వికటించిన న్యాయం
ABN , Publish Date - Mar 07 , 2025 | 03:41 AM
వందేళ్ళ చరిత్ర ఉన్న తమిళ మీడియా సంస్థ వికటన్‌కు మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దక్కింది. ఈ మ్యాగ్‌జైన్ వెబ్‌సైట్‌ను అన్‌బ్లాక్ చేయాల్సిందిగా...

వందేళ్ళ చరిత్ర ఉన్న తమిళ మీడియా సంస్థ వికటన్‌కు మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం దక్కింది. ఈ మ్యాగ్‌జైన్ వెబ్‌సైట్‌ను అన్‌బ్లాక్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని గురువారం న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఏ కార్టూన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంతో సదరు సంస్థ వెబ్‌సైట్‌ను బ్లాక్‌చేసిందో, ఆ కార్టూన్‌ను తీసివేయాలన్న ముందస్తు షరతు ఇందులో ఉంది. షరతుకు అంగీకరించిన పక్షంలోనే, సదరు వెబ్‌సైట్ మళ్ళీ తెరమీద ప్రత్యక్షమవుతుందన్న ఈ ఆదేశాలు మధ్యంతరం కావచ్చును, అంతిమతీర్పు మిగిలే ఉండవచ్చు. కానీ, న్యాయస్థానం ఇలా అతిజాగ్రత్తగా వ్యవహరించడం మిగతా మీడియా సంస్థలకు ఉత్తేజాన్నిచ్చే అంశమైతే కాదు.
అక్రమవలసదారులంటూ కాళ్ళకూ చేతులకూ గొలుసులు కట్టి, మొఖానికి మాస్కులు పెట్టి అమెరికా తన విమానాల్లో మన పౌరులను పంజాబ్‌లో దించేసినందుకు దేశం యావత్తూ బాధపడింది, అవమానపడింది. ఇంత అమానుషంగా, అగౌరవంగా వ్యవహరించడాన్ని ప్రశ్నించకపోతే ఎలా? అని విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయి. ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని తప్పుబట్టాయి. ఆవేదనని అమెరికా సర్కారుకు తెలియచేశామని, అయితే, అక్రమార్కులను అలా గొలుసులు కట్టి పంపడం వాళ్ళ విధానమని మన ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఈ వివరణ మన పరువు మరింత దిగజార్చేట్టు ఉన్నదని మళ్ళీ విపక్షాలు తప్పుబట్టాయి. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ అమెరికా పర్యటన జరిగింది. భేటీలో ఈ అంశాన్ని మోదీ ప్రస్తావించకపోవడంపైన కూడా విమర్శలు వచ్చాయి. ట్రంప్ పక్కనే మోదీ గొలుసులతో కూర్చుని ఉన్న ఈ కార్టూన్ తమిళనాడు బీజేపీ అధినేత అన్నామలైకి ఆగ్రహం కలిగించింది. వికటన్ మ్యాగజైన్ డీఎంకేకు ప్రచారసాధనంలాగా తయారైందని, ప్రధానికి వ్యతిరేకంగా నిరాధారమైన కథనాలు ప్రచురిస్తోందని ఆయన ఓ ఫిర్యాదు సంధించారు. అది ఢిల్లీ చేరిన కొద్దిగంటల్లోనే సదరు సంస్థ వెబ్‌సైట్, దాని యాప్‌లు పనిచేయడం మానేశాయి. కార్టూన్ ఫిబ్రవరి 10న ప్రచురితమైతే, ఐదురోజుల అనంతరం కేంద్రప్రభుత్వం తన వెబ్‌సైట్ బ్లాక్ చేసిందనీ, ఫిబ్రవరి 2౫వరకూ తనకు అధికారికంగా సమాచారమివ్వలేదని వికటన్ వాదన.
కార్టూన్ మంచిచెడ్డలను అటుంచితే, వందేళ్ళ చరిత్ర ఉన్న ఒక సంస్థకు చెందిన వెబ్‌సైట్ మూసేయాలని కేంద్ర ప్రభుత్వం అంతవేగంగా ఎలా నిర్ణయానికి రాగలిగిందో అర్థంకాదు. ఫిర్యాదులో బలంకంటే, ఫిర్యాదిదారు బలవంతుడు కావడం వల్ల కాబోలు భావప్రకటనా స్వేచ్ఛలు, హక్కులు పక్కకు పోయి, కొద్ది గంటల్లోనే ఎదుటిపక్షానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా మ్యాగజైన్‌ను మూసేశారు. ఈ కార్టూన్ దేశప్రయోజనాలకు వ్యతిరేకమైనదని నిర్ధారించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదా, లేక ఆనందవికటన్ సంస్థ ప్రత్యర్థి పార్టీకి అనుకూలమనీ, బీజేపీకి వ్యతిరేకమని అన్నామలై చేసిన ఆరోపణతో ఏకీభవించి జరిగిందా?
కేంద్రం నిర్ణయం భావప్రకటనాస్వేచ్ఛకు వ్యతిరేకమని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత చర్య అనీ ఎడిటర్స్ గిల్డ్ నుంచి తమిళనాడులోని అన్ని మీడియా సంస్థల వరకూ విమర్శించాయి. ఆ కార్టూన్ భావప్రకటనా స్వేచ్ఛ పరిమితుల్లోనే ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది సమర్థించారు, ఇది విదేశాలతో మనకున్న బలమైన బంధాలను దెబ్బతీస్తుందని న్యాయస్థానంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాపోయారు. మంచీచెడూ తేల్చేలోగా ఇచ్చిన ఈ తాత్కాలిక తీర్పులో సమపాళ్ళలో న్యాయం చేస్తున్నట్టు న్యాయమూర్తికి అనిపించి ఉండవచ్చు. కానీ, కేంద్రానికి నచ్చని కార్టూన్‌ని తీసివేయమని చెప్పడం ద్వారా ఆ నియంత్రణను సమర్థించినట్టే అయింది. విచారణ కొనసాగుతుందనీ, వెంటనే వెబ్‌సైట్‌ను పునరుద్ధరించాల్సిందేనని ఆదేశించివుంటే బాగుండేది. తద్వారా ఎటువంటి వివరణలు అడగకుండా, ఏకపక్షంగా, కేంద్రం తీసుకున్న ఆ నిర్ణయాన్ని ప్రశ్నించినట్టూ అయ్యేది. కార్టూన్‌ను తొలగించాల్సిందిగా ఆదేశించి, అందుకు సదరు సంస్థ నిరాకరించినపక్షంలో నిర్దిష్టమైన ప్రక్రియను అనుసరించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉన్నది. ఈ కార్టూన్ ద్వారా చేసిన రాజకీయ విమర్శతో అమెరికాలో మనదేశం పరువుపోతుందనీ, ఆ దేశంతో మన సంబంధాలు దెబ్బతింటాయన్న వాదనతో ఏకీభవించడం కష్టం. డోనాల్డ్ ట్రంప్ చర్యలూ చేష్టలమీద అక్కడి మీడియాలో ఎటువంటి విశ్లేషణలు, వ్యాఖ్యలు, కార్టూన్లు వస్తున్నాయో, అవి ఎంత ఘాటుగా ఉంటున్నాయో మన పాలకులు ఒకసారి గమనిస్తే బాగుంటుంది.
Read Latest Telangana News And Telugu News