Share News

Goa Tragedy: గోవాలో ఘోరం

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:41 AM

గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మన వ్యవస్థల బాధ్యతారాహిత్యానికీ, ప్రజల ప్రాణాలపట్ల ఉన్న నిర్లక్ష్యానికీ నిలువెత్తు నిదర్శనం. అధికారులు ఏమాత్రం నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నా...

Goa Tragedy: గోవాలో ఘోరం

గోవా నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం మన వ్యవస్థల బాధ్యతారాహిత్యానికీ, ప్రజల ప్రాణాలపట్ల ఉన్న నిర్లక్ష్యానికీ నిలువెత్తు నిదర్శనం. అధికారులు ఏమాత్రం నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నా, పాతికమంది ప్రాణాలు హరించిన ఈ దుర్ఘటన జరిగేది కాదు. అర్పోరా గ్రామ సమీపంలోని ఈ నైట్‌క్లబ్‌లో ప్రమాదం సంభవించగానే రెండేళ్ళుగా అది ఏ అనుమతులూ లేకుండా, చట్టవిరుద్ధంగా నడుస్తున్న సత్యాన్ని అప్పుడే తెలుసుకున్నట్టుగా మొఖంపెట్టి, సంతాపంతో పాటు, బాధితకుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. ఈ దేశంలో అక్రమాలు యథేచ్ఛగా సాగిపోతూంటాయి, నేరాలూ ఘోరాలూ జరగ్గానే ఎప్పటిలాగానే ప్రభుత్వాలు కొత్తగా ఆశ్చర్యపోతూంటాయి. దుర్ఘటనలకు కారణమైన సంస్థలకో, పరిశ్రమలకో, వాహనాలకో అనుమతులే లేవని తేల్చేస్తే తప్పు వాటిమీదకు పోతుందని, ప్రజలదృష్టి మారిపోతుందని ప్రభుత్వాలకు ఓ నమ్మకం.

రెండేళ్ళక్రితం గ్రామపంచాయితీ ఈ నైట్‌క్లబ్‌ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నోటీసులు ఇచ్చి, మరో ఆర్నెల్ల తరువాత కూల్చివేతకు సిద్ధపడితే, స్థలయజమాని పై స్థాయిలో ప్రయత్నాలు చేసుకొని, యథాతథస్థితి కొనసాగేట్టుగా చూసుకున్నాడట. రాష్ట్ర శాసనసభలో ఈ నైట్‌క్లబ్‌ ప్రస్తావన ఆగస్టులో వచ్చి, మొత్తంగా అక్రమ నైట్‌క్లబ్‌లమీద చర్చ జరిగింది కనుక, ఇదేమీ ప్రభుత్వం దృష్టికి రాని, దానికి తెలియకుండా పోయిన అంశమేమీ కాదు. కఠినచర్యలు ఇప్పుడు హామీపడుతున్న ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ మూడునెలల క్రితమే ఆ పనిచేసివుంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదు. అడ్డదారిలో ఏర్పడిన క్లబ్‌ కనుక, ఏదీ సక్రమంగా లేకపోయింది. ఏకైక రాకపోకలమార్గం ఇరుకుగా ఉండటమే కాక, తగలబడుతున్న ఆ నైట్‌క్లబ్‌ దగ్గరగా పోయేందుకు కూడా అవకాశం లేక ఫైరింజన్లు అరకిలోమీటరు ఇవతలే ఆగిపోవాల్సివచ్చిందట. విస్తృతంగా వెదురు, గడ్డి ఉపయోగించి తయారుచేసిన పైకప్పును సులువుగా తగలబడే పదార్థాలతో మరింత సుందరంగా ఈ నైట్‌క్లబ్‌ నిర్వాహకులు తీర్చిదిద్దారు. టపాసులు కాలిస్తే తగలబడుతుందన్న భయం, జ్ఞానం వారికి లేవనుకోవాలో, పోతేపోనీ అన్న నిర్లక్ష్యమో తెలియదు. మంటల్లో బయటకుపోయే దారిలేక వంటసామగ్రితో పాటు ఇతరత్రా అనేకం ఉంచిన ఇరుకైన బేస్‌మెంట్‌లోకి దిగి, తిరిగి పైకి రాలేక చాలా మంది పొగకు ఉక్కిరిబిక్కిరై ప్రాణాలు విడిచారట. మంటలు రేగగానే విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఆ చీకట్లో జరిగిన తొక్కిసలాట అధిక ప్రాణనష్టానికి దోహదం చేసిందని అంటున్నారు.


