Share News

Russia Ukraine War: పుతిన్‌ పాతపాట

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:09 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతి ఏడాది చివర్లో నిర్వహించే బృహత్తర మీడియా సమావేశం ఈమారు ఆరుగంటలు సాగిందట. స్వదేశీ మీడియా ప్రశ్నల వర్షం కురిపించిందని, పెద్దసంఖ్యలో...

Russia Ukraine War: పుతిన్‌ పాతపాట

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రతి ఏడాది చివర్లో నిర్వహించే బృహత్తర మీడియా సమావేశం ఈమారు ఆరుగంటలు సాగిందట. స్వదేశీ మీడియా ప్రశ్నల వర్షం కురిపించిందని, పెద్దసంఖ్యలో పాల్గొన్న విదేశీ విలేఖరులు సైతం పలు అంశాలమీద ఆయననుంచి జవాబులు రాబట్టారని రష్యా ప్రకటించింది. దేశ ప్రజలనుంచి పలు రకాల సమస్యలమీద ఎదురైన ప్రశ్నలకు కూడా ఆయన ఈ సుదీర్ఘ కార్యక్రమంలో సమాధానం ఇచ్చారు. మైకు ముందున్నప్పుడు మహోపన్యాసాలు దంచే మహానాయకులు సైతం మీడియాతో ఎదురుగా కూర్చొని మాట్లాడలేక మొహం చాటేస్తూంటే, ఎవరో ఏదో అంటారనో, అడుగుతారనో వెరవకుండా తోచిన సమాధానాలు ధైర్యంగా చెబుతున్నందుకు పుతిన్‌ను మెచ్చవలసిందే. ఇటీవల భారత పర్యటన సందర్భంలో కూడా ఇద్దరు మహిళాపాత్రికేయులకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ చాలామందిని ఆకర్షించింది.

పుతిన్‌ తన వార్షిక విలేఖరుల సమావేశంలో విభిన్న రకాల ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో పాశ్చాత్యమీడియా ఆయనను ఇరుకునపెట్టేందుకు తెగ ప్రయత్నించింది. ఆయన పాతపాటే పాడారన్నది నిజమే కావచ్చునుగానీ, యుద్ధానికి ప్రధాన కారణమైన నాటో విస్తరణ అంశం మొదలు, పాశ్చాత్యదేశాలు ఇప్పటికీ రష్యాపట్ల కక్షపూరితంగా, క్రూరంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నాయన్న వాదనతో, ఉదాహరణలతో ఆయన ప్రశ్నలను బాగానే ఎదుర్కొన్నారు. వెనుకన అతిపెద్ద రష్యా మ్యాప్‌తో పుతిన్‌ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు, పలు ఉక్రెయిన్‌ భూభాగాలు ఆ మ్యాప్‌లో దర్శనమిస్తున్నాయి. శాంతిచర్చల్లో రష్యా డిమాండ్లకు తలొగ్గనిపక్షంలో ఉక్రెయిన్‌లో మరిన్ని భూభాగాలను వశపరుచుకుంటామని, చారిత్రక భూభాగాలను వదులుకోవడానికి రష్యా సిద్ధంగా లేదని ఇటీవలి సైనికాధికారుల సమావేశంలో పుతిన్‌ చేసిన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈ మ్యాప్‌ ఉందట. అణ్వాయుధ భాండాగారాన్ని బలోపేతం చేయడం, అత్యాధునిక క్షిపణుల సంసిద్ధత గురించి కూడా ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడికి యుద్ధాన్ని ఆపే ఉద్దేశంలేదని, కొత్త సంవత్సరంలో కూడా దానిని కొనసాగించబోతున్న సత్యాన్ని ఈ వ్యాఖ్యలతో విప్పిచెప్పేశారని పాశ్చాత్య మీడియా విశ్లేషించింది.


ఇక, సర్వపాపాలకూ కారణం ఉక్రెయిన్‌ అని పుతిన్‌ ఈ మీడియా సమావేశంలో పాతపాటే పాడటంలో ఆశ్చర్యమేమీ లేదు. తమకే పాపమూ తెలియదనడమూ కొత్తకాదు. అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని కాదంటున్న మీరు అటు ఉక్రెనియన్లు, ఇటు రష్యన్లు పెద్ద సంఖ్యలో మరణించడానికి కారకులమని అనుకుంటారా? అంటూ విదేశీమీడియా ప్రతినిధి వేసిన ఒక ప్రశ్నకు ఉక్రెయిన్‌, దానిని పెంచి పోషిస్తున్న పాశ్చాత్యప్రపంచమే ఈ పరిణామాలన్నింటికీ కారణమని పుతిన్‌ జవాబు ఇచ్చారు. చర్చలకు తాము వ్యతిరేకం కాదని అంటూనే, గతకాలపు డిమాండ్లనే పుతిన్‌ వల్లించారు. తన భూభాగాలని రష్యా అంటున్నవాటినుంచి ఉక్రెయిన్‌ సేనలు వైదొలగడం, అణ్వాయుధాలకు దూరంగా ఉంటూ, ఎప్పటికీ నాటోలో చేరబోనంటూ ఉక్రెయిన్‌ హామీ ఇవ్వడం, ఉక్రెయిన్‌ సైనిక, రాజకీయ వ్యవస్థల్లో రష్యాకు నచ్చిన రీతిలో మార్పుచేర్పులు చేయడం వంటివి ఈ డిమాండ్లలో ఉన్నాయి.

పుతిన్‌కు యుద్ధం ఆపే ఉద్దేశం లేదన్న వాదనను అటుంచితే, యూరోపియన్‌ దేశాల వైఖరి కూడా కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆర్థికంగా దెబ్బతినివున్న ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం చేసేందుకు యూరప్‌లో, ముఖ్యంగా బెల్జియంలో స్తంభింపచేసిన 184 బిలియన్‌ డాలర్ల రష్యా ఆస్తులను ఉపయోగించాలని ఈ దేశాలు ఒక దశలో దూకుడుగా అనుకున్నాయి. ఏకాభిప్రాయం కుదరకనో, ఏ కారణంవల్లనో ఆ ఆలోచన వెనక్కునెట్టి, ఇప్పుడు 90బిలియన్‌ డాలర్ల రుణాన్ని ప్రకటించాయి. కష్టకాలంలో ఉన్న ఉక్రెయిన్‌కు ఇది మంచి చోదకశక్తిని ఇస్తుంది. స్తంభింపచేసిన రష్యన్‌ ఆస్తులను శాంతిచర్చల్లో ఒక ప్రధాన అంశంగా ఉపయోగించి రష్యాను కిందకు దించాలన్నది అమెరికా అధ్యక్షుడి ఆలోచన. ఉక్రెయిన్‌కు ఈయూ ప్రకటించిన ఈ భారీ ఆర్థికసాయం రష్యాను మరింత మొండికెత్తేలా చేస్తుందన్న భయాలూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ఎంత ప్రయత్నించినా రష్యా లొంగిరావడం లేదన్నది నిజమే కావచ్చును గానీ, ఉక్రెయిన్‌కు ఇలా ఎంతోకాలం సాయం కొనసాగించలేమన్న సత్యంతో పాటు, ఇలా చేస్తూ పోతే ఐదో ఏట ప్రవేశిస్తున్న యుద్ధాన్ని ఎన్నటికీ ఆపలేమన్నదీ గ్రహించాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రయాణికులకు పండగ లాంటి వార్త.. రైల్వే శాఖ కీలక ప్రకటన

అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

For More AP News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 06:09 AM