Share News

Indias Self Reliance in Space: రోదసీలో ఆత్మనిర్భరత

ABN , Publish Date - Nov 05 , 2025 | 02:15 AM

ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన నాలుగువేల నాలుగువందల పదికిలోల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ నిర్దేశిత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి...

Indias Self Reliance in Space: రోదసీలో ఆత్మనిర్భరత

ఇస్రో చరిత్రలో అత్యంత బరువైన నాలుగువేల నాలుగువందల పదికిలోల కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ నిర్దేశిత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. భారత నౌకాదళ సమాచార అవసరాలు తీర్చడానికి ఉద్దేశించిన ఈ అత్యాధునిక ఉపగ్రహాన్ని జియో సింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీవో)లోకి ప్రవేశపెట్టడానికి ఎప్పటిలాగానే బాహుబలి రాకెట్‌ వాహనమైంది. చంద్రయాన్‌ 3లో వాడిన లాంచ్‌ వెహికల్‌ మార్క్‌–3ని సాంకేతికంగా మరిన్ని మెరుగులు దిద్ది, శక్తిని సైతం మరో పదిశాతం పెంచి ఈమారు వినియోగించారు. నలభైమూడున్నర మీటర్ల ఎత్తున్న ఈ వాహక నౌకకు ఇది ఐదో ప్రయాణం. రాబోయే రోజుల్లో మానవసహిత అంతరిక్ష యాత్రలకు ఈ రాకెట్‌నే వాడబోతున్నందున ఈ ప్రయోగం అనేక కారణాల రీత్యా కీలకమైనది. అత్యంత బరువైన ఉపగ్రహాల ప్రయోగానికి ఇతరదేశాల ప్రైవేటు సంస్థలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ ఆత్మనిర్భరత ప్రశంసనీయమైనది.

పన్నెండేళ్ళక్రితం ఫ్రెంచ్‌ గయానానుంచి ప్రయోగించిన జీశాట్‌ 7 కాలపరిమితి ముగియడంతో దానిస్థానంలో మరింత ఆధునికమైన, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ కొత్త ఉపగ్రహం వచ్చిచేరింది. మరో పదేళ్ళపాటు సువిశాల భారతీయ తీరప్రాంతాన్ని కాపలాకాయడంలో మన నౌకాదళానికి తన సమర్థవంతమైన, వేగవంతమైన సేవలతో సహకరించబోతోంది. భారీ ఉపగ్రహాన్ని భద్రంగా దాచుకున్న ఓ అతిభారీ రాకెట్‌ శ్రీహరికోట సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయిన ఈ దృశ్యాలు చూసినవారికి 1960లలో మన శాస్త్రవేత్తలు సైకిల్‌ మీద ఒక రాకెట్‌ విడిభాగాన్ని మోసుకుపోతున్న అలనాటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రం గుర్తుకు వచ్చేవుంటుంది. 1963లో తిరువనంతపురం సమీపంలోని తుంబా ప్రయోగక్షేత్రం నుంచి ఏడువందల పదమూడు కేజీల బరువున్న రాకెట్‌ ఓ ముప్పైకేజీల పేలోడ్‌ని రెండువందల ఏడు కిలోమీటర్ల ఎత్తువరకూ మోసుకుపోవడంతో ఈ ప్రయాణం ఆరంభమైంది. చిన్నచిన్న అడుగులతో ప్రస్థానం కొనసాగి జీఎస్‌ఎల్వీవంటి భారీ రాకెట్‌తో, తరువాత దానిని సైతం పలు రీతుల్లో ఆధునికీకరించుకుంటూ దేశం చేసిన సాహసాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.


