Share News

EC Expands Voter List Revision: బిహార్‌ దాటిన సర్‌

ABN , Publish Date - Oct 29 , 2025 | 01:58 AM

తాను కోరుకున్నట్టుగానే బిహర్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) పూర్తిచేయగలిగిన ఎన్నికల సంఘం ఇప్పుడు రెండో దశలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో...

EC Expands Voter List Revision: బిహార్‌ దాటిన సర్‌

తాను కోరుకున్నట్టుగానే బిహర్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) పూర్తిచేయగలిగిన ఎన్నికల సంఘం ఇప్పుడు రెండో దశలో తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలలో జాబితా ప్రక్షాళనకు నడుంబిగించింది. బిహార్‌లో ఏడున్నరకోట్ల ఓటర్ల సవరణే వివాదాస్పదమై, వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ పోయిన నేపథ్యంలో, ఇప్పుడు నాలుగు నెలల్లో ఏకంగా యాభైకోట్లమంది ఓటర్ల పుట్టుపూర్వోత్తరాలను పరిశీలించి, ప్రక్షాళించాలని ఈసీ నిర్ణయించింది. నెలకోదశని పూర్తిచేసుకుంటూ ఫిబ్రవరిలోగా పని ముగించబోతోంది. వచ్చే ఏడాది ఎన్నికలకు పోబోతున్న విపక్ష పాలిత రాష్ట్రాలు కూడా ఈ సవరణలో ఉన్నందున దేశం ఇకపై తీవ్రవాగ్యుద్ధాలను చూడక తప్పదు.

‘బిహార్‌ ‘సర్‌’ లేవనెత్తిన అనుమానాలూ ప్రశ్నలకూ ఇప్పటికీ జవాబులు లేవు, ఇప్పుడు దానిని మరింత విస్తరించడానికి ఈసీ సిద్ధపడింది, కొత్త ఓటర్లను చేర్చకుండా ఏకంగా అరవైఐదులక్షల మందిని అనర్హులుగా మార్చేసిన బిహార్‌ దారిలోనే మిగతా దేశాన్నీ ఈసీ నడిపించాలనుకుంటోంది’ అని కాంగ్రెస్‌ విమర్శించింది. పశ్చిమబెంగాల్‌తో ఈసీకి ఎలాంటి ఘర్షణాలేదని, రాజ్యాంగబద్ధ విధిని తాము నిర్వర్తిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ విలేఖరులముందు చేసిన వ్యాఖ్య జరగబోయే రచ్చని ముందే తెలియచెబుతోంది. బెంగాల్‌లో సమగ్ర సవరణకు ఉపక్రమిస్తే రక్తపాతాలైపోతాయన్న తరహాలో మమతాబెనర్జీ గతంలోనే కొన్ని హెచ్చరికలు చేశారు. ఏ మాత్రం లెక్క తేడావచ్చినా ఊరుకొనేది లేదని ఈసీ ప్రకటన తరువాత కూడా ఆమె పార్టీ ఘాటుగానే హెచ్చరించింది. బీజేపీ అసలు లక్ష్యం బెంగాల్ మాత్రమేనని, ముందుగా బిహార్‌లో రిహార్సల్స్‌ జరిగిందని తృణమూల్‌ విమర్శ. రాష్ట్రంలో బీజేపీ బలంగా, దూకుడుగా ఉన్న నేపథ్యంలో, ప్రతీ ఓటరు జోడింపు తొలగింపు తీవ్రవివాదం కావచ్చు. తమిళనాడు, కేరళ పాలకపక్షాలు కూడా ఎన్నికల సంఘం నిర్ణయాన్ని గట్టిగా ప్రశ్నించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో ఎన్నికలు జరగబోతున్నందున తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, కేరళ రాష్ట్రాల్లో ఇంత హడావుడిగా జాబితాలను సవరించాల్సిన అవసరం ఏముందని ఆ పార్టీలు అడుగుతున్నాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ యావత్‌ ప్రక్రియమీదా కన్నేసి ఉంచేందుకు పీడీఏ (పిఛ్‌డే, దళిత్‌, అల్పసంఖ్యాక్‌) దళాలను రంగంలోకి దింపబోతున్నట్టు ప్రకటించింది. మోదీ ప్రభుత్వం పక్షాన, అది చెబుతున్నరీతిలో ఈ ప్రక్షాళన జరుగుతోందని ఆరోపిస్తున్న విపక్షపార్టీలు తమవాదనను నిరూపించుకోవడానికి శతథాప్రయత్నిస్తాయి. ఒక రాజకీయపార్టీగా బీజేపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఏ మాత్రం ప్రశ్నించకుండా, దానిని ఏకపక్షంగా వెనకేసుకురావడం విపక్షాలకు ఆయుధంగా ఉపకరిస్తోంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు ఈసీ చర్యలను సమర్థించడం, ఇండియా కూటమి పార్టీలు వ్యతిరేకించడంతో, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవలసిన ఇటువంటి కార్యక్రమాలు సైతం రాజకీయమయమైపోతున్నాయి.


