ్గించుకుంది. ఉక్రెయిన్‌నూ, ఐరోపాదేశాలను పక్కనబెట్టి, రష్యాతో నేరుగా అమెరికా చర్చలు ఆరంభించిన నేపథ్యంలో, ఈ తీర్మానాలు ఆత్మీయుల మధ్య ఒక్కసారిగా పెరిగిన ఉద్రిక్తతలకు సూచికలు.


ఉక్రెయిన్‌ కారణంగానే యుద్ధం మొదలైందనీ, తెలివితక్కువ జెలెన్‌స్కీ వల్లనే ఆ దేశం ఆర్థికంగా పతనమైందనీ, రష్యా శక్తిసామర్థ్యాలు తెలిసికూడా ఈ నియంత మొండిగా యుద్ధానికి దిగాడని ట్రంప్‌ ఇటీవల నోరుపారేసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో ట్రంప్‌ అతిఖరీదైన బేరం కుదర్చుకోబోతున్నాడని, రెండువందల బిలియన్‌ డాలర్ల ఆయుధ సాయం చేసినందుకు ప్రతిఫలంగా ఓ ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువైన అరుదైన ఖనిజాలను అమెరికన్ కంపెనీలు కొల్లగొట్టబోతున్నాయని అంతా అనుకుంటున్నదే. జెలెన్‌స్కీని దారికితేవడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించినట్టే. ఉక్రెయిన్‌ ‍అమ్మకానికి సిద్ధంగా లేదంటూ మొదట్లో ఏవో గంభీరమైన మాటలు వినబడ్డాయి కానీ, రేపోమాపో ఉక్రెయిన్‌ అధినేత సంతకాలు పెట్టడానికి అమెరికా రావచ్చు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ సందర్భంలో ట్రంప్‌ గౌరవంగా వ్యవహరించలేదని, తీసిపారేసినట్టు మాట్లాడారన్న విశ్లేషణలను అటుంచితే, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి యుద్ధాన్ని ముగించడం సరికాదని మాక్రాన్‌ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ ఎంత పెడసరంగా మాట్లాడారో చూశాం. మనం స్మార్ట్‌ కాకపోతే యుద్ధం కొనసాగుతూనే ఉంటుందన్న ట్రంప్‌ వ్యాఖ్యలో యుద్ధం నుంచి అనేకరెట్లు దండుకోబోతున్న సందేశం ఉంది. రష్యా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులువుకాదని అంటూనే, జెలెన్‌స్కీ వచ్చి ఒప్పందంమీద సంతకాలు చేస్తారన్న ఆశనీ ప్రకటించారు. మరోపక్క రష్యాతో కూడా తాను వ్యాపారం చేయబోతున్నానని, ఒప్పందాలు కుదర్చుకోవచ్చునని ట్రంప్‌ అంటున్నారు. ఈయన ఈ మాట అన్న రెండుగంటల్లోనే పుతిన్‌ అన్ని లెక్కలూ వేసుకొని, మా దగ్గర కూడా అరుదైన ఖనిజాలు, లోహాలు ఉన్నాయి, మాస్కోతో మెరుగైన సంబంధాలు కొనసాగిస్తే చక్కగా వ్యాపారం చేసుకోవచ్చునని ప్రకటించారు. తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ భూభాగాలను కూడా ఆయన ఈ ఆఫర్‌లో ట్రంప్‌కు అమ్మకానికి పెట్టేశారు.


యుద్ధానికి ముగింపు పలికే పేరిట అమెరికా–రష్యా స్నేహం బలపడుతోంది, ఉప్పు–నిప్పులా ఉండే ఈ రెండుదేశాలు ఏకంగా ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నాయి. సౌదీ చర్చలు త్వరలోనే కొలిక్కివస్తాయని, పుతిన్‌–ట్రంప్‌ కరచాలనం కూడా సమీపంలోనే ఉందని విశ్లేషకులు అంటున్నారు. పరిష్కారం పేరిట ట్రంప్‌ ఆధ్వర్యంలో జరిగే ఆస్తిపంపకాల్లో అంతిమంగా జెలెన్‌స్కీకి దక్కే వాటా ఎంతో తెలియదు కానీ, ట్రంప్‌ వ్యాపారదక్షత చూసిన తరువాత చాలామందికి రెండు పిల్లులు–రొట్టెముక్క–కోతి కథ గుర్తుకువస్తోంది.


Also Read: జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Also Read: TGS RTC MahaLakshmi: ‘మహాలక్ష్మీ’తో ఆర్టీసీ సిబ్బంది.. ఇబ్బంది

Also Read: దోషులైన నేతలపై జీవిత కాల నిషేధం: కేంద్రం ఏమన్నదంటే..

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:16 AM