Share News

Luxury Coach Carnage: మృత్యుశకటాలు

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:42 AM

కర్నూలు ఘోరప్రమాదానికి కారణమైన ఆ ప్రైవేటు బస్సు మూడు రాష్ట్రాల్లో తన రూపురేఖలు మార్చుకొని మూడుమార్లు రిజిస్టరైందని అధికారులు అంటున్నారు. డ్రైవర్‌ చదువు అర్హతల నుంచి యజమాని...

Luxury Coach Carnage: మృత్యుశకటాలు

కర్నూలు ఘోరప్రమాదానికి కారణమైన ఆ ప్రైవేటు బస్సు మూడు రాష్ట్రాల్లో తన రూపురేఖలు మార్చుకొని మూడుమార్లు రిజిస్టరైందని అధికారులు అంటున్నారు. డ్రైవర్‌ చదువు అర్హతల నుంచి యజమాని బాధ్యతారాహిత్యం వరకూ రోజుకో కొత్త అంశం వెలుగుచూస్తోంది. పందొమ్మిదిమంది ప్రయాణికులు నిస్సహాయస్థితిలో సజీవంగా తగలబడిపోయిన ఈ ఘోర దుర్ఘటనకు డ్రైవర్‌ నుంచి రవాణాశాఖ వరకూ ప్రతీ ఒక్కరూ బాధ్యులే. దీనికి పదిరోజుల ముందే, రాజస్థాన్‌ జైసల్మేర్‌లో ఇటువంటి ఘోరమే జరిగింది. బస్సులో అమర్చిన చవుకబారు ఎయిర్‌ కండిషనర్‌ నిప్పురాజేసిన కారణంగా భారీ ప్రాణనష్టం సంభవించింది. మొన్న ఆదివారం ఆగ్రా–లక్నో ఎక్స్‌ప్రెస్‌ హైవేమీద ఒక బస్సు పూర్తిగా తగలబడి, ప్రయాణికులు అదృష్టవశాత్తూ బతికిబయటపడ్డారు. వేర్వేరు ఘటనలే అయినప్పటికీ, ఉల్లంఘనల్లో ఆరితేరిన ప్రైవేటు బస్సు‍ల విషయంలో పర్యవేక్షక వ్యవస్థల ఉదాసీనతకు ఇవన్నీ తార్కాణాలు.

నగరాలు, మహానగరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కేంద్రాలుగా వృద్ధిచెందుతున్నక్రమంలో, నల్లగా మెరిసే పలువరుసల జాతీయరహదారులమీద పరుగులుతీసే ఈ ‘లగ్జరీకోచ్‌’ల సంఖ్య కూడా అతివేగంగా పెరుగుతూ వచ్చింది. రాత్రివరకూ ఉద్యోగం చేసుకొని, తెల్లారేసరికల్లా ఊళ్ళో వాలగలిగే వీలు వీటితో ఉంది. కొద్దిగంటల్లోనే గమ్యస్థానానికి చేర్చడం, అంతవరకూ సుఖంగా నిద్రించగల సదుపాయం ఉన్నందున ప్రయాణికులు సైతం సౌకర్యాన్ని పరిగణిస్తున్నారే తప్ప ఈ లగ్జరీ బస్సుల అతివేగాన్నీ, ప్రమాదావకాశాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. గంటకు 80కిలోమీటర్లు కూడా దాటని ఆర్టీసీ బస్సుల్లో అధిక సమయం పట్టడమే కాదు, ఎక్కడపడితే అక్కడ ఆగవు, ప్రైవేటు బస్సుల మాదిరిగా హంసతూలికాతల్పాలూ హంగులూ ఆర్భాటాలూ కూడా వాటిలో కనబడవు. మిగతా కంపెనీ బస్సులతో పోటీపడేందుకూ, అధికసంపాదనకూ వీలుగా ప్రైవేటు బస్సులన్నీ ప్యాసింజర్ల కంఫర్ట్‌ పేరిట సీట్లు, రగ్గుల నుంచి, నాజూకైన కిటికీ తెరలవరకూ అన్నింటికీ భగ్గునమండే మెటీరియల్‌నే వాడతాయి. బస్సులో ఏసీలు, టీవీలు, మొబైల్‌ చార్జింగ్‌ యూనిట్ల వంటివి కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఒక చిన్న నిప్పురవ్వను కార్చిచ్చుగా మార్చేందుకు కూడా ఇవన్నీ దోహదం చేస్తున్నాయి. ఇక, ప్రైవేటు బస్సు గర్భంలో ఏ విష రసాయనాలు దాగివున్నాయో, ఏ విస్ఫోటక పదార్థాలు పేలడానికి సిద్ధపడుతున్నాయో ఎవరికీ తెలియదు. భూమికి అంత ఎత్తున ఉండే ఈ లగ్జరీ కోచ్‌ల ఇరుకైన నిర్మాణం ప్రమాదం జరిగినవెంటనే తప్పించుకొనేందుకు అవకాశం ఇవ్వదు. రాకపోకలకు ఒకే రాజమార్గం తప్ప, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అగ్నిమాపకయంత్రాలు, అద్దాలుబద్దలు కొట్టే హేమర్లు ఉండవు. ఉన్నా కూడా, నిద్రలోంచి మేలుకొని, ఏదో జరిగిందని గుర్తించేలోగానే విషవాయువులు కమ్ముకుంటాయి. ఊపిరాడని ఆ స్థితిలో తోపులాటల మధ్యన ప్రయాణికులు ప్రాణాలు వదిలేయాల్సి వస్తోంది.