ఎడ్లబండి మీద ఉపగ్రహాన్ని తీసుకుపోయిన కాలంనుంచి అంతరిక్షకేంద్రం నిర్మాణానికి నడుంబిగించడం వరకూ సాగిన ‘ఇస్రో’ ప్రస్థానం మనసు పులకింపచేస్తుంది. బడ్జెట్‌ కేటాయింపుల్లో పాలకులు ప్రదర్శించే కాపీనాన్నీ తట్టుకొని నిలిచి, తనకు ఇచ్చినదానితోనే అనేకానేక ప్రయోగాలు చేసింది. ఆంగ్లచిత్రాలకంటే తక్కువ ఖర్చుతో అంతరిక్షయాత్రలు చేసివస్తోంది. గగనయానాలు, చంద్రయానాలు, సూర్యనమస్కారాలు, అంగారక అధ్యయనాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒకేమారు వంద ఉపగ్రహాలను విభిన్నమైన కక్ష్యల్లోకి వెదజల్లగలిగే సమర్థతను పెంచుకుంది. శతాధిక రాకెట్‌ ప్రయోగాలతో ఐదువందల యాభై ఉపగ్రహాలను నింగికి చేర్చింది. విదేశీ ఉపగ్రహప్రయోగ వ్యాపారం చేస్తూ దేశానికి సంపాదించిపెడుతోంది. అంతరిక్షంలో రెండుఉపగ్రహాలను అనుసంధానించి, మళ్ళీ విడదీసిన స్పేడెక్స్‌ ప్రయోగం సాంకేతిక అద్భుతమే కాదు, అంతరిక్ష కేంద్రం నిర్మాణం కలను సాకారం చేయడంలో మరో అడుగు. నేడు అగ్రరాజ్యాల సరసన దేశం తలెత్తుకొని నిలబడటంలో సోవియట్‌ యూనియన్‌ సహకారం విస్మరించలేనిది. తదనంతరం ఆ సహకారానికీ, పరిజ్ఞానం బదలాయింపుకీ అడ్డుపడిన అమెరికా మనను పెట్టిన కష్టాలు ఎప్పటికీ విస్మరించలేనివి.

భారతదేశం నుంచి రోదసీలోకి వెళ్ళబోతున్న గగన్‌యాన్‌ వ్యోమగాములు నలుగురిని ప్రధాని మోదీ గత ఏడాది దేశానికి పరిచయం చేస్తూ, నలభైయేళ్ళ తరువాత భారతీయులు అంతరిక్షంలోకి వెడుతున్నారు అని ఓ మాటన్నారు. మంచి గతాన్ని స్మరించడం మోదీకి ఇష్టం ఉండదు కానీ, ప్రజలకు మాత్రం రాకేశ్‌ శర్మ అంతరిక్షయానం, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రశ్నకు ‘సారే జహాసే అచ్ఛా’ అంటూ అతడిచ్చిన సమాధానం గుర్తుకొచ్చాయి. నలుగురు వీరులను అంతరిక్ష యాత్రకు సిద్ధం చేసే క్రమంలో మొన్న జూన్‌లో శుభాంశు శుక్లా రోదసిలో కాలూనిన రెండవ భారతీయుడుగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో అడుగిడిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ‘నాసా’కు ఆరువందలకోట్లు చెల్లించి మరీ ఈ యాక్సియం4 యాత్రలో పాలుపంచుకున్న శుక్లాకు లభించిన అనుభవం, నైపుణ్యం భారత భవిష్యత్‌ అంతరిక్ష యాత్రలకు ఉపకరిస్తుంది. మరో పదేళ్ళలో సొంత అంతరిక్ష కేంద్రం కట్టుకోవాలని, మరో పన్నెండేళ్ళకు చంద్రుడిమీద మన వ్యోమగాములు కాలూనాలని లక్ష్యాలు పెట్టుకొని దేశాన్ని స్పేస్‌ సూపర్‌పవర్‌గా తీర్చిదిద్దుతున్నందుకు ఇస్రోను అభినందించాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

రహదారుల నాణ్యతలో రాజీపడబోం.. అధికారులకి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్‌ ప్రజాదర్బార్‌

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 02:15 AM