Share News

Modi to attend ASEAN Summit virtually: మోదీ అతి జాగ్రత్త

ABN , Publish Date - Oct 24 , 2025 | 02:07 AM

భారత ప్రధాని నరేంద్రమోదీ ఆసియాన్‌ సదస్సుకు వెళ్ళడం లేదు. కౌలాలంపూర్‌లో ఈనెల 26–2౭తేదీల్లో జరగబోతున్న ఈ సదస్సుకు ఆయన వర్చువల్‌గా హాజరవుతారని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రాహీం గురువారం...

Modi to attend ASEAN Summit virtually: మోదీ అతి జాగ్రత్త

భారత ప్రధాని నరేంద్రమోదీ ఆసియాన్‌ సదస్సుకు వెళ్ళడం లేదు. కౌలాలంపూర్‌లో ఈనెల 26–2౭తేదీల్లో జరగబోతున్న ఈ సదస్సుకు ఆయన వర్చువల్‌గా హాజరవుతారని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రాహీం గురువారం ప్రకటించడంతో పాటు, దీపావళి వేడుకల కారణంగానే మోదీ రాలేకపోతున్నారని కూడా తెలియచేశారు. మలేషియా అధ్యక్షతన జరిగే ఈ సదస్సు విజయవంతం కావాలని ఆశిస్తూ మోదీ కూడా తన ట్వీట్‌లో ఈ వర్చువల్‌ హాజరు అంశాన్ని ఖరారుచేశారు. వ్యక్తిగత గైర్హాజరుకు కారణం దీపావళి వేడుకలంటూ పైకి చెబుతున్నప్పటికీ, దగ్గరపడిన బిహార్‌ ఎన్నికలు కారణం కావచ్చునని విశ్లేషకుల వాదన. కానీ, కాంగ్రెస్‌కు మాత్రం ఇందులో మరోకోణం కనిపించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఈ సదస్సుకు వస్తున్నందున మోదీ ఇలా మొఖం చాటేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి జైరామ్‌ రమేష్‌ అంటున్నారు. ‘సోషల్‌ మీడియాలో ట్రంప్‌ను ఆకాశానికి ఎత్తేయడం వేరు, పక్కనే నిలబడి భుజంభుజం రాసుకోవడం వేరు. ఆపరేషన్‌ సిందూర్‌ను తానే ఆపానని యాభైమూడుసార్లు, భారత్‌ ఇకపై రష్యా చమురు కొనబోదని ఇప్పటికే ఐదుసార్లు చెప్పుకున్న మనిషికి ఎదురుపడటం రిస్కే’ అని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. మొన్నటికి మొన్న గాజా శాంతి సదస్సుకు మోదీ గైర్హాజరు కావడానికి కూడా ఇదే కారణమని గుర్తుచేస్తూ, ఇలా అంతర్జాతీయవేదికలకు మొఖం చాటేస్తూంటే ప్రపంచనాయకులతో ముచ్చట్లు, వారితో ఫోటోలు దిగుతూ తనను తాను విశ్వగురుగా అభివర్ణించుకొనే అవకాశం తప్పిపోతుంది కదా? అని జైరాం రమేష్‌ ఎద్దేవా చేస్తూ, ‘బచ్‌కే రే రహ్నారే బాబా, బచ్‌కే రహ్నారే’ అన్న పాత హిందీ చిత్రగీతాన్ని గుర్తుచేశారు.

