Durgapur Gangrape Incident: మమతకు మరో పరీక్ష
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:24 AM
పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన అత్యంత బాధాకరమైనది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను, సహకరించిన మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తన సోదరుడు...
పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్‌లో వైద్యవిద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన అత్యంత బాధాకరమైనది. అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను, సహకరించిన మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తన సోదరుడు ఒక వంతెనకింద దాక్కొని ఉన్నాడని ఐదో నిందితుడి సోదరి స్వయంగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. చేసిన తప్పుకు అతడు శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె అంటోంది. భయంతో వొణికిపోతున్న సోదరుడి అకృత్యాన్ని పసిగట్టడమే కాక, ప్రేమాభిమానాలకు లొంగిపోకుండా పోలీసులకు అప్పగించిన ఆమె నడవడికను ప్రశంసించవలసిందే. అయితే, అత్యంత సున్నితమైన ఈ ఘటనలో సైతం కించిత్తు బాధ్యతాయుతమైన ప్రవర్తన రాజకీయనాయకుల్లో కనిపించకపోవడం విషాదం.
తృణమూల్ అధినేత మమతాబెనర్జీ ఏలుబడిలో ఉన్నంతకాలం రాష్ట్రానికి ఈ అకృత్యాలు, అఘాయిత్యాలనుంచి విముక్తిలేదని బీజేపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. నిందితులు ఐదుగురూ తృణమూల్‌కు చెందినవారేననీ, మమత వారిని కాపాడుకొస్తున్నదని అమిత్ మాలవీయవంటివారు బరిలోకి దిగి బల్లగుద్దుతూంటే, అందుకు ఆధారాలేమీ లేవని మీడియా అంటోంది. అర్థరాత్రి పన్నెండున్నరకు కాలేజీ వదిలి మగస్నేహితుడితో బయట తిరగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మమత చేసిన వ్యాఖ్య అగ్నికి ఆజ్యం పోసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆమె అందెవేసిన చెయ్యి. ఆ తరువాత ఆమె తన మాటల్ని వక్రీకరించారంటూ ఏవో సవరణలూ వివరణలూ ఇచ్చినప్పుటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమె వెనక్కుతగ్గినా, బీజేపీ భయానక దాడినుంచి తప్పించుకోవాలంటే ఈ వాదనే సరైనదని ఆమె పార్టీ సహచరులు ఇంకా విశ్వసిస్తున్నట్టు ఉంది.
కోల్‌కతా మహిళలకు క్షేమకరమైన నగరమని ఎన్సీఆర్బీ డేటా వరుసగా నాలుగోసారి ప్రశంసించినందుకు మమత వందిమాగధులంతా ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. కానీ, ఈ ఏడాదిలోనే రెండు విద్యాసంస్థల్లోనూ, ఒక వైద్యసంస్థలోనూ జరిగిన అత్యాచారఘటనలు ప్రజలు మరిచిపోలేదు. గత ఏడాది ఆర్జీకార్ ఆస్పత్రిలో జరిగిన అమానుష కృత్యం యావత్‌దేశాన్నే కుదిపేసింది. సుదీర్ఘకాలం మమతను వెంటాడిన ఆ ఘటన తరువాత,
సరిగ్గా ఏడాదిలోనే మమతకు ఈ దుర్గాపూర్ నుంచి మరో విషమపరీక్ష ఎదురైంది. సదరు వైద్యవిద్యార్థిని ఒడిశాకు చెందినది కావడంతోపాటు, ఈ ఘటనలో నిందితుల మతం కూడా బీజేపీకి ఆయుధంగా ఉపకరిస్తున్నది. పశ్చిమబెంగాల్ ఔరంగజేబు పాలనలో ఉందని బాధితురాలి తండ్రి వ్యాఖ్యానించారు. బాధలో ఉన్న ఆ తండ్రి ఎవరిని ఎన్ని మాటలైనా అనవచ్చు, శాపాలూ పెట్టవచ్చు. కానీ, సహజంగా బీజేపీ నాయకులనుంచి వినవచ్చే ఈ తరహా మాటలు, అంతటి కష్టంలోనూ అతడినోట రావడం విచిత్రం. ఈ దారుణఘటన ఒడిశా ఆత్మగౌరవం మీద దాడి అంటున్నాడతను. కోటిన్నర రూపాయలు పెట్టి ఈ ప్రైవేటు కాలేజీలో సీటు కొనుక్కున్నా, తన కుమార్తెకు ఏ మాత్రం భద్రతలే కపోవడమేమిటని అతడు ప్రశ్నిస్తున్నాడు. ఒడిశానుంచి మంత్రులు, ఉన్నతాధికారులు, మహిళా కమిషన్ పెద్దలు బెంగాల్ వచ్చి కూర్చున్నారు. బాధితురాలికి ఒడిశా ముఖ్యమంత్రి టెలిఫోన్ చేసి ఓదారుస్తూ, పూర్తి భరోసా ఇచ్చారు. మిమ్ములను పరామర్శించడానికి వచ్చిన పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్‌తో మీరంతా మీ బాధను సరిగా పంచుకున్నారా? మీ ఆవేదనను పూర్తిగా తెలియచేశారా? అని బాధితురాలి తల్లిని అడిగి మరీ తెలుసుకున్నారు. ఒడిశా బీజేపీ సర్కార్ సైతం మమతను వదిలిపెట్టదల్చుకోలేదని దీని అర్థం. బెంగాల్ బీజేపీతోనూ, ఢిల్లీలోని వారి అధినాయకులతోనూ పోరాడుతున్న మమతకు ఇప్పుడు పొరుగురాష్ట్రం కూడా కొత్తగా శత్రువైంది. నవీన్‌పట్నాయక్ ఉన్నంత కాలం బెంగాల్, ఒడిశాల మధ్య సఖ్యత ఉండేది. ఇప్పుడది అంతరించి, చిన్నచిన్న వివాదాలు, గిల్లికజ్జాలు మొదలైనాయి. ఇటీవల ఒడిశాలోని కటక్‌లో దుర్గాపూజ సందర్భంగా మతకల్లోలాలు రేగడంపై మమత తీవ్ర విమర్శలు చేశారు. కటక్ తగలబడుతోందని, బీజేపీ రాకతో ఒడిశాలో మతచిచ్చు మొదలైందని, వీళ్ళు ఎక్కడున్నా నాశనమేనంటూ అమె ఘాటుగా విరుచుకుపడ్డారు. దుర్గాపూర్ ఘటనతో అడ్డంగా దొరికిన మమతమీద ఒడిశానేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. బెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఈ విషాదం చుట్టూ సాగుతున్న రాజకీయం ఇప్పట్లో చల్లారే సూచనలు లేవు.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News