Share News

Economy : చిక్కుల్లో ఆర్థికం...!

ABN , Publish Date - Feb 01 , 2025 | 03:03 AM

దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే కొంత చిక్కుల్లో ఉన్నదన్న విషయం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. మన ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటితో పోల్చితే బలంగానే ఉన్నప్పటికీ దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు సవాళ్లు

Economy : చిక్కుల్లో ఆర్థికం...!

దేశ ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలతో పోల్చితే కొంత చిక్కుల్లో ఉన్నదన్న విషయం శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తేల్చి చెప్పింది. మన ఆర్థిక వృద్ధిరేటు ఇప్పటికీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నింటితో పోల్చితే బలంగానే ఉన్నప్పటికీ దేశీయంగాను, అంతర్జాతీయంగాను పలు సవాళ్లు రాబోయే కాలంలో ఆ జోరుకు పగ్గాలు వేయవచ్చునన్న సంకేతాలు వెలువరించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు 6.3 నుంచి 6.8 శాతం మధ్యన ఉండవచ్చునని అంచనా వేసింది. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలన్న లక్ష్యం నెరవేరాలంటే ఈ వృద్ధిరేటు ఏ మాత్రం సరిపోదు. ఏడాదికి సగటున ఎనిమిది శాతం వృద్ధిని సాధిస్తే తప్ప మనం ఆ లక్ష్యాన్ని చేరడం సాధ్యం కాదు.


గత కొన్నేళ్లుగా ఉన్న సానుకూలతలు క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం వల్ల ఎగుమతుల రంగం ఎదురీదుతోంది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో భారతదేశం వాటా కేవలం 2 శాతం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతుల వృద్ధిరేటు 1.6 శాతానికే పరిమితం అయింది. దీనికి తోడు కొత్తగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన అమెరికా అధ్యక్షుడు ఆత్మరక్షణ విధానాలకు పెద్ద పీట వేస్తున్నారు. దీని వల్ల అమెరికాకు ఎగుమతులు మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ విదేశాల నుంచి ఎదురవుతున్న సవాళ్లయితే దేశీయంగా ద్రవ్యోల్బణం పెనుభూతంగా ఉంది. గత ఏడాది రుతుపవనాల సానుకూలత కారణంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొనుగోలుశక్తి పెరిగినప్పటికీ నగర జీవులు మాత్రం ధరల కాటుకు విలవిలలాడుతూనే ఉన్నారు. ఫలితంగా వారి కొనుగోలు శక్తి తగ్గిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగల రీతిలో వారి వేతనాలు పెరగడంలేదు. ఈ అస్థిరతల నుంచి బయటపడి నిలకడ వృద్ధిరేటు సాధించాలంటే భిన్న రంగాల్లో సంస్కరణలు చేపట్టక తప్పదన్న విషయం ఆర్థిక సర్వే నివేదికలో తేల్చి చెప్పారు. దేశీయంగా వృద్ధికి ఊతం ఇచ్చే రంగాలను ఉత్తేజితం చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. ప్రధానంగా వాణిజ్యం, ఎగుమతులు, పారిశ్రామిక రంగాల విషయంలో నియంత్రణలు సడలించడం, సుంకాలు హేతుబద్ధం చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నది ఆర్థిక సర్వే సారాంశం. దేశంలో ఉపాధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నది ఎంఎస్‌ఎంఈ రంగమే. ఈ రంగంలో ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మితిమీరిన నియంత్రణలను సడలించి పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలని సర్వేలో సూచించారు. అలాగే దేశంలో ఇప్పటికీ పప్పుదినుసులు, వంటనూనెల కొరత అధికంగా ఉంది. ఆ కొరతను అధిగమించేందుకు ఇప్పటికీ భారీ పరిమాణంలో వాటిని దిగుమతి చేసుకుంటున్నాం. అవసరాన్ని మించి తృణ ధాన్యాలు ఉత్పత్తి చేయడాన్ని నిలువరించి పప్పులు, నూనెగింజల ఉత్పత్తిని పెంచడం అవసరమన్న విషయం సర్వే తేల్చి చెప్పింది. ఒకపక్క మార్కెట్‌ ధరల్లో ఆటుపోట్ల నుంచి రైతులకు రక్షణ కల్పించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కావడంతో పాటు మరోపక్క సాధారణ గృహస్థులకు రక్షణ కల్పించే సమాంతర వ్యవస్థ ఒకటి ఉండాలని సూచించింది. ఇక ఎగుమతులు ఉత్తేజితం చేయాలంటే వాణిజ్య సంబంధిత వ్యయాలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. అప్పుడే భారత్‌ పోటీ సామర్థ్యం పెంచుకోగలుగుతుంది.


ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం కావాలంటే మధ్యతరగతి ప్రజల ఆదాయాలు పెరగాలని, కంపెనీలు వేతనాల పెంపునకు చర్యలు తీసుకోవడం అవసరమన్న విషయం నాగేశ్వరన్‌ ఒక చక్కని ఉదాహరణ ద్వారా చెప్పారు. వేతనాల్లో అరకొర వృద్ధి ఉన్నట్టయితే తాను ఉత్పత్తి చేస్తున్న కార్లు అమ్ముడుపోవని ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ వ్యవస్థాపకుడు హెన్రీ ఫోర్డ్‌ గుర్తించారని వ్యాఖ్యానించడం ద్వారా కార్పొరేట్లు లాభాలు మూటగట్టుకుంటే సరిపోదని, దాన్ని ఉద్యోగులకు కూడా వేతన వృద్ధి రూపంలో పంచినప్పుడే ఆర్థిక వృద్ధికి దోహదకారులవుతారని ఆయన స్పష్టంగా సూచించారు. మొత్తం మీద ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడి దేశం స్థిరమైన వృద్ధిరేటు సాధించే దిశగా అడుగేయాలంటే సంస్కరణలను ఆశ్రయించక తప్పదు. ఒక పక్క వ్యయాలను నియంత్రించుకుంటూ మరోపక్క స్థిరమైన వృద్ధిని కొనసాగించడం ద్వారా వికసిత్‌ భారత్‌కు బాటలు వేయడం అనేది కత్తిమీద సాము అనక తప్పదు. ఆర్థిక సర్వేలో సూచించిన భిన్న మార్గాల్లో పయనిస్తూ దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేటి బడ్జెట్లో ఏ విధమైన బాటలు వేస్తారన్నది వేచి చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి...

Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే

Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్

Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు

AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 03:03 AM