Share News

PM Modi Manipur Visit: శాంతికి బాట

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:32 AM

మణిపూర్‌లో అగ్గి అంటుకున్న రెండున్నరేళ్ళకు, రెండువందల యాభైమందికి పైగా మరణించి, అరవైవేలమంది నిరాశ్రయులైన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో కాలూనారు. ఆయన రాక, మాట కోసం ఆ రాష్ట్రం ఎంతగా...

PM Modi Manipur Visit: శాంతికి బాట

మణిపూర్‌లో అగ్గి అంటుకున్న రెండున్నరేళ్ళకు, రెండువందల యాభైమందికి పైగా మరణించి, అరవైవేలమంది నిరాశ్రయులైన తరువాత, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్రంలో కాలూనారు. ఆయన రాక, మాట కోసం ఆ రాష్ట్రం ఎంతగా ఎదురుచూస్తున్నదో ఈ పర్యటన దృశ్యాలు తెలియచెబుతున్నాయి. గాయానికి మందువేసే ఈ ప్రయత్నం ఆలస్యంగా జరిగిందని విశ్లేషకులు సైతం అంటున్నారు. అయినప్పటికీ, మోదీ పర్యటనకు ఉన్న ప్రాధాన్యం కాదనలేనిది. చీలికలు పేలికలైన సమాజాన్ని ఒక్కటి చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకున్నా ఆ దిశగా పడిన ఒక ప్రధానమైన అడుగు ఇది. ప్రధాని మోదీ స్వయంగా హామీ ఇచ్చినట్టు, శాంతి, అభివృద్ధికి ప్రతీకగా మణిపూర్‌ మెరవాలని యావత్‌ భారతం కోరుకుంటోంది.

నలభై ఆరు విదేశీపర్యటనలు చేశారు, సొంత జనంకోసం మరీ మూడుగంటలేనా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నప్పటికీ, మోదీతో భేటీ అయిన సందర్భంలో ఆయా వర్గాలవారు కన్నీటి పర్యంతమైన దృశ్యాలు చూసినప్పుడు వారికి కాస్తంత ఉపశమనం దక్కిందనే అనిపిస్తోంది. మోదీ మంచిమాటకారి కనుక, మణిపూర్‌ను ఆశలభూమిగా, మణిపూర్‌వాసులను శ్రమ, శక్తి ప్రతీకలుగా చక్కగా అభివర్ణించారు. తమ బిడ్డల భవిష్యత్తుకోసం హింస అనే చీకటి నుంచి శాంతి అనే వెలుగులోకి రావాలన్నారు ఆయన. మణిపూర్‌లో తమ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఇప్పటికే సాధించిన అభివృద్ధిని వివరించేందుకు కూడా ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఎనిమిదిన్నరవేలకోట్ల అభివృద్ధిపనులకు కూడా శంకుస్థాపనలు చేశారు. వీటన్నింటికంటే, నిరాశ్రయులతోనూ, చిన్నారులతోనూ, బంధువులను కోల్పోయినవారితోనూ మాటపంచుకొని, ధైర్యవచనాలు చెప్పడం వారిని ప్రభావితం చేసివుంటుంది. కుకీల చుర్‌చందాపూర్‌లోనూ, మీతీల ఇంఫాల్‌లోనూ ఆయన పర్యటనలూ పరామర్శలూ ఇరువర్గాలనూ సమంగా చూస్తున్నామన్న సందేశాన్ని ఇవ్వడానికి ఉపకరిస్తుంది.


అయితే, సందేశాలు మాత్రమే గాయాలను మాన్పలేవు. వేళ్ళూనుకొని ఉన్న వైరాలు ఒక చిన్న నిప్పురవ్వతో మారణకాండకు దారితీస్తున్న తరుణంలో, వైషమ్యాలను, అపనమ్మకాలను నిర్మూలించడానికి ఒక నిరంతర సానుకూల చర్యలు అవశ్యం. మొన్నటిదాకా ఒకరినొకరు చంపుకున్న వారంతా ఇకపై ఒక్కటి కావాలన్న ఆకాంక్ష మంచిదే కానీ, అందుకు బాటలు వేయాల్సిన బాధ్యత పాలకులదే. 29 నెలల నిరంతర అగ్గికి ప్రజలే కారణమన్నట్టుగా, మార్పు వారిలోనే రావాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ అగ్గిరేగింది అభివృద్ధికోసం కాదు. అప్పటికే కుకీజోలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ పలు కక్షపూరితమై నిర్ణయాలు చేయడం, మీతీలకు ఎస్టీ రిజర్వేషన్‌ ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర హైకోర్టు సానుకూలంగా స్పందించడం కుకీల ఆగ్రహానికి కారణం. వారు నిరసన చేపడితే, మీతీలు దాడులు చేసి పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశారు. హింస దురదృష్టకరమని ప్రధాని అనడం బాగుంది కానీ, అది దురుద్దేశపూరితమైనదని ఆయనకు తెలియకపోదు. భావితరాలకు ద్రోహం చేసింది ప్రజలు కాదు, తమవారేననీ ఆయనకు తెలుసు. నిప్పంటుకున్న క్షణం నుంచి మీతీ బీరేన్‌ దానిని ఆర్పడానికి ప్రయత్నించకపోగా, తన చర్యలు, చేష్టలతో మరింత ఎగదోశాడనడానికి సుప్రీంకోర్టుకు చేరిన ఆడియో టేపులే నిదర్శనం. చివరకు తీవ్రవాద గ్రూపులు సైతం తమను తాము ప్రజారక్షకులుగా అభివర్ణించుకుంటూ రంగంలోకి దిగి, ఎదుటి తెగవారిని ఊచకోతకోసే పరిస్థితులు దాపురించాయి. పోలీసుల ఆయుధాలు విద్రోహుల చేతుల్లోకి పోయాయి. మీతీ బీరేన్‌ను తప్పించనంతవరకూ శాంతిసాధ్యం కాదని తెలిసికూడా ఢిల్లీపెద్దలు ఆయనను అడ్డగోలుగా సమర్థించారు, పాపంలో తామూ భాగస్వాములైనారు. సర్కారు ఇక కూలిపోకతప్పదన్న ఆఖరుక్షణంలో మాత్రమే బీరేన్‌ను తప్పించి, రాష్ట్రపతిపాలన ద్వారా రాష్ట్రం చేజారిపోకుండా చూసుకున్నారు. అడపాదడపా అగ్గిరేగుతున్నప్పటికీ, మొత్తంగా ఇప్పుడు పరిస్థితులు కాస్తంత గాడినపడిన మాట నిజం. కుకీ–మీతీ పెద్దల మధ్య వరుస చర్చలతో అవిశ్వాసం తొలగి, సయోధ్య సాధించాలి. తరతమభేదాలకు అతీతంగా పునరావాసం దక్కాలి. ఆప్తులను కోల్పోయినవారికి అన్నివిధాలా న్యాయం జరగాలి. మణిపూర్‌ మీద పార్లమెంటులో నోరువిప్పడానికీ, కుకీ స్త్రీలపై అత్యాచారాలను నేరుగా ప్రస్తావించి ఖండించడానికి గతంలో మనసొప్పని ప్రధాని ఇంతకాలానికి జరిపిన ఈ పర్యటన శాంతికి బాటలు వేయాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 16 , 2025 | 01:32 AM