చట్టవిరుద్ధమని తేలితే ‘సర్‌’ను సమూలంగా రద్దుచేస్తానని ఆదిలో ఘాటైన హెచ్చరికలు చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఆ తరువాత ఈసీ వాదనలకు లొంగిన కారణంగానే ఇప్పుడు సదరు ప్రక్రియ బిహార్‌ దాటి దేశమంతా విస్తరించగలుగుతోంది. తన స్వతంత్రతనూ, స్వేచ్ఛనూ అడ్డుకోవద్దన్న ఈసీ వాదనకు సుప్రీం సరేనంటూ, ఏవో చిన్న సవరణలతో పాటు, ఆధార్‌ను కేవలం ఒక గుర్తింపు పత్రంగా చేర్పించగలిగింది. ఓటరు సమర్పించాల్సిన యోగ్యతాపత్రాల జాబితాలో దానిని చిట్టచివరన ఉంచేందుకు ఈసీ అయిష్టంగానే ఒప్పుకుంది. దేశవ్యాప్త‍ ఓటరుజాబితాల శుద్ధీకరణకు ఎన్నికల సంఘానికి బిహార్‌ ప్రయోగకేంద్రంగా ఉపకరించింది. ఒక పోలింగ్‌ బూత్‌ను 1200 మంది ఓటర్లకు పరిమితం చేయడం, ఈవీఎంల మీద అభ్యర్థుల కలర్‌ ఫోటోలు ఇత్యాది 17 కొత్త సంస్కరణలకు కూడా బిహార్‌ పునాదిగా పనిచేసింది. రాహుల్‌ చేసిన ‘ఓట్‌ చోరీ’ ఆరోపణలు, ఓట్‌ అధికార యాత్రలు ఎన్నికల సంఘాన్ని ఆత్మరక్షణలోకి నెట్టినమాట నిజం. నిరూపించు లేదా క్షమాపణలు చెప్పు అని రాహుల్‌ మీద విరుచుకుపడిన ఈసీ కూడా బిహార్‌ అనుభవాలనుంచి చాలా పాఠాలు నేర్చుకొని, అనేక విధానపరమైన మార్పుచేర్పులతో రెండోదశకు ఉపక్రమించిన నేపథ్యంలో, అన్ని పార్టీలూ సంఘానికి సహకరించాలి. ప్రక్రియ ఆరంభంలో ఆయా రాష్ట్రాల రాజకీయపక్షాలతో చర్చలు జరపడమే కాక, అది పూర్తిగా ముగిసేంతవరకూ వాటి సలహాలు, అభ్యంతరాలను స్వీకరించగలిగినప్పుడే ఈ భారీ కార్యక్రమాన్ని ఈసీ సవ్యంగా, సంతృప్తికరంగా పూర్తిచేయగలుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుపాను.. ఎమ్మెల్యేలకు లోకేష్ ముఖ్య సూచనలు

ఆ జిల్లా ప్రజలను వణికిస్తోన్న తుపాను హెచ్చరికలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 01:58 AM