Share News

Nepal Crisis: కుదుటపడుతున్న నేపాల్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 01:24 AM

నేపాల్‌ త్వరితగతిన గాడినపడటం ఊరటనిస్తోంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ గాడితప్పి, ఇంకా కుదురుకోక, అనతికాలంలోనే పక్కలోబల్లెంలాగా తయారైన నేపథ్యంలో నేపాల్‌ పరిణామాలు ఉపశమనం కలిగిస్తాయి. కేవలం నలభైఎనిమిది గంటల్లో...

Nepal Crisis: కుదుటపడుతున్న నేపాల్‌

నేపాల్‌ త్వరితగతిన గాడినపడటం ఊరటనిస్తోంది. మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ గాడితప్పి, ఇంకా కుదురుకోక, అనతికాలంలోనే పక్కలోబల్లెంలాగా తయారైన నేపథ్యంలో నేపాల్‌ పరిణామాలు ఉపశమనం కలిగిస్తాయి. కేవలం నలభైఎనిమిది గంటల్లో భీతావహమైన ఘట్టాలను చవిచూసిందీ దేశం. పాలకుల అవినీతి, ఆశ్రితపక్షపాతంమీద జనం గుండెలోతుల్లో గూడుకట్టుకొని ఉన్న నిరాశానిస్పృహలు ఒక్కసారిగా ఓ చిన్న నిప్పురవ్వతో రాజుకున్నాయి. దొరికిన మంత్రులను నవతరం తన్నితరిమేసింది, ప్రధాని మాయమై రక్షణస్థావరాల్లో తలదాచుకున్నారు, దేశాధ్యక్షుడు రహస్యప్రదేశాలకు తరలిపోయారు. ఐదుగురు మాజీ ప్రధానుల ఇళ్ళు తగలబడ్డాయి, చివరకు పార్లమెంటు, సుప్రీంకోర్టు భవనాలు సైతం అగ్నికి ఆహుతైనాయి. నాయకుడంటూ లేని ఈ తిరుగుబాటు ఎంతకాలం సాగుతుందో, ఎక్కడకు దారితీస్తుందోనన్న భయం మొదట్లో కలిగినప్పటికీ, తిరగబడిన యువత తాము అనుకున్న లక్ష్యాల సాధన దిశగా త్వరితంగానే అడుగులు వేశారు. నేపాల్‌ ఇప్పుడు స్వయంప్రక్షాళనతో నవ యువ యుగం వైపు కదులుతోంది.

అర్ధరాత్రి కుట్రలతో పౌరప్రభుత్వాలను కూల్చి, ప్రజానాయకులను జైళ్ళలోకి నెట్టి సైన్యం అధికారాన్ని తన్నుకుపోయిన ఉదంతాలు మనచుట్టూనే అనేకం. సైన్యాధ్యక్షులు నియంతలుగా అవతారమెత్తి ప్రజలను హింసించి, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన ఘనచరిత్ర మన ఇరుగుపొరుగులది. ఈ నేపథ్యంలో, అధికారాన్ని కొంతకాలం వెలగబెట్టగలిగే అంతపెద్ద అవకాశం వచ్చికూడా నేపాల్‌ సైన్యం ప్రజానుకూలంగా వ్యవహరించి దేశాన్ని తిరిగి గాడినపెట్టడం మెచ్చదగినది. నేపాల్‌ సైన్యాధ్యక్షుడు ఒక చిన్న విడియో సందేశంతో ప్రజలను అభ్యర్థించి, దేశాన్ని నియంత్రణలోకి తేవడం, సైనికాధికారులు ఎక్కడికక్కడ ఉద్యమకారులతో చర్చలు జరిపి కార్యాచరణను నిర్ణయించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చట్టసభలు చట్టుబండలైన స్థితిలో, పౌరప్రభుత్వం, రాజకీయ నాయకులు ఉనికిలో లేని ఉద్రిక్తవేళల్లో సైన్యమే మధ్యవర్తి అయింది, ఆర్మీ కార్యాలయమే చట్టసభగా అవతరించింది. రాజుగారి ఏలుబడినుంచి మావోయిస్టు ఉద్యమం వరకూ ఎన్నడూ ప్రజలపక్షాన లేని సైన్యం, ఇంతటి సంక్షోభంలోనూ నవతరం వైపు నిలబడింది. గతపాలకులు తప్పుకోవడం నుంచి, జెన్‌ జి గ్రూపుల్లో విభేదాలను చక్కదిద్ది సుశీలా కర్కిని ఎంపిక చేయడం వరకూ ప్రతీదీ సవ్యంగా పూర్తయ్యేట్టు చూసింది. గడ్డుకాలాన్ని గట్టెక్కించినందుకు నేపాల్‌ యువత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంది.


ఆ నమ్మకాన్ని ఆపద్ధర్మ ప్రధాని కూడా నిలబెట్టుకున్నారు. అతిత్వరలోనే దేశాన్ని తిరిగి ప్రజాస్వామ్యం పట్టాలు ఎక్కించేందుకు వచ్చే మార్చిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధపడ్డారు. బంగ్లాదేశ్‌లో గత ఏడాది ‍ఆగస్టులో తిరుగుబాటు, మహ్మద్‌ యూనిస్‌ను విదేశాలనుంచి హడావుడిగా రప్పించి తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కూర్చోబెట్టడం, ఆయన ఎంతో నాన్చి ఎట్టకేలకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలను ప్రకటించడం తెలిసిందే. అవి కూడా సజావుగా సకాలంలో జరుగుతాయన్న నమ్మకం ఇప్పటికీ అక్కడ లేకపోతోంది. హసీనాను గద్దెదించిన తరువాత కూడా మైనారిటీలపైనా, బంగ్లా పితామహుడు ముజిబుర్‌ రహ్మాన్‌ ఆస్తులు, పార్టీనేతలపైనా సాగిన దమనకాండ ఆ పోరాట స్ఫూర్తిని పూర్తిగా దెబ్బతీశాయి. హసీనా పార్టీని ఎన్నికల్లో పాల్గొననీయకుండా చేయడం, ఆమె ప్రత్యర్థి ఖలేదాజియాను బలోపేతం చేయడం, మతోన్మాదులను జైళ్ళనుంచి రోడ్లమీదకు వదిలేయడం, బంగ్లా ఆవిర్భావ చరిత్రను పాతరేసి పాకిస్థాన్‌తో అంటకాగడం వంటివి గమనించినప్పుడు నేపాల్‌ ఎంత ఉన్నతంగా నిలబడిందో అర్థమవుతుంది. బంగ్లాలో దీర్ఘకాలం విధ్వంసం కొనసాగితే, నేపాల్‌ వెనువెంటనే పరిసరాలను శుభ్రం చేసుకుంది, పరిస్థితిని చక్కదిద్దుకుంది. ఏదో ఆపద్ధర్మంగానో, సలహాదారుగానో కాక, ఆయా రంగాల్లో అనుభవం ఉన్న ముగ్గురు మంత్రులతో ప్రధానిగా ప్రమాణం చేసిన సుశీల దేశాన్ని గాడినపెట్టేపని ఇప్పటికే ఆరంభించారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఆస్తులు కూడబెట్టుకున్న నాయకులందరిమీదా యువతరం దండెత్తిన నేపథ్యంలో, వీరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పుచేర్పులు చేపట్టాల్సివుంది. ఓ నలుగురు వ్యక్తులు మారి, అవే విధానాలు కొనసాగితే ఈ ప్రజాగ్రహానికి విలువే లేకుండా పోతుంది కనుక, నవతరం ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల ప్రక్షాళన జరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 19 , 2025 | 01:24 AM