లాభమే ప్రైవేటుకు పరమావధి కనుక అన్ని విధాలైన ఉల్లంఘలూ జరుగుతున్నాయి. ఫ్యాక్టరీ ప్రమాణాలకు, రిజిస్ట్రేషన్‌ నిబంధనలకు పూర్తి భిన్నంగా డిజైన్‌, సీటింగ్‌, బాడీ ఇత్యాదివన్నీ మారిపోతున్నాయి. బయలుదేరేటప్పుడు అనేకచోట్ల ఆగుతూ, ఆలస్యంగా ప్రయాణం మొదలెట్టే ఈ లగ్జరీకోచ్‌లు గమ్యస్థానాన్ని మాత్రం ఎంతోముందు చేరుకుంటాయి. గమ్యం కాదు, వేగమే వీటి లక్ష్యం కనుక, నిర్లక్ష్యంగా నడిపేవారినీ, మద్యానికి అలవాటుపడ్డవారినీ, తగిన అనుభవం లేనివారిని డ్రైవర్లుగా కూచోబెట్టడానికి కూడా యజమానులు సందేహించరు. కనీస విశ్రాంతి ఇవ్వకుండా వారితో గొడ్డుచాకిరీ చేయించుకోవడానికీ వెనుకాడరు. ఏఐ నుంచి అత్యధునిక సాంకేతికతలవరకూ హైవేలమీద వేటిని వినియోగించినా, ప్రయాణికుల ప్రాణాలపట్ల బస్సు యజమానులకు కాస్తంత ప్రేమ, బాధ్యత లేనిదే ఈ ప్రమాదాలను నివారించడం అసాధ్యం. భద్రతకంటే లాభార్జనకే ప్రాధాన్యం ఇచ్చే ఈ వ్యవస్థను దాడులు, తనిఖీలు, నిరంతర పర్యవేక్షణతోనే నియంత్రించడం సాధ్యం. ఆర్టీసీ తరహాలో స్పీడ్‌లాక్‌ అమలు చేసి, నిబంధనలను ఉల్లంఘిస్తున్నవారిని కఠినంగా శిక్షించాలి. విమానాల్లో మాదిరిగా ప్రయాణికులకు క్షేమంగా బయటపడే మార్గాలను ముందుగా తెలియచెప్పాలి. ప్రతీ ప్రమాదానికీ మానవనిర్లక్ష్యమే కారణం. ప్రతీ తప్పిదం మనకు ఒక పాఠం కావాలి. ప్రజాభద్రత ప్రభుత్వాల బాధ్యత. దానిని నష్టపరిహారాలకు పరిమితం చేయడం సరికాదు.

ఈ వార్తలు కూడా చదవండి..

రైళ్లు రద్దుపై రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రయాణికులకు కీలక సూచన

కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..

For More AP News And Telugu News

Updated Date - Oct 28 , 2025 | 12:42 AM