Share News

బిహార్‌లో ఎన్నికల వేడి

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:23 AM

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మా చెడ్డ కోపం వచ్చింది. మీ నాన్నను రాజకీయాల్లోకి తెచ్చిందీ, ఉద్ధరించిందీ నేనే, నాముందా నీ కుప్పిగంతులు అంటూ లాలూ యాదవ్‌...

బిహార్‌లో ఎన్నికల వేడి

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌కు మా చెడ్డ కోపం వచ్చింది. మీ నాన్నను రాజకీయాల్లోకి తెచ్చిందీ, ఉద్ధరించిందీ నేనే, నాముందా నీ కుప్పిగంతులు అంటూ లాలూ యాదవ్‌ కుమారుడిమీద మంగళవారం అసెంబ్లీలో వీరంగం వేశారు. ఆదాయం ఆవగింజంత పెరగకున్నా, బడ్జెట్‌ని మాత్రం భారీగా వండేస్తున్నారని విమర్శిస్తూ తన తండ్రి ఏలుబడిలో రాష్ట్రం వెలిగిందనీ, ఇప్పుడన్నీ గారడీలేనని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ వ్యాఖ్యానించడంతో నితీశ్‌ కోపం నసాళానికి అంటింది. మీ నాన్నను తయారుచేసిందీ, పెంచిందీ నేను.. మీ నాన్న ఏలుబడిలో అసలేం ఉంది, అంతా చీకటి, సాయంత్రమైతే బయటకు రావడానికి జనం జడుసుకొనేవారు, అప్పుడు నువ్వు పిల్లాడివి, పోయి ఆ జనాన్ని అడుగు నిజాలు తెలుస్తాయి అని నితీశ్‌ ఆగ్రహించారు. లాలూ సొంతకులానికి చెందినవారే ఆయన ఎదుగుదలను వ్యతిరేకిస్తుంటే, తాను మాత్రం ఆయనను పైకి తీసుకొచ్చానని నితీశ్‌ చెప్పుకొచ్చారు. మరో తొమ్మిదినెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రాబోయే రోజుల్లో ఇటువంటి దృశ్యాలు చాలా చూడాల్సి ఉంటుంది.


లాలూ ఏలుబడిలో బిహార్‌లో ఆటవిక రాజ్యం కొనసాగిందని నితీశ్‌తో పాటు, ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆ రాష్ట్ర ప్రజలకు గుర్తుచేశారు. పదిరోజుల క్రితం ఆయన బిహార్‌లో చేసిన పర్యటనతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసినట్టుగా కనిపించింది. అన్నదాతలకు పెట్టుబడిసాయం అందించే పీఎం కిసాన్‌ పథకం 19వ విడత నిధుల విడుదల కార్యక్రమానికి ప్రధాని బిహార్‌లోని భాగల్పూర్‌ను ఎంచుకున్నారు. నిధుల విడుదలతో పాటుగా, లాలూ కుటుంబాన్ని పేరెత్తకుండా విమర్శించారు. పశువుల దాణాను బుక్కేసినవారికి రైతు సంక్షేమం పట్టదన్నారు. కుంభమేళా మీద లాలూ ప్రసాద్‌ చేసిన విమర్శలను ప్రత్యేకంగా ప్రస్తావించి, జంగల్‌రాజ్‌ను నమ్ముకున్నవారు మన ఘనమైన వారసత్వాన్ని, విశ్వాసాలను అవమానిస్తారంటూ విరుచుకుపడ్డారు. మహాశివరాత్రికి రెండురోజుల ముందు జరిగిన ఈ సదస్సులో మహాకుంభ్‌ను అవమానించినవారిని రాష్ట్రప్రజలు కఠినంగా శిక్షించాలని కూడా మోదీ పిలుపునిచ్చారు. యూపీ మాదిరిగా బిహార్‌లో మతరాజకీయాలు చెల్లవన్నది అందరూ నమ్ముతున్నమాట. ఈ భాగల్పూర్‌ నుంచే మూడునెలల క్రితం కేంద్రమంత్రి హిందూ స్వాభిమాన్‌ యాత్ర చేస్తే జనం పెద్ద పట్టించుకోలేదు. అయినప్పటికీ, ఘనమైన రామమందిర నిర్మాణాన్ని జీర్ణించుకోలేనివారు మహాకుంభ్‌ని ఆడిపోసుకుంటున్నారని, ప్రజలే వీరిని శిక్షించాలని మతాన్ని సమపాళ్ళలో మేళవిస్తూ మోదీ చేసిన ఈ వ్యాఖ్య కచ్చితంగా హిందూ ఓబీసీలను, మహిళలను తాకుతుందని బీజేపీ నాయకుల ఆశ. రాబోయే రోజుల్లో బిహార్‌లో బీజేపీ సాగించబోయే ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతున్నదో ఊహించుకోవచ్చు.