బిహార్‌ ఎన్నికలు భారతీయ జనతాపార్టీకి ముఖ్యమే కానీ, ఒక అంతర్జాతీయ సదస్సుకోసం మోదీ ఓ రెండురోజులు తన షెడ్యూల్‌ సర్దుకోలేరా? ఆసియాన్‌తో మనబంధం ఇటీవల బాగా బలపడింది కూడా. అనేకదేశాధినేతలతో చర్చలు జరపగలిగే అవకాశం ఉండికూడా కౌలాలంపూర్‌ పోవద్దన్న నిర్ణయం వెనుక ట్రంప్‌కు ఎదురుపడటం ఎందుకన్న ఆలోచన ఉండే ఉంటుంది. మోదీ తనకు ఆప్తమిత్రుడని అంటూనే ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ట్రంప్‌కు ఎదురుపడటం ప్రమాదమే. అంతా సవ్యంగా ఉన్నప్పుడే ట్రంప్‌తో భేటీ అంటే ఒక అనిశ్చితి. ఓ ప్రమాదహెచ్చరిక. ఎర్రతివాచీలే ఉంటాయన్న నమ్మకమేమీ లేదు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడి గతానుభవం తెలియనిదేమీ కాదు.


గురువారం మళ్ళీ రెండు రష్యన్‌ చమురుకంపెనీలపై ట్రంప్‌ సరికొత్త ఆంక్షలు విధిస్తే, ఇటువంటివి చాలా చూశామని రష్యా తేలికగా తీసిపారేసింది. ముడిచమురు కొనడం ఆపేస్తానని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెబుతున్నప్పుడల్లా మన ప్రభుత్వం ఔననీ, కాదనీ అనకుండా, అతి జాగ్రత్తగా మాట్లాడుతూ వస్తోంది. ట్రంప్‌ మాటలు నమ్మక్కర్లేదని అనుకున్నప్పటికీ, అమెరికా ఒత్తిళ్ళతో గతంలో చాలా రాజీలు పడిన, ఆయా దేశాలనుంచి చమురుకొనడం మానేసిన అనుభవం మనకు ఉన్నది కనుక, ట్రంప్‌ ఒత్తిడిమేరకు రష్యా నుంచి చమురు దిగుమతులు వేగంగా తగ్గించుకొనే ఆలోచనలో భారత్‌ ఉండవచ్చు. దేశప్రయోజనాలే పరమావధి అని పైకి చెబుతున్నప్పటికీ, ప్రస్తుత భారీ దిగుమతుల్లోనూ సామాన్యుల ప్రయోజనాలు అంతగా లేవు కనుక, ఆ నిర్ణయం ఎప్పుడైనా జరగవచ్చు. అధికారంలోకి రాగానే ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించగలననుకున్న ట్రంప్‌ అది సాధ్యం కాకపోవడంతో తలకిందులైపోతున్నారు. పుతిన్‌ను దారికి తేవడం సాధ్యంకాక, మళ్ళీ జెలెన్‌స్కీమీద కన్నెర్రచేశారు. తక్షణమే యుద్ధం ఆగాలంటే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ ఉక్రెయిన్‌ వదులుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఉక్రెయిన్‌కు తోమహాక్‌ క్షిపణులు ఇస్తానని బెదిరించినంతమాత్రాన రష్యా వొణికిపోతుందని అనుకోవడం అవివేకం. రష్యన్‌ నగరాలన్నింటినీ ధ్వసం చేయగల ఆ క్షిపణులు నిజంగానే ఉక్రెయిన్‌ చేతికి వస్తే, అది మరో ప్రపంచయుద్ధానికి దారితీస్తుంది తప్ప యుద్ధం ముగిసిపోదు. ఇంతాచేసి చివరకు జెలెన్‌స్కీకి క్షిపణులు ఇవ్వనుపొమ్మనడం ద్వారా ట్రంప్‌ మరింత పరువుపోగోట్టుకున్నారు. ట్రంప్‌ స్టేట్స్‌మాన్‌ కాదు, షోమాన్‌ అన్న వ్యాఖ్య పూర్తినిజం. పెద్దరికంతో, గుంభనంగా వ్యవహారాలు నెరపడం ఆయనకు తెలియదు. భారత్‌–అమెరికా వాణిజ్యచర్చలు కొలిక్కివచ్చి, ఒప్పందాలమీద సంతకాలు అయ్యేంతవరకూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడే.

ఈ వార్తలు కూడా చదవండి..

అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదు.. వైసీపీపై రఘరామ సెటైర్లు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2025 | 02:07 AM