ఎంతోకాలంగా వెలుగులీనుతూ, పర్యాటకులను ఆకర్షిస్తూ, సర్వమూ విక్రయిస్తూ, చక్కగా వ్యాపారం చేసుకుంటున్న ఒక నైట్‌క్లబ్‌ను అధికారులు అక్రమం పేరిట స్వేచ్ఛగా వదిలేసి ప్రోత్సహించిన ఫలితం ఈ దారుణఘటన. ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదంటూ పాలకుల భీషణ ప్రతిజ్ఞలు, కొన్ని అరెస్టులు, ఆరోపణలూ ప్రత్యారోపణలూ ఎప్పటిలాగానే స్క్రిప్ట్‌కు అనుగుణంగా సాగిపోతున్నాయి. ఘోరం జరిగిన ప్రదేశం మారింది తప్ప, మిగతా అంతా పాత కథే. ప్రమాదాలు జరగడం, అమాయకులు మరణించడం, విచారణకు ఆదేశించడం, మళ్ళీ ఘోరం జరిగేంతవరకూ ఆ ఊసు లేకపోవడం షరా మామూలే. జైపూర్‌ ఆస్పత్రిలోనూ, రాజ్‌కోట్‌ గేమింగ్‌జోన్‌లోనూ జరిగిన ఘోర అగ్నిప్రమాదాలను ఈ దుర్ఘటన తిరిగి గుర్తుచేస్తోంది. ఢిల్లీ సహా దేశంలో పలుప్రాంతాల్లో పిల్లల ఆస్పత్రుల్లో సంభవించిన ప్రమాదాలు కళ్ళముందు కదలాడుతున్నాయి. పర్యాటకంమీద ఆధారపడే గోవాలో ప్రజల ప్రాణాలకు భద్రతలేదన్న సందేశంపోవడం దాని మనుగడకు మంచిదికాదు. విదేశీయులు తరలివచ్చే ఇటువంటి చోట్లలో దుర్ఘటనలు జరగడం అంతర్జాతీయంగా మనకు అప్రదిష్ట తెస్తుంది. దేశంలోని వివిధ నగరాలనుంచి గోవాకు తరలివచ్చే యువతరం గణనీయంగా ఉన్న నేపథ్యంలో, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న నైట్‌క్లబ్‌లు వారికి కనీస రక్షణ కల్పించలేకపోవడం సరికాదు. పర్యాటకం నుంచి భారీగా ఆదాయం పొందుతున్న ప్రభుత్వం తగిన నియంత్రణలు లేక, ప్రాణాలకు పూచీపడలేక చేతులు ఎత్తేసిందన్న సందేశాలు వెలువడటం తప్పు. ప్రతీ దుర్ఘటన మనకు ఒక హెచ్చరిక. ప్రజల భద్రతకు పూచీపడే, వారి ప్రాణాలకు విలువనిచ్చే విధానాలను, వ్యవస్థలను తయారుచేసుకొని, తప్పిదాలనుంచి పాఠాలు నేర్చుకోగలిగితే ప్రమాదాలు పునరావృతం కాకుండా నిరోధించవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ప్రత్యేకతలు..

ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఎప్పుడంటే..?

For More TG News And Telugu News

Updated Date - Dec 10 , 2025 | 12:41 AM