ముఖ్యమంత్రి ఎవరో ముందుగా చెప్పకుండా, మోదీ మొఖాన్ని ముందుపెట్టుకొని ఎన్నికల ప్రచారం సాగించే సంప్రదాయానికి కూడా ఈ మారు తెరపడింది. కేంద్రంలో తమకు వెన్నుదన్నుగా ఉన్న నితీశ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేల్చిచెప్పి, బీజేపీ ఆయన వెంటే నడుస్తోంది. నితీశ్‌ ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో మొత్తం ఏడుగురినీ బీజేపీ నుంచే చేర్చుకున్నారు. దీనితో 36మంది మంత్రుల్లో నితీశ్‌ సహా జెడీయూకు చెందినవారు 13మంది ఉంటే, బీజేపీ నుంచి ఎనిమిది మంది అధికం. బీజేపీతో మరింత బలమైన బంధానికి ఇది నిదర్శనమని, రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి దిగబోతున్నామని జేడీయూ నాయకులు చెప్పుకుంటున్నారు. ఐదేళ్ళనాటి అసెంబ్లీ ఎన్నికల్లో 115 స్థానాల్లో పోటీచేసిన జేడీయూ 43మాత్రమే గెలుచుకుంటే, 110కి 74నెగ్గి బీజేపీ మంచి స్కోర్‌నీ, రన్‌రేట్‌నీ సాధించింది. దీనితో నాలుగు దశాబ్దాల తరువాత బీజేపీ పెద్దన్న స్థానాన్ని ఆక్రమించి నితీశ్‌కు ఆశీస్సులు అందించింది. ఆయననే కుర్చీలో కొనసాగనిచ్చి కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడింది. ఈ సమయాన్ని బీజేపీ ఎంతో చక్కగా వినియోగించుకొని బిహార్‌లో మరింతగా విస్తరించిందని అంటారు. మహారాష్ట్రలో చిన్న భాగస్వామిగా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా ఎదిగి అంతిమంగా శివసేనను మింగేసిన వైనం తెలిసిందే. కానీ, ఆరునూరైనా కుర్చీనుంచి దిగకుండా ఉండటం కోసం ఇప్పటికే పలుమార్లు బీజేపీ, ఆర్జేడీలను అటూ ఇటూ మార్చిన నితీశ్‌ ప్రస్తుతానికి చేయగలిగింది కూడా ఏమీ లేదు. తొమ్మిదిసార్లు సీఎం అయినా ఒక్కసారి కూడా నేరుగా ప్రజలనుంచి నెగ్గలేదంటూ ఆయనను పల్టూరామ్‌గా హేళన చేసిన ఆర్జేడీ నాయకుడు సునీల్‌కుమార్‌సింగ్‌ను శాసనమండలి బహిష్కరించడం, సుప్రీంకోర్టు ఆయనను తిరిగి సభలోకి అనుమతించడం తెలిసిందే. ప్రజలు ఈమారు నితీశ్‌ను బాహుబలి చేస్తారో, మరింత బలహీనపరుస్తారో చూడాలి.


Also Read:

మరీ ఇంత మూఢనమ్మకమా..

లాలూ నావల్లే ఎదిగారు.. తేజస్విపై విరుచుకుపడిన నితీష్

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 05 , 2025 | 04:23 AM